ఎన్ఎంసీ బిల్లును డాక్టర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

  • 2 జనవరి 2018
వరంగల్‌లో వైద్య విద్యార్థుల నిరసన Image copyright Dr.Randheer
చిత్రం శీర్షిక ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వరంగల్‌లో వైద్య విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) బిల్-2017, తాజాగా దేశవ్యాప్తంగా ఆందోళనకు తెరతీసింది.

ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఏ), ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోషియేషన్‌లు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లుకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా ధర్నా చేపట్టాయి.

స్థాయి సంఘం పరిశీలనకు

ఈ నేపథ్యంలో ఎన్‌ఎంసీ బిల్లు-2017ను స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

పార్లమెంటు సభ్యులు, డాక్టర్లు వంటి వారి కోరిక మేరకు ఈ బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపుతున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ లోక్‌సభలో తెలిపారు.

అసలు ఎన్‌ఎంసీ బిల్లులో వివాదానికి కారణమైన అంశాలేమిటో చూద్దాం..

Image copyright Dr.Jitendra Singh
చిత్రం శీర్షిక కేరళలో..

బిల్లులోని ప్రధాన అంశాలు

ప్రస్తుతం ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)ను ఏర్పాటు చేస్తారు. ఇకపై అన్ని వ్యవహారాలు ఇదే చూసుకుంటుంది.

హోమియోపతి, ఆయుర్వేదం వంటి ఆయుష్ వైద్యుల కోసం ప్రభుత్వం ఒక బ్రిడ్జ్ కోర్సును తీసుకొచ్చింది. ఇది పూర్తి చేసిన ఆయుష్ వైద్యులు అల్లోపతి వైద్యాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు.

ఐఎంసీ యాక్ట్‌లోని క్లాజ్ 15 ప్రకారం ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే ఔషధాలను సిఫారసు చేయాలి. కానీ కొత్తగా తీసుకొస్తున్న బిల్లులో ఈ క్లాజ్‌ను తీసి వేయనున్నారు.

ప్రస్తుతం ఎంసీ‌ఐ సభ్యులను ఎన్నికల ద్వారా ఎన్నుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎన్‌ఎంసీలో సభ్యులను కేంద్రం నామినేట్ చేస్తుంది.

Image copyright MCI

ఎన్ఎంసీ స్వరూపం

25 మంది సభ్యులతో ఎన్‌ఎంసీ పాలక మండలిని ఏర్పాటు చేస్తారు. ఛైర్మన్, 12 మంది ఎక్స్ అఫిసియో సభ్యులు, 11 మంది తాత్కాలిక సభ్యులు, ఒకరు ఎక్స్ అఫిసియో సభ్యకార్యదర్శి ఇందులో ఉంటారు. వీరందరినీ కేంద్రం నామినేట్ చేస్తుంది.

సభ్యుల నియామకం

ఎన్‌ఎంసీ సభ్యులను నియమించేందుకు ప్రభుత్వం ఒక నియామక సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఛైర్మన్, ఆరుగురు సభ్యులు ఉంటారు.

కేబినెట్ కార్యదర్శి నియామక సంఘానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

నీతి ఆయోగ్ ముఖ్యకార్యదర్శి (సీఈఓ), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శితోపాటు కేంద్రం నియమించిన మరో నలుగురు ఇందులో సభ్యులుగా ఉంటారు.

ఈ బిల్లులోని కొన్ని అంశాలపై ఐఎంఏ, ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోషియేషన్‌, కొందరు వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. వారి ఆందోళనకు కారణాలు చూద్దాం..

Image copyright MCI

నామినేషన్లు: ఎంసీ‌ఐ స్థానంలో ఎన్‌ఎంసీని తీసుకురావడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఎన్‌ఎంసీలో సభ్యులందరినీ కేంద్ర ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది. ఎన్నికలు ఉండవు. ఇది నిరంకుశత్వానికి దారి తీస్తుందని, ఇలాంటి సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించలేరనీ, ప్రభుత్వానికి విధేయంగా ఉంటారనీ ఐఎంఏ చెబుతోంది.

బ్రిడ్జ్ కోర్సు: హోమియోపతి, ఆయుర్వేదం వంటి వాటిని ప్రాక్టిస్ చేసే వైద్యుల కోసం ప్రభుత్వం బ్రిడ్జ్ కోర్సు ఏర్పాటు చేస్తుంది. దీన్ని పూర్తి చేసిన వారిని ఎంబీబీస్ డాక్టర్లుగా గుర్తిస్తారు. వీరు ఇకపై అల్లోపతి వైద్యాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు.

ఇది ఎంతో ప్రమాదకరమని ఐఎంఏ అంటోంది. ఆయుష్ వైద్యులకు అల్లోపతి అవకాశం ఇవ్వడమంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని హెచ్చరిస్తోంది.

Image copyright Dr.Randheer
చిత్రం శీర్షిక విశాఖపట్నంలో..

వ్యవస్థను నాశనం చేయడం తగదు

ఎన్‌ఎంసీ బిల్లు-2017 ఎంతో ప్రమాదకరమని ఐఎంఏ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ గౌరవ కార్యదర్శి డాక్టర్ పసుమూర్తి పుల్లారావు అన్నారు.

"ఈ విధానాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)లో అవినీతి పేరుకు పోయిందనేది ప్రభుత్వ వాదన. ఈ అవినీతిని భూతంగా చూపించి మొత్తం ఎంసీఐనే తీసేయడం సబబు కాదు. వ్యవస్థను సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. కానీ దానిని నాశనం చేయడం సమస్యకు పరిష్కారం కాదు" అని పుల్లరావు తెలిపారు.

Image copyright Dr.Randheer
చిత్రం శీర్షిక ఇతరులు అల్లోపతి వైద్యాన్ని ప్రాక్టీస్ చేయడం ప్రజలకు ఎంతో ప్రమాదకరమని డాక్టర్ రణధీర్ అంటున్నారు

ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం

ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లు ప్రజారోగ్య రంగానికి ఎంతో ప్రమాదకరమని ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ రణధీర్ కె అన్నారం అన్నారు.

అల్లోపతి చదవని వారికి ఈ వైద్యం ప్రాక్టీస్ చేసేలా అనుమతి ఇవ్వడం సబబు కాదని ఆయన తెలిపారు.

Image copyright Dr.Jitendhra
చిత్రం శీర్షిక దిల్లీలో..

మరో పరీక్ష ఎందుకు?

వైద్య విద్యను పూర్తి చేశాకా వైద్యునిగా ప్రాక్టీసు మొదలు పెట్టాలంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ లేదా నేషనల్ లైసెన్సియేట్ టెస్ట్‌ (ఎన్‌ఎల్‌టీ)కు అర్హత సాధించాల్సి ఉంటుందని బిల్లులో ప్రతిపాదించారు. అయితే దీనిని వైద్య విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు.

14 ఫైనల్ పేపర్లు, 32 ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షలు వంటి వాటిని ఎదుర్కొన్న తరువాత మళ్లీ ఈ ఎన్‌ఎల్‌టీ అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల మరో ఆరు నెలల సమయం వృథా అవుతుందని డాక్టర్ రణధీర్ అంటున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)