ప్రెస్ రివ్యూ: అసాధ్యాన్ని కేసీఆర్ సుసాధ్యం చేశారన్న పవన్ కల్యాణ్

  • 2 జనవరి 2018
సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ Image copyright cmotelangana
చిత్రం శీర్షిక సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సోమవారం రాత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు 'నమస్తే తెలంగాణ' పేర్కొంది.

ప్రగతిభవన్‌కు వచ్చిన పవన్‌కల్యాణ్ సీఎం కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న అంశంపై సీఎం కేసీఆర్‌ను అడిగి తెలుసుకొన్నారు.

రాష్ట్రం ఏర్పడిన ఇంత తక్కువ కాలంలో ఇంతటి ఘనత సాధించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం.

ముఖ్యమంత్రితో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ "తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరాను సఫలం చేయడంపై మనః స్ఫూర్తిగా అభినందించడానికి, శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాను. ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు పిలిచినప్పుడు సమయం కుదరక రాలేదు. రాష్ట్రం విడిపోతే, తెలంగాణ అంధకారమవుతుందన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు 24గంటల విద్యుత్ ఎలా విజయవంతం చేశారో తెలుసుకోవడానికి వచ్చాను. నేను ప్రతి ఒక్కరినీ కలుస్తాను. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు.. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడానికి అన్ని పార్టీల ప్రతినిధులను కలువటం మామూలే" అని తెలిపారని నమస్తే తెలంగాణ వార్త ప్రచురించింది.

Image copyright Wikipedia
చిత్రం శీర్షిక విజయవాడ కనకదుర్గ గుడి

అమ్మ గుడిలో తాంత్రిక తంతు

బెజవాడ కనక దుర్గమ్మ గుడిలో సంప్రదాయ విరుద్ధమైన పూజలు జరిగాయని, అమ్మవారిలోని భీకర స్వరూపాన్ని మేల్కొలుపుతూ, ఆ తల్లికి మరో రూపమైన 'భైరవి'ని ప్రసన్నం చేసుకునేందుకు కొందరు రహస్య క్రతువులు నిర్వహించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

నిబంధనలకు విరుద్ధంగా, అనధికారికంగా కొందరు అంతరాలయ తలుపులు తెరిచి, అర్ధరాత్రి రహస్యంగా పూజలు జరిపారు. బెజవాడ కనకదుర్గ ఆలయ ముఖ్య అధికారి ఒకరు ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు వరుసగా వివాదాస్పదమయ్యాయి.

ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో... ఆ అధికారికి సన్నిహితంగా మెలిగే అర్చకుడొకరు 'భైరవీ పూజ చేస్తే మీకు అదనపు శక్తులు వస్తాయి. కష్టాలు పోతాయి' అని సలహా ఇచ్చారు. అందుకు... ఆ అధికారీ సరే అన్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. భైరవీ పూజ నిర్వహణలో నిష్ణాతులైన తాంత్రికులను తమిళనాడు నుంచి రప్పించారు. డిసెంబరు 26వ తేదీ రాత్రి 9 గంటలకు గట్టువెనుక నివాసం ఉంటున్న ఆలయ అర్చకుడి ఇంటికి ఆ అధికారి వెళ్లారు.

ఆలయంలో భైరవీ పూజను ఎలా పూర్తి చేయాలన్న దానిపై చర్చించుకున్న అనంతరం అధికారి వెళ్లిపోయారు. ఆ తర్వాత, అసలు తంతు మొదలైంది. తమిళనాడు నుంచి రప్పించిన నలుగురు తాంత్రికులతోపాటు దుర్గమ్మ ఆలయంలో పూజలు చేసే తండ్రీ కొడుకులు గుడిలోకి చేరుకున్నారు.

అమ్మవారికి పవళింపు సేవ ముగిసిన తర్వాత మూసివేసిన గర్భగుడి తలుపులను తెరిచారు. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక 12.45 గంటల వరకు అత్యంత రహస్యంగా భైరవీ పూజ నిర్వహించారు. ఈ క్రతువు పూర్తికాగానే... గుడి తలుపులు మూసి వెళ్లిపోయారు.'

దుర్గగుడి ఆలయాన్ని రాత్రి పదిగంటలకు మూసివేస్తారు. తరువాత ఎవ్వరూ తెరవకూడదు. తెరిచినా ప్రత్యేక నిబంధనలను పాటించాలి. పోలీసులకు, సెక్యూరిటీకి, గుమాస్తాకు, ఆలయంలో పనిచేస్తున్న ముఖ్య అర్చకులకు లిఖితపూర్వకంగా సమాచారం అందించాలి.

గుడి మూసి వేశాక అక్కడున్న రిజిస్టర్‌లో సంబంధిత బాధ్యులంతా సంతకాలు చేయాలి. ఈ రిజిస్టర్‌ను పరిశీలించగా... డిసెంబరు 26వ తేదీ రాత్రి 10.15కి ఆలయాన్ని మూసి వేసినట్లుగా ఉంది.

