కర్నూలు జిల్లా: అంత్యక్రియల కోసం గొయ్యి తవ్వలేదని దళితుల బహిష్కరణ

  • 1 జనవరి 2018
దళితవాడలోని మహిళలు Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక దళితవాడలోని మహిళలు

కర్నూలు జిల్లాలో ఓ గ్రామంలో దళితులను బహిష్కరించారు.

మృతదేహాన్ని ఖననం చేసేందుకు గొయ్యి తీయలేదన్న నెపంతో 'అగ్ర' వర్ణాల వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని రుద్రవరం మండలం, నక్కలదిన్నె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

'ఎట్టి' చేయలేదని

అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు చేయడాన్ని 'ఎట్టి' అని అంటారు. అంటే శవాన్ని పూడ్చేందుకు గోతులు తీయడం, కాల్చేందుకు కట్టెలు సమకూర్చడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.

గ్రామ కట్టుబాట్ల ప్రకారం ఈ పనుల్ని దళితులే చేయాలి.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక నక్కలదిన్నెలోని దళితవాడను బహిష్కరించారు

దళితులే చేయాలి..

చాలా గ్రామాల్లో తరతరాలుగా ఈ 'ఎట్టి' పని దళిత కుటుంబాలకు వారసత్వంగా వస్తోంది.

నక్కలదిన్నె గ్రామంలోనూ ఇటువంటి దళిత కుటుంబాలు నాలుగు ఉండేవి. ఒక్కో ఏడాది ఒక్కో కుటుంబం ఈ పనులు చేస్తోంది.

ఈ ఎట్టి పని తమతోనే అంతరించి పోవాలని ఆ దళిత కుటుంబాలు కోరుకుంటున్నాయి. తమ పిల్లలు ఇందులోకి రాకూడదని కోరుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం ఓ కుటుంబం ఊరు వదిలి వెళ్లిపోయింది. 'అగ్ర' వర్ణాలతో వీరికి పడకపోవడం, పట్టణంలో మెరుగైన జీవితం లభిస్తుందనే ఆశ కూడా ఇందుకు మరో కారణం.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక దళితవాడకు నీటి సరఫరాను గ్రామపెద్దలు నిలిపివేశారు

వంతుల వారీగా

ఆ తరువాత నక్కలదిన్నెలో మూడు కుటుంబాలు మాత్రమే మిగిలాయి. ఇందులో రెండు కుటుంబాలు అన్నదమ్ములవి.

కొన్ని సంవత్సరాల క్రితం అన్న కుటుంబం ఆ ఊరిని విడిచి వెళ్లిపోయింది. ఈ ఏడాది ఎట్టి వంతు ఆ కుటుంబానిదే.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక నీటి సరఫరాను పునరుద్ధరించే పనులు అధికారులు చేపట్టారు

నిరాకరణ

ఈ క్రమంలో బాల తిమ్మన్న అనే వ్యక్తి ఆదివారం మరణించారు. ఈ ఏడాది ఎట్టి వంతు తమది కాదు కనుక ఆ పనులు చేసేందుకు మిగతా రెండు కుటుంబాలు నిరాకరించాయి.

ఊళ్లో ఉన్నారు కనుక కట్టుబాటు ప్రకారం పనులు చేయాల్సిందేనని అగ్రవర్ణాల వారు కోరారు. శవాన్ని పూడ్చేందుకు గొయ్యి తవ్వాలంటే అయిదుగురు కావాలని తాము ఇద్దరమే ఉన్నామంటూ వారు దూరంగా ఉండిపోయారు.

ఇది అగ్రవర్ణాల వారికి ఆగ్రహం తెప్పించ్చింది. ప్రొక్లెయిన్ సహాయంతో గొయ్యి తీసి మృతదేహాన్ని ఖననం చేశారు. అదే యంత్రంతో దళితులకు నీటిని సరఫరా చేసే పైపులను తవ్వి పెకలించారు. దీంతో దళిత వాడకు ఆదివారం నుంచి నీటి సరఫరా నిలిచి పోయింది.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక కూరగాయలు, పాల సరఫరా కూడా నిలిపివేసినట్లు సునీత చెబుతున్నారు

బడికి వెళ్లొద్దన్నారు

ఎట్టి పని చేసే వారిలో సునీత కుటుంబం ఒకటి. ఊళ్లో అంగళ్ల వాళ్లు తమకు నిత్యావసర సరకులు అమ్మకుండా గ్రామ పెద్దలు అడ్డుకున్నట్లు ఆమె చెబుతున్నారు.

