రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి

  • 2 జనవరి 2018
సినీతారలు Image copyright Wikipedia

అభిమానులు సూపర్ స్టార్‌గా పిలుచుకునే రజనీకాంత్ రాజకీయపార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. దక్షిణ భారత దేశంలో ఇలా సినీనటులు రాజకీయ పార్టీలు పెట్టడం కొత్తేమీ కాదు. మరీముఖ్యంగా తమిళనాట ఈ ట్రెండ్ మొదటి నుంచీ వస్తోంది. ఆ సంగతులు ఒకసారి చూద్దాం.

నాటి అన్నాదురై నుంచి నేటి రజనీకాంత్ వరకు చాలా మంది కళాకారులు వెండితెర నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారే.

దక్షిణ భారత్‌లో తమిళనాడు తర్వాత ఆ స్థాయిలో సినీకళాకారులు రాజకీయ పార్టీలు పెట్టింది తెలుగునాటే.

దక్షిణాదిన సినీతారలను అభిమానులు వెండితెర వేల్పులుగా ఆరాధిస్తుంటారు.

ఇక ఎన్నికల వేళ మద్దతు కోసం రాజకీయ పార్టీలు కూడా తారల చుట్టూ తిరుగుతుంటాయి.

దీంతో అభిమానులే అండగా కొందరు తారలు పార్టీలు పెట్టి సూపర్ హిట్ అయ్యారు. మరికొందరు మాత్రం సినీ చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చినా సరిగ్గా పార్టీని నడపలేక ప్లాపులు మూటగట్టుకున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ. తమిళనాట అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్షం డీఎంకే పార్టీలు కూడా ఒకప్పుడు సినీకళాకారులు స్థాపించినవే.

దక్షిణాదిన సినీకళాకారులు పార్టీ పెట్టడం 1940లలోనే మొదలైంది.

Image copyright WIKIPEDIA
చిత్రం శీర్షిక నాటక రచయతగా ప్రస్థానం ప్రారంభించి పార్టీ పెట్టిన అన్నాదురై

తమిళనాట అన్నగా పిలిచే సి.ఎన్. అన్నాదురై (కంజీవరం నటరాజన్) నాటక రచయిత.

సినీ మాధ్యమాన్ని రాజకీయప్రచారానికి వాడుకోవడం ఆయనతోనే మొదలైంది.

ద్రవిడ కళగం(డీకే) కీలక వ్యక్తులలో ఆయన ఒకరు. తర్వాత కాలంలో పెరియార్‌ (ఈవీ రామస్వామి)తో విభేదాలు రావడంతో ద్రవిడ కళగం నుంచి బయటకొచ్చారు.

డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కళగం) పేరుతో 1949లో పార్టీని స్థాపించారు. తర్వాత కాలంలో కరుణానిధి, ఎంజీఆర్ ఈ పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు.

Image copyright Wikipedia
చిత్రం శీర్షిక అభిమానుల అండతో రాజకీయాల్లో రాణించిన ఎంజీఆర్

అక్కడ ఎంజీఆర్.. ఇక్కడ ఎన్టీఆర్

డీఎంకేలో వారసత్వ పోరు మొదలవడంతో పార్టీలో విభేదాలు వచ్చాయి. పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఎంజీ రామచంద్రన్‌కు సినీనటుడుగా అభిమాన బలం ఉంది.

దీంతో ఆయన పార్టీ నుంచి బయటకొచ్చి17 అక్టోబర్ 1972లో ఆలిండియా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐడీఎంకే) ను స్థాపించారు. దీన్నే అన్నా డీఎంకే అనీ అంటారు.

1977లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన మృతి తర్వాత పార్టీలో విభేదాలు తలెత్తాయి.

సినీనటిగా రాణించి అప్పటికే పార్టీలో మంచి గుర్తింపు పొందిన జయలలిత చేతుల్లోకి పార్టీ వెళ్లింది. 1989 నుంచి 2016లో చనిపోయేవరకు ఆమె పార్టీని నడిపించారు.

తమిళనాట ఏఐడీఎంకే అత్యధికంగా ఏడుసార్లు అధికారంలోకి వచ్చింది.

Image copyright Wikipedia
చిత్రం శీర్షిక తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టిన ఎన్టీఆర్ 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు.

అదరగొట్టిన 'అన్న'గారు

తెలుగునాట వెండితెర వేల్పుగా అభిమానులు పిలుచుకునే నందమూరి తారక రామరావు (ఎన్టీఆర్) పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు.

29 మార్చి 1982న తెలుగు దేశం పేరుతో ఆయన పార్టీ స్థాపించారు. చైతన్య రథం పేరుతో ఓ వాహనంలో రాష్ట్రమంతా పర్యటించారు.

తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు.

1983 ఎన్నికల్లో 294 స్థానాల్లో అభ్యర్థులను నిలిబెట్టి 199 సీట్లు గెలుపొంది అధికారంలోకి వచ్చారు.

ఎన్టీఆర్ కూడా గుడివాడ, తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలుగు నాట కాంగ్రెసేతర తొలి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ రికార్డు సృష్టించారు.

