తమిళనాడు: జల్లికట్టు వ్యతిరేక కార్యకర్తల్లో భయం

  • 2 జనవరి 2018
జల్లికట్టుకు మద్దతుగా ఉద్యమిస్తున్న విద్యార్థులు Image copyright EPA

తమిళనాడులో జల్లికట్టుని నిషేధించాలని పోరాడిన జంతు సంరక్షణ వాదుల కృషి ఫలించలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆ వేడుకల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది.

మరోపక్క గత రెండేళ్లుగా జంతు ప్రేమికులపై స్థానికుల్లో వ్యతిరేకత మొదలైంది. తమపై ఎక్కడ దాడి జరుగుతుందోనన్న భయంతో కార్యకర్తలు రహస్యంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వందల ఏళ్లుగా జల్లికట్టు వేడుకలు తమిళనాడు సంప్రదాయంలో భాగంగా ఉన్నాయి. కానీ ఆ సాహస క్రీడ కారణంగా పశువులు హింసకు గురవుతున్నాయనీ, అందుకే దాన్ని నిషేధించాలనీ కోరుతూ కొందరు జంతు ప్రేమికులు కోర్టులో పిటిషన్ వేశారు.

ఆ పిటిషన్‌కు స్పందించిన సుప్రీం కోర్టు 2014లో జల్లికట్టుపై నిషేధాన్ని విధించింది. కానీ ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ తమిళనాడు వ్యాప్తంగా భారీ నిరసనలు చోటు చేసుకున్నాయి.

దాంతో గతేడాది కోర్టు ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. అప్పట్నుంచీ మధురై చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో జల్లికట్టు వేడుకలు ప్రారంభమయ్యాయి.

Image copyright Getty Images

జల్లికట్టుపై నిషేధానికి ముందు అందరితో స్నేహంగా మెలిగిన స్థానికులు అప్పట్నుంచీ కొత్త వాళ్లతో మాట్లాడటానికి తటపటాయిస్తున్నారు. జంతు ప్రేమికుల పట్ల వ్యతిరేకతతో వ్యవహరిస్తున్నారు.

జంతు సంరక్షణ సంఘాలకు చెందిన కొందరు వ్యక్తులు జల్లికట్టుని రహస్యంగా చిత్రీకరించి, తమకు అనుకూలమైన విధంగా దాన్ని ఎడిటింగ్ చేసి ప్రచారం చేయడంతో ఆ ఉత్సవానికి చెడ్డ పేరు వచ్చిందని స్థానికులు అంటారు.

అందుకే అప్పట్నుంచీ ఉత్సవాల సమయంలో చేతిలో కెమెరా ఉన్న ప్రతి ఒక్కరినీ వాకబు చేయడం మొదలుపెట్టారు.

''జల్లికట్టు వేడుకలు జరిగే ఓ ప్రాంతానికి దగ్గరగా మా ఆఫీసు ఉంటుంది. అందుకే మేం వీడియోలు తీసి 'పెటా' (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్)కు అందిస్తామని అనుమానిస్తున్నారు. మా పైన చాలా అపనమ్మకం, వ్యతిరేకత నెలకొన్న మాట వాస్తవమే'' అంటారు 'ఇండియన్ యానిమల్ రైట్స్ గ్రూప్'నకు చెందిన ఓ కార్యకర్త.

జల్లికట్టు గురించి ఎక్కువగా మాట్లాడటానికీ, తన పేరు చెప్పడానికీ ఆయన ఇష్టపడలేదు. జంతు ప్రేమికుల్లో భయాందోళనలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికో ఉదాహరణ ఇది.

Image copyright J Suresh

మధురై జనాభా దాదాపు పదిహేను లక్షలు. అక్కడి వీధుల్లో జంతువుల సంఖ్యా తక్కువేం కాదు.

గుళ్ల దగ్గర భక్తులు ఏనుగులకు డబ్బులిచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ కనిపిస్తారు. చట్టప్రకారం ఏనుగులతో యాచించడం తప్పు. అయినా ఆ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

ఎక్కడ పడితే అక్కడ పశువులు ప్లాస్టిక్ వ్యర్థాలను తింటూ కనిపిస్తాయి. పక్షులను తలకిందులుగా వేలాడదీసి బైకుల మీద తరలించే దృశ్యాలూ మామూలే. గాడిదలూ, ఎడ్లతో వెట్టి చాకిరీ చేయించే సంఘటనలూ కోకొల్లలు. ఇన్ని జరుగుతున్నా అక్కడ ఒక్క జంతు సంరక్షణ కేంద్రం కూడా లేదు.

Image copyright Getty Images

'మేం వీధి కుక్కల్ని చేరదీయడానికి ఓ స్థలాన్ని అద్దెకు తీసుకున్నాం. కానీ వాటి అరుపుల వల్ల తమకు ఇబ్బందిగా ఉంటోందని చుట్టుపక్కల వాళ్లు ఫిర్యాదు చేయడంతో దాన్ని మూసేయాల్సి వచ్చింది. ఇప్పటికీ జంతు సంరక్షణ కోసం ఓ స్థలాన్ని కేటాయించమని ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం' అంటారు పేరు చెప్పడానికి ఇష్టపడని అదే కార్యకర్త.

'కొన్నాళ్ల క్రితమే మధురైలో జంతువుల కోసం రెండు అంబులెన్సుల్ని కేటాయించారు. ప్రమాదాల్లో గాయపడ్డ జీవాలకు అవి సహాయపడతాయి' అంటారు పేరు చెప్పడానికి ఇష్టపడని మరో జంతు ప్రేమికుడు.

జల్లికట్టుకు మద్దతిచ్చేవారు మాత్రం జంతువుల్ని హింసించొద్దని చెప్పే హక్కు జంతు ప్రేమికులకు ఎక్కడిదని ప్రశ్నిస్తారు.

Image copyright Getty Images

'వాళ్లా మాకు చెప్పేది'

జల్లికట్టుకి ప్రధాన వేదికల్లో ఒకటైన అలంగానలూర్‌లో ఓ ఎద్దు స్మారక చిహ్నం కనిపిస్తుంది. భయమంటే ఎరగని ఓ ఎద్దుకి గౌరవ సూచకంగా గ్రామస్తులు దాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్మారకం దగ్గర స్థానికులు నిత్యం దీపాన్ని వెలిగిస్తూ ఎడ్ల పట్ల తమకున్న గౌరవాన్ని తెలియజేస్తారు. మధురై వ్యాప్తంగా అలాంటి స్మారక చిహ్నాలు చాలా ఉన్నాయి.

'జీవితంలో ఎప్పుడూ ఎద్దుని కనీసం దగ్గరగా చూడని చాలామంది.. తరతరాలుగా పశువులతో మమేకమై జీవిస్తున్న మాకు వాటి సంరక్షణ గురించి చెప్పడం సరికాదు' అంటారు ముత్తురాజ్ అనే ఓ రైతు.

ఎవరి వాదన వారిదన్నట్టు, జల్లికట్టుపై నిషేధాన్ని అమలు చేయాలని 'పెటా' కోరుతోంది.

'జంతువులపై హింస, మనుషుల ప్రాణంపై నిర్లక్ష్య ధోరణి జల్లికట్టులో కనిపిస్తాయి' అంటారు పెటా ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ నికుంజ్ శర్మ. దానికి సాక్ష్యంగా గతంలో పెటా తీసిన వీడియో గురించి ఆయన ప్రస్తావిస్తారు.

'పిల్లలపై హింసను ఎలా సహించకూడదో, అలానే అనవసరంగా జంతువుల్ని హింసించడాన్ని కూడా ప్రోత్సహించకూడదు' అంటారాయన.

చిత్రం శీర్షిక కేరళలో ఆహారం కోసం పశువుల్ని వధించడంపైన ఎలాంటి అడ్డంకులూ లేవు

పశువుల అమ్మకాలకు సంబంధించిన నిబంధనలు కూడా వివాదాస్పదంగానే ఉన్నాయి.

'మంచి నెట్‌వర్క్ ఉన్న మాఫియా చేతుల్లో పశువుల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఎవరూ వాటిని ఆపడానికి ప్రయత్నించట్లేదు' అంటారు కోయంబత్తూరు క్యాటిల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎస్.నిజాముదీన్.

జంతు సంరక్షణ కార్యకర్తలు తమిళనాడు నుంచి కేరళకు పశువుల తరలింపును ఆపడంలో విఫలమవుతున్నారన్నది వాళ్లపై ఉన్న ప్రధాన ఫిర్యాదు.

కేరళలో ఆహారం కోసం పశువుల్ని వధించడంపైన ఎలాంటి అడ్డంకులూ లేవు. కానీ అక్కడికి తరలించే క్రమంలోనే చాలా పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా ట్రక్కుల నిండా పశువుల్ని కుక్కేసి తీసుకెళ్తుండటంతో అవి మృత్యువాత పడుతున్నాయి.

Image copyright Getty Images

'40-60 పశువుల్ని తరలించే ట్రక్కుల్ని మేం తరచూ గుర్తిస్తుంటాం. కానీ పోలీసులూ స్థానిక అధికారులూ వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. కోర్టులు కూడా నామమాత్రపు జరిమానాతో వాటి యజమానుల్ని వదిలేస్తాయి' అంటారు నిజాముదీన్.

'గోవుల్ని సంరక్షించే పేరుతో వాటిని తరలించే వాళ్లపైన దాడి చేసే వ్యక్తులు కూడా జంతువుల సంరక్షణ హక్కుల ఉద్యమానికి నష్టం చేకూర్చినట్టే లెక్క' అంటారు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ మాజి వైస్ ఛైర్మన్ డాక్టర్.ఎస్.చిన్ని కృష్ణ.

గత రెండు దశాబ్దాల్లో వీధి కుక్కల ఏరివేత, సర్కస్‌లో ఏనుగులు, పులులు, సింహాల ప్రదర్శన లాంటి కొన్ని చర్యలను అడ్డుకోవడంలో జంతు సంరక్షణ సంఘాలు విజయం సాధించాయి. కొన్ని ప్రాంతాల్లో గుర్రం, ఒంటెలపై సవారీని కూడా జంతు ప్రేమికులు అడ్డుకోగలిగారు.

కానీ ఎన్నో ఏళ్ల ఈ కృషి ఫలితాలు నెమ్మదిగా నీరుగారుతున్నాయి. తమిళనాడులో మళ్లీ కోడి పందేలు మొదలయ్యాయి. కర్ణాటకలో గేదెల పరుగు పందేలు ఊపందుకున్నాయి. మహారాష్ట్ర కూడా ఎడ్లబండి పరుగు పందేలపై ఉన్న నిషేధాన్నిప్రభుత్వం ఎత్తి వేసింది.

'జంతువులకు హాని కలిగించే చాలా సంప్రదాయాలకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ అంశాలపై అవగాహన కలిగించే భారీ కార్యక్రమాన్ని త్వరలో మొదలు పెట్టాలనుకుంటున్నాం' అంటారు చిన్ని కృష్ణ.

ఏదేమైనా ఇతరుల మద్దతు కొరవడడంతో, జంతు ప్రేమికులకు తమ పనిని గోప్యంగా చేసుకోక తప్పట్లేదు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)