"కూరగాయలు, పాలు రాకుండా చేశారు. బట్టలు ఉతికే వాళ్లను కూడా రావొద్దని చెప్పారు. పిల్లలు బడికి పోకూడదని శాసించారు" అని ఆమె తెలిపారు. ఇక తమను ఊళ్లో ఉండనిస్తారో లేదోనని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక ఎట్టి పని చేయలేదని తమను బహిష్కరించినట్లు పుల్లయ్య అంటున్నారు

రూ.10,000 జరిమానా

జవాజి పుల్లయ్యది మరో ఎట్టి కుటుంబం. ప్రస్తుతం తాము ఇద్దరు వ్యక్తులమే ఉన్నామని, గొయ్యి తియ్యడానికి ఐదుగురు కావాలని ఆయన అంటున్నారు. అందువల్లే ఎట్టికి రాలేమని చెప్పినట్లు తెలిపారు.

"మాకు సరకులు అమ్మిన వారికి రూ.10,000, పనికి పిలిచిన వారికి రూ.5,000, ఊళ్లో వాళ్ల పొలాల్లోకి మేం వెళ్తే మేము రూ.10,000 జరిమానా కట్టాలని చాటింపు వేశారు" అని పుల్లయ్య వెల్లడించారు.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక సంప్రదాయాన్ని కొనసాగించాలని ఊరి పెద్దలు నాగిరెడ్డి, వెంకట రామిరెడ్డి అంటున్నారు

తరతరాల కట్టుబాటు

ఇది తరతరాలుగా వస్తున్న కట్టుబాటు కాబట్టి ఈ పనిని దళితులే చేయాలని 'అగ్ర' కులాల వారు వాదిస్తున్నారు.

ఈ ఎట్టి పని చేసేందుకుగాను ఆ నాలుగు దళిత కుటుంబాల పూర్వీకులకు 12 ఎకరాల భూమి ఇచ్చినట్లు గ్రామపెద్ద వెంకట రామిరెడ్డి అంటున్నారు.

"గ్రామంలో ఉన్నవాళ్లను ఎట్టి పని చేయమంటే వాళ్లు చేయలేదు. మేమే ప్రొక్లెయిన్ తెచ్చుకుని గొయ్యి తీసుకున్నాం. ఒత్తిడి చస్తేనే తిరిగి తమ మాట వింటారనే ఉద్దేశంతో గ్రామ బహిష్కరణ చేయాలని ఊళ్లో అన్ని కులాల వారు నిర్ణయించారు. ఈ క్రమంలో వారికి నీటి సరఫరాను నిలిపి వేశాం. ఇలా చేస్తే వాళ్లు మా వద్దకు వచ్చి చర్చలు జరుపుతారని భావించాం. తిరిగి ఎట్టి పనిలోకి వస్తారని ఆశించాం" అని రామిరెడ్డి తెలిపారు.

వారి కోసం ఎదురు చూస్తూ గంటలపాటు శవాన్ని ఇంటి దగ్గరే పెట్టుకున్నామని మృతుడు తిమ్మన్న కుమారుడు లక్ష్మయ్య అన్నారు.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక గ్రామస్థులతో మాట్లాడుతున్న తహశీల్దారు, ఇతర అధికారులు

గ్రామానికి రానున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు

పత్రికల్లో వచ్చిన ఈ వార్తను ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమోటోగా తీసుకుంది. పౌరహక్కుల పరిరక్షణ చట్టం; ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది.

ఘటనకు సంబంధించి నివేదికను వెంటనే సమర్పించాలని కోరింది. అలాగే కమిషన్ సభ్యుడు నరహరి వరప్రసాద్ మంగళవారం నక్కలదిన్నె గ్రామాన్ని సందర్శిస్తారని తెలిపింది.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక నీటి సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు డీఎస్‌పీ తెలిపారు

కేసు నమోదు

ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఆళ్లగడ్డ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్‌పీ) చక్రవర్తి, రుద్రవరం మండల తహశీల్దారు శివరాముడు, సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) వీరిలో ఉన్నారు.

దగ్గరుండి నీటి సరఫరాను పునరుద్ధరింప చేస్తున్నట్లు డీఎస్‌పీ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారో మాత్రం తెలియరాలేదు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)