తిరిగి తెల్లవారు జామున నిర్ణీత సమయానికి మాత్రమే తలుపులు తెరిచినట్లుగా స్పష్టంగా ఉంది. కానీ... 26వ తేదీ రాత్రి ఆలయాన్ని శుభ్రం చేయించటం కోసం అనుమతి ఇచ్చినట్టుగా దేవాలయ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

అదే నిజమైతే రిజిస్టర్‌లో ఆ విషయాన్ని నమోదు చేయాలి. మరోవైపు... ఆలయం శుభ్రం చేస్తున్న దృశ్యాలేవీ సీసీ కెమెరాల్లో నమోదు కాలేదు అని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

'మాకొద్దీ ఇంజినీరింగ్‌'

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్ల భర్తీ దారుణంగా పడిపోతూ వస్తోంది. 2016-17 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా మూడోవంతు విద్యా సంస్థల్లో సగటున 13% సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ సోమవారం వెల్లడించిందని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది.

తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ 266 కళాశాలల్లో 41,628 సీట్లు ఉండగా..112లో కేవలం 6 శాతం (2,874) మంది మాత్రమే చేరినట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని 325 విద్యా సంస్థల్లో 47,640 సీట్లకుగానూ 109లో కేవలం 5,687 సీట్లు (11.98%)మాత్రమే భర్తీ అయినట్లు తెలిపింది.'

కేంద్రం వెల్లడించిన గణాంకాల మేరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోని 398 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 1.66 లక్షల సీట్లకు గానూ.20 వేలు(12%) మాత్రమే భర్తీ కావడం పరిస్థితికి అద్దం పడుతోంది.

కర్ణాటక, కేరళల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. కర్ణాటకలోని 198 కళాశాలలకు 18లో మాత్రమే 80 శాతం సీట్లు, కేరళలో 176కి 34లో 84% సీట్లు భర్తీ కాలేదు. అత్యధిక సీట్లు మిగిలిపోయిన కళాశాలల సంఖ్యలో(177) తమిళనాడు దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది.

ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ (169), మహారాష్ట్ర (139) ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 3,325 కళాశాలలకు గానూ 1267లో 86% సీట్లు మిగిలిపోవడం గమనార్హం అని ఈనాడు కథనం పేర్కొంది.

Image copyright ou hyd/facebook
చిత్రం శీర్షిక ఉస్మానియా యూనివర్సిటీ

ఓయూలో నిర్వహించేలా ఆదేశాలివ్వండి

ప్రతిష్టాత్మక 'ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌' సమావేశాలను ముందుగా నిర్ణయించిన విధంగా ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వడంతోపాటు, ఈ సమావేశాలకు పూర్తి సహాయ సహకారాలు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైందని సాక్షి పేర్కొంది.

ఈ సమావేశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, నిధులు విడుదల చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చిందని, దీనివల్ల ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు మరో చోటుకు తరలిపోయాయంటూ పీహెచ్‌డీ విద్యార్థులు కిరణ్‌కుమార్, విజయకుమార్‌లు హైకోర్టులో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఇందులో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఓయూ వీసీ, డీజీపీ, నగర పోలీస్‌ కమిషనర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారని సాక్షి ఓ వార్త ప్రచురించింది.

Image copyright chandrababu/facebook
చిత్రం శీర్షిక చంద్రన్న విజేల్ మాల్

'చంద్రన్న కానుక తూకాల్లో మోసం'

చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని, తూకాల్లో మోసాలు జరుగుతున్నాయని ప్రజాశక్తి ఓ కథనాన్ని ప్రచురించింది.

సంక్రాంతి పండుగకు ఆరు రకాల సరుకులను పేదలకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 1.40 కోట్ల తెల్లరేషన్ కార్డుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ అర కిలో చొప్పున బెల్లం, కందిపప్పు, శనగపప్పు, కిలో గోధుమ పిండి, అర లీటర్ పామాయిల్, 100 ఎంఎల్ నెయ్యి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది.

అయితే అందులో 500 గ్రాములు ఉండాల్సిన బెల్లం ప్లాస్టిక్ బాక్స్‌తో సహా 455 గ్రాములు మాత్రమే ఉంటోంది. దాదాపు అన్ని చోట్లా బెల్లంలో ఒక్కో లబ్దిదారునికి 45 గ్రాములు తక్కువగా ఇస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో పంపిణీ చేసిన బెల్లంలో చాలా మందికి 45 గ్రాములు తక్కువగా వచ్చినట్లు వెల్లడైంది. ఈ లెక్కన చూస్తే 1.40 కోట్ల మంది లబ్ధిదారులకు ఇచ్చే బెల్లంలో కోత పడితే దాదాపు రూ.30.38 కోట్ల వరకు టెండర్‌దారుల చేత్తుల్లోకి వెళ్తున్నట్లు లెక్కించవచ్చు అని ప్రజాశక్తి పేర్కొంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)