బెంగళూరు: 'బలవంతంగా శుభాకాంక్షలు చెప్పడానికి వీలు లేదు'

  • 31 డిసెంబర్ 2017
బెంగళూరు వీధుల్లో పోలీసులు Image copyright AFP
చిత్రం శీర్షిక 2016, డిసెంబర్ 31 అర్థరాత్రి పలువురు యువతులపై ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. తన స్నేహితురాలికి సాయం చేస్తున్నయువకుడు.

గతేడాది మహిళలపై జరిగిన వేధింపుల ఘటనలు పునరావృతం కాకుండా ఈ న్యూఇయర్ వేడుకల కోసం బెంగళూరులో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

గతేడాది డిసెంబర్ 31 వేడుకల సందర్భంగా బెంగళూరులో అనేక మంది యువతులు వేధింపులకు గురయ్యారు.

అర్ధరాత్రి నడిరోడ్లపై వేలాది మంది మధ్యలోనే అమ్మాయిల పట్ల కొందరు పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించాయి.

ఆ సమయంలో వందల మంది పోలీసులు విధుల్లో ఉన్నా.. ఏమీ చేయలేకపోయారన్న విమర్శలు వచ్చాయి.

Image copyright BANGALORE MIRROR
చిత్రం శీర్షిక బాధితురాలిని చేరదీస్తున్న పోలీసులు

నగరంలోని మహాత్మాగాంధీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు కూడలిలో ఎక్కువ మంది మహిళలు వేధింపులకు గురయ్యారని తెలిసింది.

ఓ స్థానిక వార్తా పత్రిక కథనంతో ఆ వికృతపర్వం వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి సీసీ కెమెరాలను పరిశీలిస్తే నిర్ఘాంతపోయే ఘటనలు బయటపడ్డాయి.

ఆ ఘటనలను చాలా మంది యువతులు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. ఈ ఏడాది నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొనేందుకు భయపడుతున్నారు.

అయితే, ఈ ఏడాది వేడుకల్లో ఎలాంటి భయం లేకుండా మహిళలు పాల్గొనవచ్చని పోలీసులు భరోసా ఇస్తున్నారు.

నగరంలోని ప్రధాన కూడళ్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక 2016 డిసెంబర్ 31 అర్ధరాత్రి గుమిగూడిన జనాలను అదుపుచేస్తున్న పోలీసులు

పరిస్థితులను నిరంతర పర్యవేక్షించేందుకు పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు.. ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

"మహాత్మా గాంధీ రోడ్డు-బ్రిగేడ్ రోడ్డు కూడలి పరిసర ప్రాంతాల్లోనే 2,000 మంది పోలీసులను మోహరిస్తున్నాం. గతంలో ఉన్న 100 సీసీ కెమెరాలకు, అధనంగా 275 సీసీ కెమెరాలను అమర్చాము. పోలీసు అధికారులు అందరూ రేడియం స్టిక్టర్లు ఉన్న జాకెట్లు వేసుకుంటారు. దాంతో వారిని ఎవరైనా సులువుగా గుర్తించే వీలుంటుంది" అని బెంగళూరు ఈస్ట్ పోలీసు కమిషనర్(శాంతి భద్రతలు), సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు.

నగరంలోని మిగతా ప్రాంతాల్లో దాదాపు 13,000 పోలీసులు పహారా కాస్తున్నారు. 1,000 సీసీ టీవీలతో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

Image copyright BANGALORE MIRROR
చిత్రం శీర్షిక 2016 డిసెంబర్ 31 అర్ధరాత్రి

"గతేడాది లాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఎవరికీ బలవంతంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రయత్నించొద్దు" అని కమిషనర్ అన్నారు.

గతేడాది మాధిరిగానే ఈ సారి కూడా బెంగళూరులో రాత్రి 2 గంటల వరకూ పబ్బులకు అనుమతి ఇచ్చారు. తాగి వాహనాలు నడిపేవారిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)