హెచ్-1బీ వీసా: ఏమిటి? ఎందుకు? ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

  • 5 జనవరి 2018
ఎగురుతున్న అమెరికా జాతీయ జెండా Image copyright Facebook/DHS

అమెరికా.. మన దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా నిత్యం అందరి తలపుల్లో మెదులుతూనే ఉంటుంది.

ఇందుకు కారణం.. లక్షలాది భారతీయులు ఆ దేశంలో ఉద్యోగం చేస్తుండటమే. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అక్కడ కొలువుల్లో ఉన్నారు.

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఐటీ ఉద్యోగులు, హెచ్-1బీ వీసాలు వంటి అంశాలు అడపదడపా పతాక శీర్షికల్లో నిలుస్తూ వస్తున్నాయి.

తాజాగా కూడా హెచ్-1బీ, హెచ్-4 వీసాలపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ వీసాలు అంటే ఏమిటో చూద్దాం..

Image copyright facebook/uscis
చిత్రం శీర్షిక ఇటీవలే అమెరికా పౌరసత్వం పొందిన ఓ కుటుంబం

వీసా అంటే?

ఒక దేశానికి చెందిన పౌరుడు/పౌరురాలు మరో దేశాన్ని సందర్శించాలంటే అనుమతి పత్రం కావాలి. అటువంటి అనుమతి పత్రాన్నే వీసా అంటారు. ఉదాహరణకు ఎవరైనా అమెరికా వెళ్లాలనుకుంటే ఆ దేశం నుంచి వీసా తీసుకోవాలి. ఇలాంటి వీసాలు చాలా రకాలు ఉంటాయి. పర్యాటకులు, వ్యాపారులు, ఉద్యోగులు, కళాకారులు, క్రీడాకారులు ఇలా భిన్న వర్గాల వారికి భిన్నమైన వీసాలు ఉంటాయి.

హెచ్-1బీ వీసా ఏమిటి?

అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్-1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు.

Image copyright facebook/uscis

ఎలా పుట్టింది?

అమెరికాలో 90వ దశకంలో టెక్నాలజీ ఆధారిత సంస్థలు విపరీతంగా పుట్టుకొచ్చాయి. ఆ దేశ ఆర్థికవ్యవస్థ కూడా వేగంగా వృద్ధి చెందుతున్న కాలం అది.

టెక్నాలజీ, పరిశోధన, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఏర్పడింది. ఆ సమయంలో అమెరికాలో వీరికి ఎంతో కొరత ఉంది.

కాబట్టి నైపుణ్యం కలిగిన విదేశీయులను తాత్కాలిక కాలానికి నియమించుకునేందుకు ప్రభుత్వం సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా 1990లో హెచ్-1బీ వీసాలను ప్రారంభించారు.

జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇమిగ్రేషన్ యాక్ట్-1990 అమల్లోకి వచ్చింది.

Image copyright SERGEY BOBOK/getty images

నాన్-ఇమిగ్రేషన్ అంటే?

అమెరికా జారీ చేసే వీసాలు ప్రధానంగా రెండు రకాలుంటాయి. ఒకటి ఇమిగ్రేషన్ రెండు నాన్-ఇమిగ్రేషన్. అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి ఈ ఇమిగ్రేషన్ వీసాలు ఇస్తారు.

దీనికి కొన్ని అర్హతలుండాలి. అమెరికాలో తాత్కాలికంగా కొంత కాలం ఉండేందుకు ఉద్దేశించినవి నాన్-ఇమిగ్రేషన్ వీసాలు. కాబట్టి హెచ్-1బీ వీసా నాన్-ఇమిగ్రేషన్ పరిధిలోకి వస్తుంది.

Image copyright FAcebook/USCIS
చిత్రం శీర్షిక భారత్ నుంచి హెచ్-1బీ వీసాపై వెళ్లి అమెరికా పౌరసత్వం పొందిన దంపతులు

హెచ్-1బీ రకాలు

అమెరికా ప్రతి ఏడాదీ పరిమిత సంఖ్యలో మాత్రమే హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంది. ఇవి మూడు విభాగాలుగా ఉంటాయి.

