మంటల్లో చిక్కుకుంటే ఏం చేయాలి?

  • 31 డిసెంబర్ 2017
fire Image copyright Getty Images

ఇటీవల ముంబయి కమలా మిల్స్ కాంపౌండ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో, రెస్టారెంట్లు, దుకాణ సముదాయాలు, ఇళ్లు, కార్యాలయాల్లో ఇలాంటి ప్రమాదాల ముప్పుపై మళ్లీ చర్చ మొదలైంది.

అగ్ని ప్రమాదాల నివారణ, అవి సంభవించినప్పుడు అక్కడున్నవారు ఎలా స్పందించాలి అనే అంశాలపై ముంబయి డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్(ఇన్‌ఛార్జి) కైలాస్ హివ్రాలేతో బీబీసీ మాట్లాడింది.

అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు బెంబేలెత్తిపోకుండా నిబ్బరంగా, ధైర్యంగా స్పందించాలని, అదే అత్యంత ప్రధానమని కైలాస్ చెప్పారు.

విద్యుత్, ఏదైనా ఇంధనంపై ఆధారపడి పనిచేసే వస్తువుల వాడకంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలు ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. సారాంశం కైలాస్ మాటల్లోనే...

Image copyright AMOL RODE/BBC MARATHI

ముందు జాగ్రత్తలు తప్పనిసరి

ప్రతీ చోటా అగ్ని ప్రమాదాలు జరుగుతాయని అనుకోలేం. అయినా అన్ని చోట్లా ముందు జాగ్రత్తలు తప్పనిసరి.

ఇప్పుడు విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఇంట్లో బయటకు కనిపించకుండా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వైరింగ్ వ్యవస్థలను క్రమం తప్పకుండా పరిశీలించాలి.

అసలు వీటిని ఏర్పాటు చేసేటప్పుడే అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. నాణ్యమైన సామగ్రినే వాడాలి.

విద్యుత్ దీపాలను అలంకరణ వస్తువులుగా వాడటం సాధారణమైపోయింది. వీటి వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

Image copyright STRDEL/AFP/Getty Images
చిత్రం శీర్షిక 2015 జూన్‌లో ముంబయిలో అగ్ని ప్రమాదం సంభవించిన ఒక అపార్టుమెంటు

అపార్టుమెంట్లో మంటలు కనిపిస్తే ఏం చేయాలి?

మీరేదైనా అపార్టుమెంట్లో నివసిస్తుంటే, మీరున్న గదిలో లేదా పక్క ఫ్లాట్‌లో మంటలు కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి బయటకు దారితీసే 'ఎగ్జిట్' మార్గాలను గుర్తుకు తెచ్చుకోండి. బయటకు వెళ్లే ముందు సత్వరం గ్యాస్ సిలిండర్లను, విద్యుత్ సరఫరా వ్యవస్థను నిలిపివేయండి.

మీరుండే అపార్టుమెంట్లోకి పొగ వస్తుంటే, నోటికి ఏదైనా వస్త్రం అడ్డం పెట్టుకొని, బయటకు వెళ్లండి.

అది తడిగుడ్డ అయితే మరీ మంచిది.

పొగ మరీ ఎక్కువగా ఉంటే, ఎగ్జిట్ వైపు పాకుతూ వెళ్లి, ప్రాణాలు కాపాడుకోండి.

Image copyright INDRANIL MUKHERJEE/AFP/Getty Images

మాల్‌లో ఉంటే ఎలా?

ప్రతి షాపింగ్ మాల్‌లోనూ అగ్ని ప్రమాద నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. లాబీలో రిసెప్షన్‌కు దగ్గర్లో మాల్ మ్యాప్ మొత్తం ఉంటుంది. లోపలకు ప్రవేశించే, బయటకు వెళ్లే మార్గాలను, అత్యవసర మార్గాలను ఇది సూచిస్తుంది.

మాల్ ప్రతి ఫ్లోర్‌లో కూడా బయటకు వెళ్లే మార్గాన్ని సూచిస్తూ ఫ్లోరోసెంట్ కలర్‌లో 'ఎగ్జిట్' గుర్తు ఉంటుంది. దాని ఆధారంగా బయటపడండి.

రద్దీ ఎక్కువగా ఉండే మాల్ లాంటి ప్రదేశాల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిందేంటంటే- కంగారు పడకుండా, అయోమయానికి గురికాకుండా ఉండటం. గందరగోళం ఏర్పడితే తొక్కిసలాటకు దారితీస్తుంది. అది అగ్ని ప్రమాదం కన్నా పెద్ద దుర్ఘటనకు కారణం కావొచ్చు.

మాల్‌లో ఎక్కడైనా మంటలు కనిపిస్తే వెంటనే భద్రతా గార్డులను అప్రమత్తం చేయండి. అక్కడుండే మంటలార్పే సాధనాలతో చిన్నస్థాయి మంటలను అదుపు చేయవచ్చు.

అదే సమయంలో, 'ఫైర్ అలారం' మోగించడం, ఇతరులకు హెచ్చరికలు చేయడం మరచిపోకూడదు.

Image copyright INDRANIL MUKHERJEE/AFP/Getty Images
చిత్రం శీర్షిక ఇటీవల ముంబయి అగ్ని ప్రమాదంలో కుమారులను కోల్పోయిన విషాదంలో ఉన్నబాధితుడు జయంత్ లలానీ

ఆఫీసులో ఉంటే ఎలా?

ప్రస్తుతం కార్యాలయ భవనాలకు చాలా వరకు గాజు తలుపులు ఉంటాయి. అలాంటి భవనాల్లో వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.

చాలా కార్పొరేట్ కంపెనీలు ఆఫీసులోకి ప్రవేశించేందుకు బయోమెట్రిక్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. కానీ ఇది చాలా ప్రమాదకరమైనది.

అలాంటి భవనాల్లో తలుపులకు ఉపయోగించే గాజు చాలా గట్టిగా ఉంటుంది. సాధారణ కిటికీల మాదిరి కాకుండా గాజు తలుపులను పగలగొట్టడం చాలా కష్టం.

అద్దాల తలుపులను పగలగొట్టాలంటే ప్రత్యేక సుత్తి కావాలి. నిపుణుల వద్దే అలాంటివి ఉంటాయి.

బయోమెట్రిక్ వ్యవస్థలు ఉండే కార్యాలయాల్లో పనిచేసేవారు తేలిగ్గా తెరచుకొనే కిటికీలు ఏర్పాటు చేయాలని అడగాలి.

చిత్రం శీర్షిక కమలా మిల్స్

హోటల్ లేదా రెస్టారెంట్‌లో ఉంటే ఎలా?

రద్దీగా ఉండే చోటకు వెళ్లకపోవడమే ఉత్తమం. ఇరుకైన ప్రదేశాల్లో ఉండే హోటళ్లకు, రెస్టారెంట్లకు వెళ్లకపోవడం మేలు.

ఒకవేళ అలాంటి చోటకు వెళ్లినప్పుడు అగ్ని ప్రమాదం జరిగితే, ఎలాంటి గందరగోళం సృష్టించకుండా సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు