ప్రెస్ రివ్యూ: ఆధార్‌ లేదని వైద్యం నిరాకరణ.. కార్గిల్ అమరవీరుడి భార్య మృతి

  • 31 డిసెంబర్ 2017
ఆధార్ కార్డు సింబాలిక్ ఫొటో Image copyright NOAH SEELAM/AFP/Getty Images

ఆధార్‌ కార్డు లేదన్న కారణంతో ఒక ఆస్పత్రి యాజమాన్యం ఓ మహిళకు చికిత్స నిరాకరించడంతో పరిస్థితి విషమించి ఆమె చనిపోయారని 'నవ తెలంగాణ' పేర్కొంది.

హరియాణాలోని సోనిపట్ జిల్లాలో ఈ ఘటన జరిగిందని, మృతురాలు కార్గిల్‌ యద్ధంలో ప్రాణాలొదిలిన జవాను భార్య అని పత్రిక చెప్పింది.

''పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- అమర జవాను విజయంత్‌ తపార్‌ భార్య కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయంత్‌ కొడుకు పవన్‌కుమార్‌ తన తల్లిని శుక్రవారం సోనిపట్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆధార్‌ కార్డు లేదన్న కారణంతో డాక్టర్లు వైద్యం చేసేందుకు నిరాకరించారు. తన తల్లి పరిస్థితి విషమంగా ఉందని, ఎలాగైనా చికిత్స చేయాలని వైద్యులను పవన్‌ కుమార్‌ వేడుకున్నాడు. తన మొబైల్‌లో ఉన్న ఆధార్‌ కార్డు కాపీని కూడా చూపించాడు. ఒరిజినల్‌ కార్డు తీసుకురావాలని వైద్యులు మెలిక పెట్టారు. ఆధార్‌ కార్డు ఇంటి వద్ద ఉందని, గంటలో తెచ్చిస్తానని అతడు చెప్పినా వారు వినలేదు. ఇంతలో పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు విడిచారు'' అని నవ తెలంగాణ రాసింది.

ఆధార్‌ లేదన్న కారణంతో వైద్యం నిరాకరించామన్నది అవాస్తవమని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది.

Image copyright NOAH SEELAM/AFP/Getty Images)

‘మధుమేహుల కంటే మానసిక రోగులే ఎక్కువ’

దేశంలో మధుమేహం బాధితుల కంటే మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితి ఏర్పడటం ఆందోళన కలిగిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు.

మానసిక వ్యాధుల సమస్య రోజురోజుకూ పెరుగుతూ ఉద్ధృతమయ్యేలా కనిపిస్తోందని, 2022 కల్లా మానసిక రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన కేంద్రాలను పూర్తిస్థాయిలో నెలకొల్పాల్సి ఉందని ఆయన చెప్పారని 'సాక్షి' తెలిపింది.

బెంగళూరులోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్' స్నాతకోత్సవంలో రాష్ట్రపతి మాట్లాడారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆరోగ్య సంస్థలతోపాటు ప్రైవేటు సంస్థలు కృషిచేయాలని పిలుపునిచ్చారు.

Image copyright Twitter/Hyderabad Metro Rail

హైదరాబాద్ మెట్రో: నేడు రాత్రి రెండు గంటల వరకు సేవలు

హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను డిసెంబరు 31న (ఆదివారం) అర్ధరాత్రి దాటాక రెండు గంటల వరకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారని ‘ఆంధ్రజ్యోతి’ తెలిపింది.

సాధారణంగా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో సేవలు ఉంటాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ఇప్పుడు మెట్రో రైళ్ల సమయాన్ని అధికారులు పొడిగించారు.

తెలంగాణ: నేటి అర్ధరాత్రి నుంచి సాగుకు నిరంతర విద్యుత్

తెలంగాణవ్యాప్తంగా వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్‌ సరఫరా డిసెంబరు 31 అర్ధరాత్రి నుంచి అమలు కానుందని ‘నమస్తే తెలంగాణ’ తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కానుందని పత్రిక పేర్కొంది. ఇందుకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేలా విద్యుత్ సంస్థలు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయని చెప్పింది.

వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ సరఫరాకు సుమారు 7,500 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారని ‘నమస్తే తెలంగాణ’ రాసింది.

Image copyright Getty Images

2018: ఏపీలో 110 సెలవులు

కొత్త సంవత్సరం 2018లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు 110 సెలవులు వచ్చాయని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది. ''రాజధాని అమరావతిలో ఉండే శాఖాధిపతుల(హెచ్‌వోడీ) కార్యాలయాలు, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు శనివారాలు కూడా కలిసి వచ్చాయి. పండుగలు, పర్వదినాలు, శనివారాలతో కలిపితే సంవత్సరం మొత్తం మీద 110 సెలవులు వచ్చాయి'' అని తెలిపింది.

జనవరిలో 11, ఫిబ్రవరిలో 9, మార్చిలో 11, ఏప్రిల్‌లో 10, మేలో 8, జూన్‌లో 8, ఆగస్టులో 10, సెప్టెంబరులో 12, అక్టోబరులో 11, నవంబరులో 10, డిసెంబరులో 10 చొప్పున సెలవులు వచ్చాయని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.

శనివారాలు, ఆదివారాలు కాకుండా ఇతర పనిదినాల్లో వచ్చిన సెలవులు: జనవరి 15(సంక్రాంతి), 16(కనుమ) 26(గణతంత్ర దినోత్సవం), ఫిబ్రవరి 13(మహాశివరాత్రి), మార్చి 2(హోళీ), 30(గుడ్‌ ఫ్రైడే), ఏప్రిల్‌ 5(బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి), ఆగస్టు 15(స్వాతంత్య్ర దినోత్సవం), 22(బక్రీద్‌), సెప్టెంబరు 3(కృష్ణాష్టమి), 13(వినాయక చవితి), 21(మొహర్రం), అక్టోబరు 2(గాంధీ జయంతి), 17(దుర్గాష్టమి), 18(విజయదశమి), నవంబరు 7(దీపావళి), 21(మిలాద్‌ ఉన్‌ నబి), డిసెంబరు 25(క్రిస్మస్‌).

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)