Image copyright Wikipedia
చిత్రం శీర్షిక శివాజీ గణేషన్

గమ్యం చేరని శివాజీ గణేశన్

తమినాడులో మరో సినీ నటుడు శివాజీ గణేశన్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

వివిధ రాజకీయపార్టీలతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన తన మొదటి సినిమాల్లోనే డీఎంకే భావజాలాన్ని ప్రచారం చేశారు.

తర్వాత కాలంలో డీఎంకే నుంచి తప్పుకొని తమిళగ మున్నెట్ర మున్ననై పేరుతో సొంతగా పార్టీ పెట్టారు.

1989 ఎన్నికల్లో ఆయన పార్టీ దారుణ ఓటమి చవిచూసింది. శివాజీ గణేశన్ కూడా తిరువాయిర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత తన పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి కార్యకర్తలను జనతాదళ్‌లో చేరాలని సూచించారు.

Image copyright chirnjeevi fans/facebook
చిత్రం శీర్షిక ప్రజారాజ్యం పార్టీ ని 2011లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.

అంచనాలు అందుకోలేని 'అన్నయ్య'

అభిమానులు మెగాస్టార్‌గా పిలిచే చిరంజీవి కూడా ఎన్టీఆర్ తరహాలో పార్టీ స్థాపించారు. 26 ఆగస్టు 2008 న తిరుపతిలో భారీ సభ పెట్టి పార్టీ ప్రకటన చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 స్థానాల్లో పోటీ చేసి కేవలం18 సీట్లు గెలిచారు. చిరంజీవి రెండు చోట్ల పోటీ చేయగా ఒక స్థానం నుంచి ( పాలకొల్లు ) ఓడిపోయారు.

ఆగస్టు 2011లో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

'కెప్టెన్' రాజకీయాలు

మరో తమిళ సినీనటుడు విజయ్ కాంత్ కూడా 2005లో దేశియ ముర్పోర్కు ద్రవిడ కళగం పేరుతో పార్టీ పెట్టారు.

2006 ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 స్థానాల్లోనూ అభ్యర్థులను లబెట్టారు. కానీ, కేవలం ఆయన ఒక్కరు మాత్రమే గెలుపొందారు.

2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేశారు. అప్పుడు 29 సీట్లలో గెలుపొందారు.

అయితే 2014 ఎన్నికల్లో 104 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

Image copyright Wikipedia
చిత్రం శీర్షిక విజయ్ కాంత్ పార్టీ 2014 ఎన్నికల్లో 104 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు.

'రాములమ్మ' పార్టీ ఏమైంది?

సినీనటి విజయశాంతి 1998లో బీజేపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా తల్లితెలంగాణ పార్టీని స్థాపించారు.

2009లో టీఆర్ఎస్‌లో తన పార్టీని విలీనం చేశారు. అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

2014 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Image copyright janasena/facebook
చిత్రం శీర్షిక 2014 ఎన్నికల సమయంలో జనసేన్ పార్టీ ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్

తాజాగా.. 'తమ్ముడు'

సినీనటుడు పవన్ కల్యాణ్ 2014 ఎన్నికల ముందు జనసేన పేరుతో పార్టీ స్థాపించారు.

అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీలకు మద్దతిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అన్ని చోట్ల నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.

ఎన్టీఆర్ పెద్ద కుమారుడు, సినీనటుడు హరికృష్ణ కూడా గతంలో 'అన్న తెలుగు దేశం' పేరుతో పార్టీని స్థాపించారు.

ఆ తర్వాత పార్టీని నడపలేక మళ్లీ టీడీపీలో చేరారు.

తమిళ నటుడు కార్తీక్ 2006లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి రాష్ట్ర సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు.

2009లో ఆలిండియా నాదులమ్ మక్కల్ కట్చీ పేరుతో పార్టీ పెట్టారు. అదే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో విరుదునగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఇటీవల టి.రాజేంద్రన్ ఆలిండియా లట్చియ ద్రవిడ మున్నెట్ర కళగం పేరుతో, శరత్ కుమార్.. ఆలిండియా సమత్తువ మక్కల్ కట్చీ( ఏఐఎస్ఎంకే) పేరుతో పార్టీ పెట్టారు.

Image copyright facebook/upendra fans
చిత్రం శీర్షిక కర్నాటక ప్రజన్వత జనతా పకాశ (కేపీజేపీ) పేరుతో పార్టీ స్థాపించిన కన్నడ నటుడు ఉపేంద్ర

కన్నడనాట ఒకే ఒక్కడు

కర్నాటకలోనూ రాజకీయాల్లోకి వచ్చిన సినీనటులు చాలా మందే ఉన్నారు. అంబరీశ్, పూజా గాంధీ, రమ్య వివిధ పార్టీలలో చేరారు. అయితే టాలీవుడ్ లో అప్పుడప్పుడు మెరిసే కన్నడ నటుడు ఉపేంద్ర.. కర్నాటకలో సొంతంగా పార్టీ పెట్టారు.

కర్నాటక ప్రజన్వత జనతా పకాశ ( కేపీజేపీ) పేరుతో పార్టీ పెట్టిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను బరిలో నిలుపుతానని ప్రకటించారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)