అస్సాం: ఇది హిందూ-ముస్లింల ఘర్షణా లేక అస్సామీలకూ బెంగాలీలకూ మధ్య ఘర్షణా?

  • 3 జనవరి 2018
అస్సాం Image copyright AFP/Getty Images

స్వాతంత్ర్యం తరువాత 1951లో, అస్సాంలో 'నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్' తయారు చేశారు. 1951 జనాభా లెక్కల తరువాత తయారుచేసిన ఈ రిజిస్టర్‌లో అస్సాంలో అప్పటికి ఉన్న ప్రజలందరి వివరాలు నమోదు చేశారు.

ఆ తరువాత, అప్పటి తూర్పు పాకిస్తాన్ నుంచి, ఆ తరువాత బంగ్లాదేశ్ నుంచి జనం తరలిరావడంతో అస్సాం ముఖచిత్రం క్రమంగా మారుతూ వచ్చింది. ఆ తరువాత విదేశీయుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో అస్సాంలో 1979 నుంచి 1985 వరకు ఆరేళ్ల పాటు తీవ్రమైన ఆందోళనలు జరిగాయి.

కానీ, ఇక్కడ తలెత్తిన ప్రశ్న ఏమిటంటే ఎవరు విదేశీయులు, ఎవరు కారు? వీరిని లెక్కించడమెలా? అప్పట్లో, విదేశీయులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో వివాదానికి ఇదొక ముఖ్య కారణం. 1985లో ఆసు, తదితర సంస్థలతో భారత ప్రభుత్వం ఒక ఒప్పందానికి వచ్చింది. ఈ ఒప్పందాన్ని 'అస్సాం ఒప్పందం'గా పిలుస్తారు.

ఈ ఒప్పందం ప్రకారం, 1971 మార్చి 25 తరువాత అస్సాంకు తరలివచ్చిన హిందూ-ముస్లింలను లెక్కించి, వాళ్లను రాష్ట్రం నుంచి బయటకు పంపించాలి. 2005లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌ను సవరించాలని నిర్ణయించారు.

Image copyright RAVEENDRAN/AFP/GettyImages

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో...

అస్సాం ఒప్పందం ప్రకారం, 1971 మార్చి 25కు ముందు అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన వారి వివరాలు కూడా ఈ రిజిస్టర్‌లో నమోదు చెయ్యాలి. కానీ వివాదం అక్కడితో ఆగిపోలేదు.

ఈ విషయం కోర్టు వరకు వెళ్ళింది. ఈ విషయమై వచ్చిన వివాదాలన్నిటినీ కలిపి 2015లో సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రతీక్ హజేలా అనే ఐఏఎస్ అధికారికి ఎన్ఆర్‌సీ (NRC) పని అప్పగించారు. ప్రతీక్ హజేలాకి ఎన్ఆర్‌సీ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించి ఈ రిజిస్టర్‌ను గడువులోపే సవరించాలని ఆదేశించారు.

2017 డిసెంబర్ 31న ఈ ఎన్ఆర్‌సీ డ్రాఫ్టును పబ్లిష్ చెయ్యాలని చివరి గడువు విధించారు. కానీ, విధించిన గడువులోగా డ్రాఫ్టు పూర్తి చెయ్యడం కష్టమని, జూలై వరకు గడువును పొడిగించాలని ఎన్ఆర్‌సీ కోఆర్డినేటర్ కోరారు. సుప్రీంకోర్టు ఈ వినతికి అంగీకరించలేదు.

ఎంతవరకు తయారుచేస్తే అంతవరకే డిసెంబర్ 31న జాబితాను ప్రచురించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకే, ఆదివారం రాత్రి 12 గంటలకు ఈ డ్రాఫ్ట్‌ను విడుదల చేశారు. ఇందులో రెండు కోట్ల కన్నా ఎక్కువ మంది ప్రజల వివరాలు నమోదై ఉన్నాయి.

మిగిలినవాళ్ల పేర్లు ఇంకా ధృవపరచవలసి ఉంది. ఈ డ్రాఫ్ట్‌లో పేర్లు లేని వారికి తమ వాదనలు వినిపించుకునే వీలు కల్పిస్తారు. ఈ డ్రాఫ్ట్ కారణంగా అస్సాంలో కొంత మేరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎవరి పేరైనా ఈ డ్రాఫ్ట్‌లో లేకపోతే వారిని విదేశీయులుగా పరిగణిస్తారా అని ప్రజలు నిలదీస్తున్నారు. వారిని ఏం చేస్తారనే విషయంలో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు గమనించిన పరిస్థితి ఏమిటంటే, ఒకే కుటుంబంలో ఇద్దరి పేర్లు నమోదై ఉంటే, మరొకరి పేరు నమోదు కాలేదు.

