తెలంగాణ: బీడువారిన నేలను మాగాణంలా మార్చారు!

  • శ్యాంమోహన్
  • బీబీసీ కోసం
తుంపర సేద్యం చేస్తున్న రైతు

ఫొటో సోర్స్, Shyammohan

ఫొటో క్యాప్షన్,

కోట్ల రామకృష్ణయ్య, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా

ఒక కూలీ రైతుగా మారారు. ఒక పశువుల కాపరి 20కి పైగా పశువులకు యజమాని అయ్యారు. బతుకు తెరువు కోసం గల్ఫ్‌కు వలస వెళ్లిన ఒక గ్రామస్థుడు తిరిగి వచ్చి, సేద్యం చేసుకుంటున్నారు.

ఆరేళ్ల క్రితం.. ఆ గ్రామాల్లో వానలు సరిగా లేవు.. సాగు నీటి వసతి లేదు.. భూగర్భ జలాలు అడుగంటాయి.. ఉన్నంత వరకైనా వాడుకుందామంటే విద్యుత్ సమస్యలు.. ఇన్ని కష్టాల మధ్యే ఎలాగోలా పంట పండిస్తే గిట్టుబాటు ధర లేదు.. చాలీచాలని ఆదాయాలతో కుటుంబాలు.. బతుకు తెరువు కోసం వలసలు!

నేడు.. వర్షాలు, గిట్టుబాటు ధరల విషయంలో పెద్ద మార్పు లేదు. కానీ కుటుంబాల్లో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది.

ఈ మార్పుకు మూలం- రైతుల ఉమ్మడి కృషి, జల సంరక్షణ.

తెలంగాణలోని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 50 గ్రామాల్లో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 23 గ్రామాల్లో, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 29 గ్రామాల్లో రైతులను ఆదుకొనేందుకు అప్పట్లో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డ్‌) నడుం బిగించింది.

స్వచ్ఛంద సంస్థల సహకారంతో 2005-07 మధ్య వాటర్‌షెడ్ పనులు చేపట్టి, 2013-16 మధ్య పూర్తి చేసింది.

ఫొటో సోర్స్, Shyammohan

ఫొటో క్యాప్షన్,

ఉమ్మడి మెదక్ జిల్లా శిలాజీనగర్‌లోని ఓ పంట కుంట

ఎలా చేశారు?

నీటి వనరుల పునరుద్ధరణ, జల సంరక్షణ, వాటర్‌షెడ్ ప్రాధాన్యం గురించి సంకల్ప్‌, డవ్‌, రీడ్‌, కోనేర్‌ ,ట్రీస్‌, స్కోప్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి నాబార్డు ప్రతినిధులు రైతులకు వివరించారు.

పొలాల్లో పడిన వాన నీటిని అక్కడే ఎలా ఆపుకోవచ్చో, చిన్ననీటి కుంటలు, ఊట కుంటలు, రాతి డ్యామ్‌లు, రాళ్ల కట్టలతో నీటిని ఎలా ఒడిసి పట్టొచ్చో తెలియజెప్పారు.

పంట కుంటల ఏర్పాటు, నిల్వనీటి ద్వారా పంట కీలక దశలో బిందు, తుంపర్ల సేద్యం చేయడం, భూగర్భ జలాలను పెంచడం, మెట్ట ప్రాంతాల్లో వాననీటిని సద్వినియోగపరచుకొని కాంటూర్లు, అడ్డుకట్టల ఏర్పాటు లాంటి పనులను రైతులు ఉమ్మడిగా శ్రమదానంతో చేశారు.

వాటర్‌షెడ్ కార్యక్రమం విజయవంతమవడంలో మహిళల కృషి ఎక్కువగా ఉంది.

జల సంరక్షణతో ముడిపడిన కొన్ని విజయ గాథలను చూద్దాం.

ఫొటో సోర్స్, Shyammohan

ఫొటో క్యాప్షన్,

లక్ష్మి, రంగారెడ్డిపల్లి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి పల్లికి చెందిన లక్ష్మి, వెంకటేష్ దంపతులకు మూడెకరాల భూమి ఉంది. వర్షాధారంపై వేరుశెనగ పండించేవారు.

