అభిప్రాయం: రాజకీయాలకు రజినీకాంత్ వయసు దాటిపోయిందా?

  • 2 జనవరి 2018
రజినీకాంత్ Image copyright Getty Images

రాజకీయాలలోకి వస్తున్నట్లు రజినీకాంత్ 20 ఏళ్ల తర్వాత మొదటిసారి ప్రకటించారు. ఇన్నేళ్లూ ఆయన ఇలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.

తన రాజకీయ ప్రవేశంపై ఆయన ఎలాంటి ప్రకటన చేస్తాడో అని అందరూ ఎంతో కాలంగా ఉత్కంఠగా ఎదురుచూశారు.

రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసినా, పార్టీ ఎప్పటిలోగా పెడతాననే దానిపై రజినీ స్పష్టత ఇవ్వలేదు. కొన్ని విషయాలను ఆయన జనం ఊహాగానాలకే వదిలేశారు. అందుకే రజినీ రాజకీయాలపై సీరియస్‌గా ఉన్నారా లేదా అనేదానిపై సందేహాలు తలెత్తుతున్నాయి.

తమిళనాడు చరిత్ర మారుతుందా?

రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు కనుక ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందే. కానీ రాజకీయాల్లోకి వచ్చాక, ఆయన ఎంజీఆర్, జయలలితల తరహాలో విజయవంతం అవుతారా అనేదే ప్రశ్న.

రజినీకాంత్ క్రేజ్ ఇంకా తగ్గలేదు, కానీ ఆయన వయసే ఎక్కువ. ప్రస్తుతం రజనీకాంత్ వయసు 67 ఏళ్లు. 2021లో జరిగే ఎన్నికల్లో తాను రాజకీయాల్లోకి వస్తానని ఆయన అంటున్నారు.

అంటే అప్పటికి ఆయనకు 70 ఏళ్లు వస్తాయి. తన మద్దతుదార్లకు ఆయన హామీ ఇచ్చారు కానీ, ఆ వయసులో ఆయన ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వహించగలరా?

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తాను రాజకీయాలను వదిలి పెడతానని కూడా ఆయన ప్రకటించారు. కానీ దానిపై ఇప్పుడే ఏమీ చెప్పడానికి వీల్లేదు.

రజినీకాంత్ ఓటు బ్యాంక్

తమిళ సినీ పరిశ్రమలో ఒక స్టార్ కావడం చేత, ఆయనకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాకుండా ప్రజలు డీఎంకే, ఎఐఏడీఎంకేల నుంచి మార్పును కోరుకుంటున్నారు. అందుకే రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు.

ప్రజల్లోని ఉత్సాహం చూస్తే ఆయన ఎన్నికల్లో విజయం సాధించవచ్చని అనిపిస్తోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కమల్‌హాసన్

కమల్‌హాసన్ సహకారం ఇస్తారా?

రజినీకాంత్‌కు ముందు తమిళ సినీ పరిశ్రమలో రెండో పెద్ద స్టార్ కమల్‌హాసన్ తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన ఇంతవరకు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. రజినీకాంత్ రాజకీయ ప్రకటనను కమల్ కూడా స్వాగతించారు. ఆయనకు సహకరిస్తానని కూడా అన్నారు.

కానీ ఒక సందేహం. 20 ఏళ్ళ తర్వాత వీళ్లు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి?

ఒకటి మాత్రం స్పష్టం. రజినీకాంత్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తే డీఎంకే, ఏఐఏడీఎంకేలకు గట్టి పోటీ తప్పదు.

తమిళ రాజకీయాల్లో ఇప్పటివరకు ఇద్దరు సినీ నటులు మాత్రమే రాజకీయాల్లో రాణించారు. రజినీకాంత్, కమల్‌హాసన్‌లు రాజకీయాల్లో విజయవంతమైతే, తర్వాత తరం స్టార్లు వాళ్లే.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)