కోరెగాం హింస: నేడు మహారాష్ట్ర బంద్‌కు దళిత సంఘాల పిలుపు

  • 3 జనవరి 2018
హింస

మహారాష్ట్రలోని పుణెకు సమీపంలో ఉన్న కోరెగాం భీమాలో దళితులపై జరిగినట్టు చెబుతుందన్న దాడుల సంఘటనల తర్వాత రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో దళిత సంఘాలు ప్రదర్శనలు నిర్వహించాయి.

కోరెగాం భీమా ఘటనకు 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నాడు విజయోత్సవం జరుపుకున్నారు. ఆ సందర్భంగా అకస్మాత్తుగా హింస జరిగింది. ఈ హింసలో ఒక వ్యక్తి మరణించాడు.

Image copyright AFP/Getty Images

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు, దళిత హక్కుల కార్యకర్త ప్రకాశ్ అంబేడ్కర్ సహా 8 సంఘాలు బుధవారం నాడు మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ న్యాయ విచారణకు ఆదేశించగా దానిని భారిప్ బహుజన్ మహాసంఘ్ (బీబీఎం) నాయకుడు ప్రకాశ్ అంబేడ్కర్ తోసిపుచ్చారు.

ఈ ఘటనపై ఎవరైనా సిటింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించేలా బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విచారణకు నేతృత్వం వహించే జడ్జికి సాక్ష్యాలను సేకరించడంతో పాటు దోషులకు శిక్ష విధించే అధికారాలు కూడా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణను దళితేతర జడ్జితో జరిపించాలని కూడా ఆయన డిమాండ్లలో ఉంది.

చిత్రం శీర్షిక పుణెలో దహనకాండ

హింసాకాండ

మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబయి చుట్టుపక్కల్లోని చెంబూర్, గోవండీ, ఘాట్కోపర్ ప్రాంతాల్లో చాలా చోట్ల రోడ్లు బ్లాక్ చేశారు. రాళ్లు రువ్వారు. ఈ ప్రాంతాలన్నీ దళితులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు. కొన్ని చోట్ల ప్రదర్శనకారులు దహనకాండకు కూడా పాల్పడ్డారు.

పుణెకు దగ్గర్లోని పింప్రీలో సాయంత్రం ఐదున్నరకు రోడ్లను జామ్ చేసి అనేక కార్లకు నిప్పు పెట్టారు. పుణెలో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హాజరు కావాల్సి ఉండగా ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.

సీసీటీవీ ఫుటేజిని పరిశోధిస్తున్నామని పుణె రూరల్ ఎస్పీ సుహేజ్ హక్ బీబీసీతో చెప్పారు.

ఇప్పటివరకు వేర్వేరు ప్రాంతాల్లో 176 బస్సులను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ముంబయికి దగ్గర్లోని చెంబూర్, ఘాట్కోపర్‌లలో విధ్వంసం, దహనకాండ ఎక్కువ జరిగాయి.

పోలీసులు ఇద్దరు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Image copyright Mayuresh Kunnur/BBC

న్యాయవిచారణకు ఆదేశం

కోరెగాం ఘటనలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ న్యాయవిచారణకు ఆదేశించారు. "పుణెలో కోరెగాం భీమా యుద్ధపు 200వ వార్షికోత్సవంలో జరిగిన హింసపై న్యాయ విచారణ జరిపిస్తాం" అని ముఖ్యమంత్రి అన్నారు.

చరిత్రకారులు చెప్పే ప్రకారం, 200 ఏళ్ల క్రితం, 1818 జనవరి 1న 'అస్పృశ్యులు'గా భావించే 800 మంది మహార్లు చిత్పావన్ బ్రాహ్మణుడైన పీష్వా బాజీరావు-2కు చెందిన 28 వేల సైనికులను ఓడించారు.

ఈ మహార్ సైనికులంతా ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున పోరాడారు. ఈ యుద్ధం తర్వాతే పీష్వాల పాలన అంతమైంది.

ప్రతి ఏటా జనవరి 1న దళితులు కోరెగాం భీమా దగ్గర జమయ్యి విజయోత్సవం జరుపుకుంటారు.

Image copyright Mayuresh Kunnur/BBC

అకస్మాత్తుగా మొదలైన రాళ్ల వర్షం

ఈసారి కూడా వేలాది దళితులు విజయోత్సవంలో పాల్గొనడానికి అక్కడికి వచ్చారు. అయితే అక్కడ అకస్మాత్తుగా విధ్వంసం, రాళ్లు రువ్వుకున్న ఘటనలు మొదలయ్యాయి. ఇందులో చాలా మంది గాయపడ్డారు. అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ముఖ్యమంత్రి ఫడణవీస్ మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

అట్లాగే, ఈ ఘటనలపై మీడియా ద్వారా వ్యాపిస్తున్న పుకార్లను నమ్మొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పుకార్లను వ్యాపింపజేసే వారిపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.

Image copyright Getty Images

బీజేపీపై రాహుల్ మండిపాటు

మరోవైపు, కోరెగాం భీమాలో జరిగిన హింసపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ఇందుకు బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లను ఆయన తప్పుబట్టారు.

బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లు దళితులను సామాజికంగా అణగదొక్కాలనే చూస్తాయని ఆయన ఆరోపించారు.

"భారత్‌కు సంబంధించి ఆర్ఎస్‌ఎస్, బీజేపీల దృక్పథంలో కీలకాంశం దళితులను భారతీయ సమాజంలో అట్టడుగు స్థానంలో ఉంచడమే. ఉనా, రోహిత్ వేముల, ఇప్పుడు భీమా-కోరెగాం ఘటనలు ఈ ప్రతిఘటనకు సజీవ ఉదాహరణలు" అని ఆయన మంగళవారం నాడు ట్వీట్ చేశారు.

కోరెగాంలో ఘటనల తర్వాత మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు రోడ్లను జామ్ చేశారు. ఔరంగాబాద్‌లో సెక్షన్ 144 విధించారు.

గోవండీ రైల్వే స్టేషన్‌లో హార్బర్ లైన్‌ను జామ్ చేయడం వల్ల అనేక లోకల్ ట్రెయిన్లు నిలిచిపోయాయి.

మరోవైపు, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ దీనిపై మాట్లాడుతూ, ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని విమర్శించారు.

Image copyright Mayuresh Kunnur/BBC

రాజకీయ, సామాజిక రంగాల్లో పని చేసేవారు ఈ ఘటనను రాజకీయం చేయొద్దని శరద్ పవార్ అన్నారు.

ప్రజలు శాంతిని కాపాడాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రామ్‌దాస్ అఠవలే అన్నారు. హింసను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)