వాటర్‌షెడ్ కార్యక్రమం చేపట్టాక, రెండెకరాల్లో ఒక స్వచ్ఛంద సంస్థ నాబార్డ్‌ సాయంతో ఇచ్చిన 320 బత్తాయి మొక్కలు పెంచారు. ఇప్పుడు తోట కళకళలాడుతోంది. 95 టన్నుల వరకు దిగుబడి రావొచ్చని లక్ష్మి, వెంకటేష్ సంతోషంగా చెబుతున్నారు.

మరో ఎకరంలో పశుగ్రాసం పెంచుతున్నారు. రెండు పశువులు ఉన్నాయి.

''వాటర్‌షెడ్ పనులు చేపట్టాక ఐదు పంట కుంటలు, రెండు చెక్‌డ్యామ్‌లు వచ్చాయి. ఎండిన బోరులో నీటి మట్టం పెరిగింది'' అని లక్ష్మి, వెంకటేష్ తెలిపారు. పండ్ల తోట మీద, పాల మీద ఆదాయం వస్తోందని, సంతోషంగా బతుకుతున్నామని చెప్పారు.

తమకు నాలుగెకరాల పొలం ఉందని, నీటి వసతి వల్ల నిరంతరం పంటలు పండిస్తూ ఏడాదికి రూ.లక్షన్నర వరకు సంపాదించుకొంటున్నామని, లోగడ రూ. 60 వేలు కూడా వచ్చేది కాదని రంగారెడ్డి జిల్లా గండ్వీడ్‌కు చెందిన పులి అనంతయ్య, వెంకటయ్య తెలిపారు.

ఫొటో సోర్స్, Shyammohan

ఫొటో క్యాప్షన్,

అబ్దుల్ హమీద్ దంపతులు, వెల్‌చాల్ గ్రామం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

తిరిగొచ్చిన వలసజీవి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మోమిన్‌పేట మండలం వెల్‌చాల్‌ గ్రామానికి చెందిన అబ్దుల్‌ హమీద్‌కు ఐదెకరాల భూమి ఉంది. నీటి వసతి లేక పడావుగా మారింది. సాగు చేద్దామని ప్రయత్నిస్తే విత్తనాలు, కూలీలకు పెట్టిన ఖర్చు కూడా తిరిగి వచ్చేది కాదు. బతుకు తెరువు కోసం ఆయన గల్ఫ్‌కు వలస వెళ్లారు.

వాటర్‌షెడ్‌ కార్యక్రమాలతో వస్తున్న మార్పుల గురించి తెలిశాక హమీద్‌ గ్రామానికి తిరిగి వచ్చారు.

ఆయన పొలంలో ఎండిపోయిన బోర్‌లో నీటిమట్టం పెరిగింది. బీడు భూమిని సాగులోకి తెచ్చారు. మామిడి తోటను పెంచారు. అంతరపంటలుగా మొక్కజొన్న, కూరగాయలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు.

ఫొటో సోర్స్, Shyammohan

ఫొటో క్యాప్షన్,

నాగమణి, పర్వతాపూర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

మా పరపతి పెరిగింది: లక్ష్మారెడ్డి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని తాండూర్‌ మండలం పర్వతాపూర్‌కు చెందిన లక్ష్మారెడ్డికి ఐదెకరాల పొలం ఉంది. అయితే సాగు గిట్టుబాటు కాక ఆయన వ్యవసాయ కూలీగా మారారు.

రాయితీపై స్ప్రింక్లర్లు తీసుకుని కూరగాయల సాగు చేపట్టిన ఆయన కూలీ నుంచి రైతుగా మారారు.

పెసలు, మినుములు, కందులు పండిస్తూ, స్థానిక మార్కెట్‌లో అమ్ముతూ ఏడాదికి సుమారు రూ.50 వేల ఆదాయం పొందుతున్నట్లు లక్ష్మారెడ్డి చెప్పారు. ఆయన రెండు ఎద్దులు, ఒక ఆవు కొన్నారు.

''వాటర్‌షెడ్ వల్ల మా జీవితం స్థిరపడింది. సమాజంలో మా పరపతి పెరిగింది'' అంటూ లక్ష్మారెడ్డి సంతృప్తి వ్యక్తంచేశారు.

పర్వతాపూర్‌కే చెందిన గోపాలరెడ్డి, నాగమణిలకు నాలుగు ఎకరాల భూమి ఉంది. కానీ అదంతా బీడు నేల. ఒకప్పుడు జొన్నలు మాత్రమే పండించేవారు. వచ్చే ఆదాయం పెట్టుబడికీ సరిపోయేది కాదు. ఇప్పుడు ఉల్లి, పసుపు, పెసర పంటలు సాగు చేస్తున్నారు. ఎకరానికి ఏడాదికి రూ.80 వేల పైనే ఆదాయం వస్తోందని వారు చెప్పారు.

జల సంరక్షణ ప్రభావంతో కొందరు రైతులు వరి కూడా సాగు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Shyammohan

ఫొటో క్యాప్షన్,

మల్లేశం, చిన్నమ్మ దంపతులు, ఉమ్మడి మెదక్‌ జిల్లా

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట(శ్రీశైలం రోడ్‌) అటవీ మార్గంలో ఉండే మైలారం గ్రామానికి చెందిన కోట్ల రామకృష్ణయ్య ఆరేళ్ల క్రితం ఇతరుల వద్ద పశువుల కాపరిగా ఉండేవారు. ఇప్పుడు వంద గొర్రెలు, 20కి పైగా గేదెలు, ఆవులకు ఆయన యజమాని.

జల సంరక్షణ మొదలయ్యాక రామకృష్ణయ్య తన రెండెకరాల బీడు భూమిలో స్ప్రింక్లర్లు పెట్టి, పశుగ్రాసం పండిస్తూ, నాబార్డు రుణసాయంతో మొదట్లో రెండు పశువులు కొన్నారు. క్రమంగా ఆయన ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది.

సేంద్రియ వ్యవసాయం

ఉమ్మడి మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ మండలం ఖాసీంపూర్‌ గ్రామ రైతు మల్లేశం తన పది ఎకరాల భూమిలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు.

''అందరిలాగే రసాయన ఎరువులు వాడినప్పుడు కొంత కాలం పంటలు బాగానే పండాయి. తర్వాత పెట్టుబడులు పెరిగి, దిగుబడులు క్రమంగా తగ్గిపోయాయి. నష్టం రాసాగింది.

గో ఆధారిత, పెద్దగా పెట్టుబడి లేని సేంద్రియ వ్యవసాయం ప్రారంభించాను. వాటర్‌షెడ్‌ తుంపర సేద్యాన్ని నేర్పింది.

చెరుకు, ఉల్లి, కంది, శనగ, జొన్న వేసి మంచి దిగుబడులు తీశాను. ఈసారి ఆర్గానిక్‌ చెరకు పండించాను.

రసాయనాలు వాడిన రైతుల కంటే నేను ఎక్కువ దిగుబడులు సాధించడం చూసి ఖాసీంపూర్‌లో మరికొందరు రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు వస్తున్నారు'' అని ఆయన ఉత్సాహంగా చెప్పారు.

సుస్థిర వ్యవసాయం చేస్తున్నారు: రమేష్ కుమార్, ఏజీఎం, నాబార్డు

వాటర్‌షెడ్ వల్ల రైతులకు జల సంరక్షణ పట్ల అవగాహన కలిగిందని నాబార్డు సహాయ జనరల్ మేనేజర్(ఏజీఎం) గంటా రమేష్‌ కుమార్‌ చెప్పారు.

''రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేయడం తెలుసుకున్నారు. సేంద్రియ విధానంలో బహుళ పంటలు పండిస్తూ సుస్థిర వ్యవసాయం చేస్తున్నారు.

భూగర్భ జలమట్టం పెరిగింది. రైతుల వలసలు తగ్గాయి. భూమి లేని నిరుపేదలకు జీవనోపాధి మెరుగుదలకు నాబార్డు రుణాలు ఇవ్వడం వల్ల సుస్థిర ఆదాయాలు వస్తున్నాయి.

స్థానికులు చేతివృత్తులను, కుల వృత్తులను కూడా కాపాడుకున్నారు'' అని ఆయన వివరించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)