సాధారణం: ఏడాదికి 65,000 వీసాలు జారీ చేస్తారు. వీటిని జనరల్ కోటా అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

మాస్టర్స్: అమెరికాలో మాస్టర్స్ చేసిన వారికి ఏడాదికి 20,000 వీసాలు ఇస్తారు. వీటికి అందరూ దరఖాస్తు చేసుకోలేరు.

రిజర్వ్‌డ్: స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా సింగపూర్, చిలీ దేశాలకు ఏడాదికి 6,800 వీసాలను రిజర్వ్ చేసి ఉంచారు.

Image copyright NICHOLAS KAMM/getty images
చిత్రం శీర్షిక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

ఎంపిక విధానం

హెచ్-1బీ వీసాలకు డిమాండు బాగా ఉంటుంది. కోటాకు మించి దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో వీసాలు కేటాయిస్తారు. కంప్యూటర్ ర్యాండమ్‌గా వీటిని ఎంపిక చేస్తుంది.

ఎవరు దరఖాస్తు చేయాలి?

తమ ఉద్యోగుల కోసం సంస్థలు హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేస్తుంటాయి. అలాగే మరి కొన్ని సంస్థలు స్పాన్సర్ చేస్తుంటాయి.

దరఖాస్తు ఫీజు

ఆయా సంస్థల పరిమాణం ఆధారంగా హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజు సుమారు 1,600 డాలర్ల నుంచి 7,400 డాలర్ల వరకు ఉంటుంది. అంటే మన కరెన్సీలో చూస్తే దాదాపు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య ఉండొచ్చు.

50 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు, 50 శాతం ఉద్యోగులు హెచ్-1బీ వీసాల మీద ఉన్న సంస్థలు అదనంగా 4,000 డాలర్లు (రూ.2.60 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది.

Image copyright FAcebook/USCIS

కాల పరిమితి

ఒకసారి హెచ్-1బీ వీసా లభిస్తే మూడేళ్లపాటు అమెరికాలో ఉండొచ్చు. ఈ కాల పరిమితిని పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. కానీ మొత్తం మీద ఆరేళ్లకు మించకూడదు.

డిపెండెంట్ వీసా

హెచ్-1బీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు డిపెండెంట్ వీసా ద్వారా అమెరికాలో ఉండొచ్చు. ఇందుకు వారు హెచ్-4 వీసాలను తీసుకోవాలి.

జీవిత భాగస్వామి, 21 ఏళ్లలోపు పిల్లలకు ఈ అవకాశం ఉంటుంది. హెచ్-4 వీసా ఉన్న కుటుంబ సభ్యులు అమెరికాలో చదువుకోవచ్చు. అయితే ఈ వీసా మీద ఎటువంటి ఉద్యోగాలు చేయడానికి లేదు. ఇందుకు వర్క్ పర్మిట్ తీసుకోవాలి.

(ఆధారం: యూఎస్ ఎంబసీ ఇండియా, యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్)

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరిలో వ‌రుస పడవ ప్ర‌మాదాలు... ఎందుకిలా జ‌ర‌ుగుతోంది? ఎవరు బాధ్యులు?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

కశ్మీర్: పీఎస్ఏ చట్టం కింద ఫారూక్ అబ్దుల్లా నిర్బంధం... ఏమిటీ చట్టం? ఎంత కఠినం?

దక్షిణ కొరియా నాయకులు ఎందుకు గుండు కొట్టించుకుంటున్నారు?

ధోనీ మళ్లీ ఆడతాడా... భారత క్రికెట్‌కు అతడి అవసరం ఇంకా ఉందా?

ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'..

గుజరాత్ 2002 అల్లర్ల ముఖ చిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా.. వీళ్లు ఇప్పుడేం చేస్తున్నారు

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు