అణ్వాయుధాల బటన్ నా చేతిలోనే ఉంది: కిమ్ జోంగ్

  • 1 జనవరి 2018
కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగాన్ని చూస్తున్న దక్షిణ కొరియా ప్రజలు Image copyright Getty Images
చిత్రం శీర్షిక కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగాన్ని చూస్తున్న దక్షిణ కొరియా ప్రజలు

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌ మరోసారి అమెరికాను హెచ్చరించారు.

నూతన సంవత్సరం సందర్భంగా చేసిన ప్రసంగంలో, అటు అమెరికాను హెచ్చరిస్తూనే కొత్తగా దక్షిణ కొరియాకు స్నేహ హస్తం చాస్తున్నట్లుగా ఆయన మాటలు సాగాయి.

Image copyright Hamish Blair/gettyimages

మీట నొక్కితే చాలు

అమెరికా ఆయువు తన చేతిలో ఉందని కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ దేశంపై తాము అణుదాడి జరపగలమని కిమ్ తీవ్రంగా హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన "లాంచింగ్ బటన్" తన టేబుల్ వద్దే ఉన్నట్లు తెలిపారు. కాబట్టి అమెరికా తమపై యుద్ధానికి వచ్చే సాహసం ఎప్పటికీ చేయలేదని చెప్పుకొచ్చారు.

"అమెరికా మొత్తం మా అణు ఆయుధాల పరిధిలో ఉంది. ఇదేదో బెదిరించడానికి అన్నాననుకుంటే పొరపాటు. ఇది వాస్తవం" అని కిమ్ టీవీ ప్రసంగంలో హెచ్చరించారు.

Image copyright Michael Steele/gettyimages
చిత్రం శీర్షిక దక్షిణ కొరియా జాతీయ జెండా

స్నేహం చిగురించొచ్చు

తొలిసారిగా దక్షిణ కొరియా విషయంలో కిమ్ ధోరణిలో మార్పు కనిపించింది.

ఇప్పటికైతే ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య యుద్ధవాతావరణం ఉందంటూనే, కొత్త ఏడాదిలో పరిస్థితులు మారొచ్చని సంకేతాలు ఇచ్చారు.

ఇందుకు ఆ దేశంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని కిమ్ చెప్పుకొచ్చారు.

ఇటు దక్షిణ కొరియా, అటు ఉత్తర కొరియాకు సంబంధించి 2018 ఎంతో ముఖ్యమైనది. ఈ ఏడాదికి ఉత్తర కొరియా ఏర్పడి 70 ఏళ్లు పూర్తి కానుంది. దక్షిణ కొరియా ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

"2018 మాకు ఎంతో ముఖ్యమైనది. ఈ ఏడాదిలో పరిస్థితులు మారొచ్చు" అని కిమ్ అన్నారు.

Image copyright Reuters

మా ఆటగాళ్లను పంపుతాం

వింటర్ ఒలింపిక్స్ క్రీడలకు వీలైతే తమ దేశం తరపున బృందాలను పంపుతామని కిమ్ వెల్లడించారు.

"వింటర్ ఒలింపిక్స్ రూపంలో మాకు మంచి అవకాశం లభించింది. కొరియా ప్రజల ఐక్యతను చాటేందుకు ఇదే మంచి తరుణం. దీనిపై రెండు దేశాల అధికారులు వెంటనే చర్చలు ప్రారంభించాలి. వింటర్ ఒలింపిక్స్ విజయవంతం కావాలని ఆశిస్తున్నా" అని కిమ్ అన్నారు.

వాస్తవానికి వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు తుది గడువు ముగిసిపోయింది.

అయితే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఆహ్వానం మేరకు ఉత్తర కొరియా ఫిగర్ స్కేటర్లు ర్యోమ్ తే, కిమ్ జు వింటర్ ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్నారు.

Image copyright Getty Images

ఆపే ప్రస్తకే లేదు

అణు ఆయుధాల తయారీని మాత్రం ఆపే ప్రసక్తే లేదని కిమ్ స్పష్టం చేశారు. భారీ స్థాయిలో అణు వార్ హెడ్లు, బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేయడంతోపాటు వాటిని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు.

Image copyright Pool/getty images
చిత్రం శీర్షిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

మేమూ చూస్తాం

ఉత్తర కొరియా హెచ్చరికలపై విలేకరులు ప్రశ్నించగా "వారేం చేస్తారో మేమూ చూస్తాం" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం