#గమ్యం: 2020 తర్వాత ఐటీ, సైన్స్ కాకుండా మరే రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి?

  • అనిల్ కుమార్
  • బీబీసీ ప్రతినిధి
బీమా రంగం

ఫొటో సోర్స్, Getty Images

నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం ఏం చదివితే 2020 తర్వాత ఉద్యోగావకాశాలుంటాయనే అంశాల్ని గత రెండువారాలుగా చర్చిస్తున్నాం. డిజిటల్ టెక్నాలజీ, హెల్త్ సైన్సెస్ రంగాల్లో ఉపాధికి ఎక్కువ అవకాశాలున్న కోర్సులు, వాటిని అందిస్తున్న విద్యాసంస్థలు తెలుసుకున్నాం.

జాబ్ మార్కెట్ రాన్రాను చాలా కష్టతరంగా మారుతోంది. ఉద్యోగం సాధించడం ఏమాత్రం సులభం కాదు. టెక్నాలజీ పెరిగేకొద్దీ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. ఇంకా తగ్గిపోతాయి.

అందువల్ల టెక్నాలజీ కాకుండా ఇతర రంగాలకు ప్రాధాన్యం పెరగబోతోంది. సంప్రదాయేతర రంగాల్లో సైతం ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. మాన్‌స్టర్‌తో కలసి సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైన ఈ వివరాలను Careers360.com ఛైర్మన్ మహేశ్వర్ పేరి ఈరోజు బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'లో వివరిస్తున్నారు.

వీడియో క్యాప్షన్,

#గమ్యం: 2020 తర్వాత ఐటీ, సైన్స్ కాకుండా ఇతర ఏ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి?

మీకు ఇంకా ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీ లో కామెంట్ పోస్ట్ చేయండి. వాటికి మహేశ్వర్ పేరి సమాధానాలు ఇస్తారు.

ఇన్సూరెన్స్

భవిష్యత్తులో ఏ పని చేయాలన్నా బీమా పాలసీ ఉండటం తప్పనిసరి. ఉదాహరణకు... విదేశాలకు వెళ్లాలన్నా, బ్యాంకులనుంచి రుణం తీసుకోవాలన్నా... ఇలా ఏం చేయాలన్నా బీమా తప్పనిసరి కానుంది. అందువల్ల ఈ రంగం చాలా అభివృద్ధి చెందనుంది. 2030 కల్లా బీమారంగంలో 30 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని ఇటీవల అసోచామ్ చేసిన ఓ సర్వేలో వెల్లడైంది. దీనిలో మళ్లీ సేల్స్, మార్కెటింగ్.. ఇలా వివిధ విభాగాలుంటాయి. కాబట్టి ఆయా రంగాల్లో అర్హులైన వారికి ఉద్యోగావకాశాలకు ఇబ్బంది ఉండదు.

ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ వంటి ఎన్నో సంస్థలు బీమారంగంలో ఉపాధికి అవసరమైన శిక్షణను అందిస్తున్నాయి.

బీమా పాలసీ ఇవ్వాలంటే ప్రతి కంపెనీ పాలసీదారుడి అసలైన విలువను లెక్కించాల్సి ఉంటుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూక్చూవరీస్... దీనిపై కోర్సులందిస్తుంది. దీన్ని పూర్తి చేసినా కచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఆర్గానిక్ అగ్రికల్చర్

ఆరోగ్యంపై అందరికీ అవగాహన పెరుగుతోంది. రసాయనాలు వాడిన పదార్థాలు తినకూడదనే స్పృహ చాలామందిలో పెరుగుతోంది. అందుకే కొందరు రైతులు ఆర్గానిక్ వ్యవసాయం అనే విధానాన్ని అవలంబిస్తున్నారు.

ఈ పద్ధతిలో కృత్రిమ ఎరువులు ఉపయోగించకుండా సేంద్రియ ఎరువులు మాత్రమే వాడి పంటలు పండిస్తారు. ఇలా పండించిన పంటలు, ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటోంది. రసాయనాలు వాడిన ఆహార పదార్థాలను తినడానికి ప్రస్తుతం ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. అందరూ ఆర్గానిక్ ఉత్పత్తులపై మక్కువ పెంచుకుంటున్నారు. ధర ఎక్కువైనా వాటిని కొనడానికి వెనకాడటం లేదు. పట్టణాల్లోనే కాదు... పల్లెల్లోనూ ఈ మార్పును మనం చూడవచ్చు.

ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, బెనారస్ హిందూ యూనివర్శిటీ, జీబీ పంత్ యూనివర్శిటీలలో దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. అందువల్ల రైతులను ఈ దిశగా చైతన్యపరిచి, వారిని ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లించగలిగితే మీరు ఓ సప్లై చెయిన్ ఎక్స్‌పర్ట్‌గా మారిపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

రెన్యూవబుల్ ఎనర్జీ

సహజవనరులు రానురాను తగ్గిపోతున్నాయి. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు వంటి వనరులు కొద్దికాలానికి పూర్తిగా అయిపోతాయి. అందువల్ల ప్రపంచ దేశాలన్నీ పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారిస్తున్నాయి. 2030నాటికి 40శాతం ఇంధన అవసరాల్ని పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారానే తీసుకుంటామని ఐక్యరాజ్య సమితితో భారత్‌కు ఒప్పందం కూడా ఉంది. అంటే మనకున్న ఏకైక ఆధారం... సౌరశక్తి.

ఈరోజుల్లో కంపెనీ ఇల్లూ అనే తేడా లేకుండా సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అందుకే భవనాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తోంది. అందువల్ల ఈ రంగంలో ఉద్యోగావకాశాలు పెరగబోతున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ వనరులను ఏర్పాటు చేసుకోవడంపై జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఏజెన్సీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి.

దిల్లీలోని టెరి (ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్) దీనిపై అత్యుత్తమ కోర్సులను అందిస్తోంది. ఇక్కడి నుంచి అర్హత పొందితే ఉద్యోగం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఐఐటీ-బాంబే, ఐఐటీ-తిరుచ్చి, వీఐటీ యూనివర్శిటీ, ఎస్‌ఆర్ఎమ్ యూనివర్శిటీ వంటి ఎన్నో సంస్థల్లో రెన్యూవబుల్ ఎనర్జీపై పరిశోధనలు జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, careers360.com

అర్బన్ ప్లానింగ్

ఇప్పుడున్న పట్టణాలన్నీ చాలావరకు బ్రిటిష్ పాలనాకాలంలో నిర్మించినవే. అప్పట్లో జనాభా తక్కువ, భూమి ఎక్కువ కాబట్టి భవనాల నిర్మాణం పెద్ద సమస్య కాలేదు. కానీ 2050 నాటికి మరో 40 కోట్లమంది గ్రామాలనుంచి పట్టణాలకు వచ్చి స్థిరపడతారని ఓ అంచనా. కానీ ఈ అవసరాలకు, మౌలిక సౌకర్యాల కల్పనకు తగిన భూమి పట్టణాల్లో అందుబాటులో లేదు. అందువల్ల అర్బన్ ప్లానింగ్ నిపుణులకు విపరీతమైన డిమాండ్ పెరగబోతోంది. ఇప్పుడు దిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో మెట్రో నిర్మాణానికి ప్రధాన కారణం పట్టణీకరణ, దాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి సరైన ప్రణాళిక. అందువల్ల ఈ రంగం మరింత విస్తరించనుంది.

గుజరాత్‌లోని సీఈపీటీ యూనివర్శిటీ, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీ, ఎన్ఐటీ నాగ్‌పూర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ వంటి సంస్థలు దీనిపై కోర్సులను అందిస్తున్నాయి.

ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు ఆర్కిటెక్చర్, ప్లానింగ్ వంటి వాటిపై కొద్దిగా ఆసక్తి ఉంటే ఈ రంగంలో రాణించడానికి అవకాశాలు ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images

ఫుడ్ టెక్నాలజీ

ఒకప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ అనేది విదేశాలకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు భారత్‌లో కూడా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకునేవారు 30శాతం పైగానే ఉన్నారు. రైతు పంట పండించిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేయడం, సిద్ధం చేయడం, నిల్వ చేయడం, ప్యాక్ చేయడం, ఇలా రిటైలర్‌కు చేరే వరకూ వివిధ దశల్లో ఆహారాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. అంటే దీనిలో స్టోరేజ్ యూనిట్లు, రవాణా, మార్కెటింగ్, ఇలా ఎన్నో రంగాల భాగస్వామ్యం కావాలి.

ప్రభుత్వం కూడా ప్రాసెస్డ్ ఫుడ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోంది. లక్ష కోట్ల రూపాయలకు పైగా ఫుడ్ డెలివరీ వ్యాపారం జరుగుతోందనేది ఆశ్చర్యం కలిగించే విషయం. అందువల్ల ఫుడ్ టెక్నాలజీపై ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.

కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ ఆధర్వంలోని నిఫ్టెమ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంట్రప్రన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్), ఐసీటీ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ), ముంబయి, కాలేజ్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, పర్బానీ, మహారాష్ట్ర, సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, మైసూర్, ఐఐటీ-ఖరగ్‌పూర్ వంటి ఎన్నో సంస్థలు ఫుడ్ టెక్నాలజీపై కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐ చాలా మంచి సంస్థ.

వచ్చేవారం మరో అంశంపై చర్చిద్దాం.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)