ప్రెస్ రివ్యూ: రాజకీయం చేస్తే ఎవ్వరి మాటా వినబోనన్న చంద్రబాబు

  • 4 జనవరి 2018
నారా చంద్రబాబు నాయుడు Image copyright tdp.ncbn.official/facebook

''రాజకీయం చేస్తే ఎవ్వరి మాటా వినను. చాలా గట్టిగా ఉంటాను. మా మీటింగ్‌లోకి వచ్చి నీవేదో గొప్పలు చెప్పదలచుకొంటే ఎవరూ పట్టించుకోరు, గౌరవం నేర్చుకోండి, గౌరవంగా మాట్లాడండి'' అని వైసీపీ కడప ‌లోక్‌సభ సభ్యుడు అవినాష్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

బుధవారం పులివెందులలో జన్మభూమి సభలో అవినాష్ మాట్లాడుతూ- వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గండికోట, చిత్రావతి పనులు 85 శాతం పూర్తయ్యాయని, టీడీపీ ప్రభుత్వం చేసింది 15 శాతం పనులేనని పేర్కొన్నారు.

చంద్రబాబు స్పందిస్తూ- జన్మభూమి సభలో రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. ఇది ప్రజాసభని, ఇక్కడ ఎవరూ రాజకీయాలు మాట్లాడకూడదని, ఎవరి సభలు వారికుంటాయని, అక్కడ మాట్లాడుకోవాలని, ఇక్కడ గౌరవంగా సమావేశం జరగాలని వ్యాఖ్యానించారు.

''ఈ ప్రాంతానికి ఇవాళ నీరు ఇచ్చింది నేను, ఈ విషయం కూడా ఇక్కడ చెప్పలేదు. గౌరవంగా ఉండటం నేర్చుకోవాలి. ఏమైనా సమస్యలు ఉంటే రెప్రజెంటేషన్ ఇవ్వండి, పరిష్కరిస్తాను'' అని సీఎం చెప్పారని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

Image copyright AFP/GettyImages
చిత్రం శీర్షిక దువ్వూరి సుబ్బారావు

దువ్వూరి: ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై సామాన్యులు ఆందోళన చెందొద్దు

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌(ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లుతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారని 'ఈనాడు' తెలిపింది.

''ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల ఖాతాదారుల సొమ్ముకు భద్రత ఉండదనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే సామాన్యులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బ్యాంకులు నష్టపోయిన క్రమంలో ప్రభుత్వం ఆ నష్టాన్ని భరించాల్సి వస్తోంది. అది కూడా ప్రజల సొమ్మనే విషయం గుర్తించాలి. ఇలాంటివి అరికట్టడానికి ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ఉపయోగపడుతుంది'' అని ఆయన తెలిపారు.

బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో 'ప్రజల దైనందిన కార్యక్రమాల్లో ఆర్‌బీఐ పాత్ర' అనే అంశంపై సుబ్బారావు ప్రసంగించారు.

పెద్దనోట్ల రద్దుతో తాత్కాలిక నష్టం జరిగినా దీర్ఘకాలంలో తగిన ప్రయోజనాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం నోట్లరద్దు నిర్ణయంతోనే నల్లధనం రూపుమాపడం అసాధ్యమని చెప్పారు.

నిరుపేదలకు జన్‌ధన్‌ యోజన లాంటి పథకాల కింద ఖాతాలు తెరిచినంత మాత్రాన ఉపయోగం ఉండదని, ఆ ఖాతాల ఆధారంగా వారికి తగిన రుణాలు ఇవ్వాలని సుబ్బారావు అభిప్రాయపడ్డారు.

Image copyright High court website

‘హైకోర్టు విభజనకు ముందడుగు’

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందడుగు పడిందని 'సాక్షి' తెలిపింది.

''హైకోర్టు ఏర్పాటు కోసం అమరావతిలో ప్రభుత్వం గుర్తించిన భవనాలను పరిశీలించేందుకు న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది, ఇందుకు ఐదుగురు న్యాయమూర్తులతో సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయింనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల విభజనకు ఓ సబ్‌ కమిటీ, రికార్డుల డిజిటైజేషన్‌ ప్రక్రియ పరిశీలనకు ఓ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు'' అని పత్రిక రాసింది.

న్యాయమూర్తులందరూ పాల్గొన్న ఈ భేటీ దాదాపు గంటా 10 నిమిషాలు సాగిందని ‘సాక్షి’ పేర్కొంది.

ఏడేళ్లలో విశ్వనగరం స్థాయికి హైదరాబాద్: కేటీఆర్

ఆరేడేండ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరం స్థాయికి చేర్చుతామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారని ‘నమస్తే తెలంగాణ’ రాసింది. ఇవాంకా ట్రంప్ పర్యటన కోసమే హైదరాబాద్‌లో రోడ్లను బాగు చేస్తున్నారంటూ గతంలో వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారని, నగరంలో రోడ్ల సుందరీకరణ పనులను అంతకుముందే చేపట్టామని చెప్పారని తెలిపింది.

భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక అనుకూలతలు హైదరాబాద్ సొంతమని ఆయన పేర్కొన్నారు. బుధవారం అయ్యప్ప సొసైటీ జంక్షన్‌లో రూ.44.3 కోట్లతో నిర్మించిన అండర్‌పాస్‌ను ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

హైదరాబా‌ద్ రహదారులను సిగ్నల్ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు రూ.23 వేల కోట్ల వ్యయంతో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) చేపట్టామని కేటీఆర్ చెప్పారు.

ఈ పథకం కింద 111 కిలోమీటర్ల పొడవున ఫ్లైఓవర్లు, స్కైవేలు, కారిడార్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, మొదటి దశలో రూ.3,200 కోట్లతో 19 చోట్ల పనులు చేపట్టగా, అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్ పూర్తితో మొదటి ఫలం అందుకుంటున్నామని ఆయన తెలిపారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)