ఇలాంటి అవకతవకలు చాలానే ముందుకొచ్చాయి. ఇలాంటి ఫిర్యాదులొచ్చినప్పుడు ఎన్ఆర్‌సీ వాటిని వెంటనే సరిచేస్తుందని ఆశిస్తున్నారు.

Image copyright DIPTENDU DUTTA/AFP/GettyImages

1951లో ప్రారంభమైన ఎన్ఆర్‌సీ వ్యవహారంలో 2018 వరకు ఎందుకు కదలిక రాలేదన్నది మరో ప్రశ్న.

దేశ విభజన తర్వాత ఎవరెవరు ఎక్కడున్నారు, అస్సాంలో ఎంత మంది ఉన్నారు, వారెవరు- వంటి వివరాలన్నీ రిజిస్టరులో నమోదు చేయడం అప్పటి ఎన్ఆర్‌సీ లక్ష్యం.

తర్వాత కూడా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. వలస వచ్చిన వారిలో చట్టబద్ధంగా వచ్చిన వారున్నారు. అక్రమంగా వచ్చిన వారూ ఉన్నారు. చట్టపరంగా చాలా మంది వచ్చారు. వారు తిరిగి వెనక్కి వెళ్లలేదు.

ఈ క్రమంలోనే అస్సాం ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం 1971 మార్చి 21ను కటాఫ్ తేదీగా నిర్ణయించి ఎన్‌ఆర్‌సీని సవరించాలని నిర్ణయించారు.

ఆ తేదీనే బంగ్లాదేశ్‌ను సార్వభౌమ దేశంగా షేక్ ముజీబుర్ రహమాన్ ప్రకటించారు. అయితే అధికార మార్పిడి ప్రకటన 1971 డిసెంబర్ 16న జరిగింది.

Image copyright SAJJAD HUSSAIN/AFP/GettyImages

ఎన్ఆర్‌సీపై రాజకీయాలు

ఈలోగా నేషనల్ రిజస్టర్ ఆఫ్ సిటిజెన్‌పై రాజకీయాలు మొదలయ్యాయి. అస్సాంలో ముస్లిం జనాభా 34 శాతంకన్నా ఎక్కువ. వీరిలో 85 శాతం మంది ముస్లింలు బయటి ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారే. వీరిలో అత్యధికులు బంగ్లాదేశీయులు. వీరంతా వేర్వేరు సమయాల్లో ఇక్కడికొచ్చారు. వీరు భారత్‌నే తమ దేశంగా భావించారు. ఇక్కడి భాష కూడా నేర్చుకున్నారు.

అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన హిందువులకు పౌరులుగా గుర్తింపునిస్తామని బీజేపీ అస్సాం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో పౌరసత్వ చట్టంలో ఒక సవరణ చేసింది. అదిప్పుడు పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే హిందువులకు సమస్యేమీ ఉండదు కానీ ముస్లింలకు మాత్రం ఇబ్బందులు తప్పవు.

ఎన్ఆర్‌సీ డేటాను విడుదల చేయగానే అస్సాంలో పెద్ద ఎత్తున హింస చెలరేగవచ్చనే ప్రచారం ముందు నుంచే మొదలైంది. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. సైన్యాన్ని అప్రమత్తం చేశారు. బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన వారిలో హిందువులు, ముస్లింల మధ్య విభజన రేఖను బీజేపీ గీసింది.

హిందువులైతే అక్రమంగా ప్రవేశించినా అభ్యంతరం లేదు కానీ ముస్లింల విషయంలో అక్రమ చొరబాట్లను సహించరనే ప్రచారం సాగుతోంది. మత ప్రాతిపదికన జనాన్ని చీల్చే రాజకీయ ఎత్తుగడలు బీజేపీ అనుసరిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులకు పౌరసత్వం ఇవ్వడం ద్వారా అస్సాం హిందూ ప్రాబల్య రాష్ట్రంగా ఉంటుందని బీజేపీ ఆశిస్తోంది.

బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలకు సమాంతరంగా మరో భిన్నమైన భావజాలం కూడా తలెత్తుతోంది. వీరు అసమియా భాషను ప్రధానాంశం చేస్తున్నారు. రాష్ట్రంలో బంగ్లా భాష మాట్లాడేవారి సంఖ్య పెరగడం వల్ల అసమియా భాష ప్రమాదంలో పడుతోందని వారి అభిప్రాయం. ఈ కారణంగా అస్సాంలో ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతలతో పాటు సామాజిక ఉద్రిక్తతలు కూడా పెరుగుతున్నాయి.

మా ఇతర కథనాలు: