ప్రెస్ రివ్యూ: అంత్యక్రియలకు గుంత తవ్వలేదని ఎస్సీ కాలనీ బహిష్కరణ; తాగునీటి పైప్‌లైన్ తొలగింపు

  • 1 జనవరి 2018
సంకేతాత్మక చిత్రం Image copyright Getty Images
చిత్రం శీర్షిక సంకేతాత్మక చిత్రం

మృతదేహాన్ని పూడ్చేందుకు ఎస్సీలు గుంత తవ్వేందుకు నిరాకరించారంటూ వారుండే కాలనీని మిగతావారు బహిష్కరించారని, కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నె గ్రామంలో ఈ ఘటన జరిగిందని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

గ్రామానికి చెందిన బాల తిమ్మయ్య(90) అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం మృతిచెందారు.

‘‘తిమ్మయ్య మృతదేహాన్ని ఖననం చేసేందుకు గుంత తవ్వాలని ఎస్సీ కాలనీకి చెందిన ఎట్టివాళ్లకు (సంప్రదాయంగా గుంతలు తవ్వేవారు) సమాచారం ఇచ్చారు. తాము ఇద్దరమే ఉన్నామని, గుంత తవ్వలేమని పుల్లన్న, ఎలీషా అనే వ్యక్తులు చెప్పారు. మిగిలిన కుటుంబాలు వారిని ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. 24 గంటల పాటు మృతదేహాన్ని ఇంటివద్దనే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఆగ్రహం చెందిన మిగతా సామాజికవర్గాలవారు ఏకమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఎక్స్‌కవేటర్‌తో గుంత తీయించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అదే ఎక్స్‌కవేటర్‌తో.. ఎస్సీ కాలనీకి తాగునీరు సరఫరా చేసే పైప్‌లైన్‌ను తొలగించారు. ఎస్సీ కాలనీ వారిని బహిష్కరిస్తున్నట్లు దండోరా వేయించారు’’ అని ఆంధ్రజ్యోతి రాసింది.

ఎస్సీ కాలనీవాసులతో మాట్లాడినా, నిత్యావసర సరుకులు అందజేసినా రూ.5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారని పత్రిక పేర్కొంది.

ఈ వ్యవహారంపై ఎస్సీ కాలనీవాసులు రుద్రవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Image copyright Getty Images

సవాల్‌ చేస్తే నేనూ రాజకీయాల్లోకి వస్తా!

జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యోదంతం తనలో మార్పు తీసుకొచ్చిందని, సమాజంలో జరుగుతున్న దారుణాలపై గళమెత్తాలని నిర్ణయించుకున్నానని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చెప్పారు.

తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని, అయితే పదేపదే సవాల్‌ చేస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమేనని ఆయన అన్నారని 'సాక్షి' ఓ కథనం ప్రచురించింది.

ఆదివారం బెంగళూరు ప్రెస్‌ క్లబ్‌లో ప్రకాశ్‌రాజ్ 'ఈ యేటి (2017) ప్రెస్‌క్లబ్‌ వ్యక్తి' పురస్కారాన్ని అందుకున్నారు.

''రాజకీయం చాలా కష్టం. అందులో ఒక బాధ్యత ఉంటుంది. అందుకే నేను దూరంగా ఉంటాను. అయితే పదేపదే సవాల్‌ చేస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమే'' అన్నారు.

సీనియర్‌ పాత్రికేయులే తనకు ప్రశ్నించే ధైర్యాన్నిచ్చారని, వారి మార్గదర్శకత్వంలో పెరిగిన ఏకలవ్య శిష్యుడినని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. సమాజంలో బాధ్యతగా మాట్లాడేందుకు ప్రెస్‌క్లబ్‌ అందించిన పురస్కారం మరింత ధైర్యాన్నిచ్చిందని తెలిపారు.

Image copyright Getty Images

ఆ యువత సహస్రాబ్ది ఓటర్లుగా నమోదు చేయించుకోవాలి: మోదీ

యువ ఓట్లే నవభారత్‌కు పునాదిగా నిలుస్తాయని, నూతన సంవత్సరాదినాటికి 18 ఏళ్లు పూర్తవుతున్నవారంతా సహస్రాబ్ది ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని 'ఈనాడు' చెప్పింది.

2000వ సంవత్సరంలో పుట్టినవారు 2018లో ఓటర్లుగా అర్హత సాధిస్తారని గుర్తు చేస్తూ, వారందరినీ భారత ప్రజాస్వామ్యం స్వాగతిస్తోందని ఆయన ఆదివారం 'మన్‌కీ బాత్'లో చెప్పారు.

కోట్ల మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఓటు అత్యంత శక్తిమంతమైన సాధనమని మోదీ వ్యాఖ్యానించారు.

ముమ్మారు తలాక్ చెప్పి విడాకులిచ్చే పద్ధతిని నిషేధించే బిల్లుతో ముస్లిం మహిళలకు ఊరట లభించిందని ప్రధాని కేరళలోని శివగిరి మఠం 85వ యాత్రోత్సవాలను ప్రత్యక్ష ప్రసార సదస్సు ద్వారా ప్రారంభించిన సందర్భంగా చెప్పారు.

Image copyright NICHOLAS KAMM/Getty Images
చిత్రం శీర్షిక ''అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణం చేసినప్పటి నుంచి యూఎస్‌కు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.''

అమెరికా బదులు కెనడా వైపే చూపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వలస వ్యతిరేక విధానాల వల్ల భారతీయ విద్యార్థులు ఇప్పుడు కెనడా వైపు దృష్టి సారిస్తున్నారంటూ 'నవ తెలంగాణ' ఓ కథనం ప్రచురించింది.

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే బదులు కెనడాకు వెళ్లడమే సముచితమని భారతీయ విద్యార్థులు అభిప్రాయపడుతున్నారని దిల్లీలోని కెనడా హై కమిషన్‌, యూఎస్‌ రాయబార కార్యాలయం ధ్రువీకరించాయి.

2016-17లో అమెరికాలో చదువుకునేందుకు 1,86,267 మంది భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వారిలో దాదాపు లక్ష మంది తర్వాత నిర్ణయాన్ని మార్చుకుని, అమెరికా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణం చేసినప్పటి నుంచి యూఎస్‌కు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని న్యూయార్క్‌లోని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్(ఐఐఈ)' తెలిపింది.

ఐఐఈ తాజా నివేదిక ప్రకారం అమెరికా ఇచ్చే ఎఫ్‌-1 వీసాల కోసం 2015-16లో 62,537 మంది దరఖాస్తు చేసుకోగా, 2016-17లో 52,281 మందే దరఖాస్తు చేసుకున్నారు.

''కెనడాలో ఉన్నత చదువు కోసం 2015లో 39,525 మంది, 2016లో 39,790 మంది, 2017 అక్టోబర్‌ నాటికి 41,805 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. 2016లో స్టడీ పర్మిట్‌ వీసాలపై 52,870 మంది భారతీయ విద్యార్థులు కెనడాకు వెళ్లారు. 2017లో 54,425 మంది వెళ్లారు'' అని 'నవ తెలంగాణ' పేర్కొంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)