పాకిస్తాన్‌పై మండిపడ్డ ట్రంప్.. అఫ్గాన్‌లో ఓటమితోనే అమెరికా ఆవేశం అన్న పాక్

  • 2 జనవరి 2018
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాకిస్తాన్ ఉగ్రవాదులకు 'సురక్షిత ప్రాంతం'గా మారిందన్న ట్రంప్

పాకిస్తాన్ అబద్ధాలాడుతోందనీ, అమెరికాను మోసం చేస్తోందనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు నెలవుగా మారిందని ట్రంప్ 2018 సంవత్సరంలో చేసిన తొలి ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, ట్రంప్ ట్వీట్‌పై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా అందించిన నిధులన్నింటికీ లెక్కలున్నాయనీ, 'ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా ఓటమి'ని జీర్ణించుకోలేకనే ట్రంప్ ఇలా ఆవేశపడుతున్నారని పాక్ జవాబిచ్చింది.

పాకిస్తాన్‌కు అందించాల్సిన 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1596 కోట్లు) నిలిపివేయాలని అమెరికా ఆలోచిస్తోంది. నిజానికి ఈ సహాయం గత ఆగస్ట్‌లోనే అందించాల్సి ఉండగా ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదు.

'ద న్యూయార్క్ టైమ్స్'లో అచ్చయిన కథనం ప్రకారం, ఉగ్రవాద గ్రూపులను అణచివేయడంలో పాకిస్తాన్ వైఫల్యం చెందిందని భావిస్తున్న నేపథ్యంలోనే ఆర్థిక సహాయం నిలిపివేత అంశంపై అమెరికా ఆలోచిస్తోంది.

''గత 15 ఏళ్లలో పాకిస్తాన్‌కు అమెరికా మూర్ఖంగా రూ.2.11 లక్షల కోట్లు (3,300 కోట్ల డాలర్లు) సహాయం కింద అందించింది. వాళ్ల మన నాయకులను మూర్ఖుల కింద జమ కట్టి, మనకు అబద్ధాలు చెప్పారు, మోసం చేశారు. అఫ్గానిస్తాన్‌లో మనం ఉగ్రవాదులతో పోరాడుతున్నాం. అదే ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత ఆశ్రయాన్ని కల్పిస్తోంది. ఇకపై ఇది సాగదు'' అని ట్రంప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పాకిస్తాన్ స్పందన

దీనికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్పందిస్తూ, త్వరలోనే తాము ప్రెసిడెంట్ ట్రంప్ ట్వీట్‌కు జవాబిస్తామంటూ ట్వీట్ చేశారు.

"మేం నిజమేంటో ప్రపంచానికంతా చెబుతాం. వాస్తవాలకూ, కల్పనలకూ మధ్య తేడా ఏమిటో తెలియజెబుతాం" అని ఆయనన్నారు.

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్‌కు చెందిన 'జియో టీవీ'తో మాట్లాడుతూ, తాము అమెరికాకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని, ఇంతకన్నా తాము చేయగలిగిందేమీ లేదని అమెరికాకు చెప్పేశామని తెలిపారు. అమెరికా సాయానికి సంబంధించిన అన్ని వివరాలనూ బహిర్గతపరచడానికి తాము సిద్ధమేనని అన్నారు.

డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌ను విమర్శించడం మొదటిసారేమీ కాదు.

ఇంతకన్నా ఏమీ చేయలేం: పాక్ రక్షణ శాఖ

'ట్విటర్'లో పాకిస్తాన్ రక్షణశాఖ స్పందిస్తూ- ఉగ్రవాద నిరోధక పోరాటంలో అమెరికా మిత్రపక్షంగా తాము ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నామని చెప్పింది. ''గత 16 ఏళ్లలో అల్‌ఖైదాను తుదముట్టించే పోరులో అమెరికాకు భూమిపైన, గగనతలంలోన కమ్యూనికేషన్ పరంగా, సైనిక స్థావరాల వినియోగం, గూఢచార సమాచార మార్పిడి పరంగా సాయపడుతూ వచ్చాం. కానీ అమెరికా మాకు తిరిగిచ్చిందేమిటంటే- అవమానం, అపనమ్మకం. పాకిస్తానీలను చంపేసే ఉగ్రవాదులు సీమాంతర సురక్షిత స్థావరాల్లో ఉంటున్నారు. అమెరికా ఆ స్థావరాల గురించి తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది'' అని రక్షణశాఖ వ్యాఖ్యానించింది.

పాకిస్తాన్‌లోని అమెరికా రాయబారి డేవిడ్ హాలెను పాక్ విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం తమ కార్యాలయానికి పిలిపించి, ట్రంప్ ట్వీట్‌పై నిరసన వ్యక్తంచేసింది.

మరోవైపు, అమెరికాలో అఫ్గాన్ రాయబారి హమ్‌దుల్లా మోహిబ్, అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ట్రంప్ ట్వీట్‌ను స్వాగతించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)