అభిప్రాయం: ‘భీమా-కోరెగాం అల్లర్ల వెనుక అసలు కుట్ర ఏమిటి?’

  • 5 జనవరి 2018
భీమా-కోరెగావ్ ఘర్షణలు

19వ శతాబ్దం నాటి అవిభాజ్య భారతదేశంలో అక్కడక్కడా కొన్ని చిన్నచిన్న ప్రాంతాలను తమ ఆధీనంలో ఉంచుకున్న ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ వారిని మినహాయిస్తే, ఇద్దరే పాలకులు ఉండేవారు. ఒకరు - బ్రిటిషర్లు, రెండోవారు - మరాఠాలు.

మరాఠా సామ్రాజ్యం పశ్చిమాన గుజరాత్ నుంచి తూర్పున బెంగాల్, ఒరిస్సా వరకు; ఉత్తరాన పెషావర్, అటోక్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాయి) నుంచి దక్షిణాన తాంజోర్, మైసూర్‌ల వరకు విస్తరించి ఉండేది.

సైన్యం, పాలనపరమైన క్రమశిక్షణ, వనరుల విషయాల్లో బ్రిటిషర్లు చాలా శక్తిమంతమైన వారు. అయితే మరాఠాలు కూడా తక్కువ యోధులేమీ కాదు. వాళ్లు బ్రిటిష్ వారితో మూడు యుద్ధాలు చేశారు.

మొదటి ఆంగ్ల-మరాఠా యుద్ధం పేష్వాల కుటుంబంలో వారసత్వ పోరు కారణంగానే జరిగింది. 1775-82 మధ్య జరిగిన ఈ యుద్ధంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రఘునాథరావ్ పేష్వాకు మద్దతు ఇచ్చింది. సింహాసనం కోసం ఆయన నారాయణరావు పేష్వాను హత్య చేయించారు.

అయితే నారాయణరావు మరణాంతరం ఆయనకు కుమారుడు జన్మించడంతో రఘునాథరావుకు సింహాసనం దక్కలేదు. దీంతో ప్రస్తుతం ముంబైలో భాగంగా ఉన్న బాసెన్, సల్సెట్ ద్వీపాలకు ప్రతిఫలంగా తనకు సింహాసనాన్ని అప్పగించాలని ఆయన బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. 1779లో వడ్గావ్‌లో జరిగిన పోరులో బ్రిటిష్ సైన్యం ఓడిపోయింది. కానీ 1782లో ఇరువర్గాలు ఒక ఒప్పందానికి వచ్చేంతవరకు వారు వెనుకడుగు వేయడానికి ఒప్పుకోలేదు.

ఆ ఒప్పందం ప్రకారం పిల్లవాడైన మాధవరావుకు సింహాసనాన్ని అప్పగించి, సాల్సెట్ ద్వీపాన్ని అప్పగించిన రఘునాథరావుకు ఆర్థికపరమైన లాభం కలిగే ఏర్పాటు చేసారు.

Image copyright ALASTAIR GRANT/AFP/Getty Images
చిత్రం శీర్షిక పూణేలో పేష్వా సామ్రాజ్యపు పెయింటింగ్

రెండో బాజీరావు తన కూటమికి చెందిన వారి చేతిలో ఓడిపోయి, సింహాసనం కోసం బ్రిటిషర్లతో ఒప్పందం కుదుర్చుకోవడంతో రెండో ఆంగ్ల-మరాఠా యుద్ధం (1803-05) జరిగింది. ఈ యుద్ధం ద్వారా బ్రిటిష్ వారికి బాసెన్ ద్వీపం దక్కింది.

నిర్ణయాత్మకమైన మూడో ఆంగ్ల-మరాఠా యుద్ధం (1817-18)తో భారతదేశం చాలావరకు బ్రిటిష్ పాలన కిందకు వచ్చింది.

బాంబే గవర్నర్ జనరల్‌గా ఉన్న బారన్ చార్లెస్ మెట్‌కాఫే కూడా దీనిని స్పష్టంగా పేర్కొన్నారు. 1806లో రెండో ఆంగ్ల-మరాఠా యుద్ధానంతరం ఆయన, ''ప్రస్తుతం భారతదేశంలో రెండే ప్రధాన శక్తులు ఉన్నాయి- బ్రిటిషర్లు, మరాఠా. మేం ఒక్క అంగుళం వదిలిపెట్టినా దాన్ని వాళ్లు ఆక్రమించుకుంటారు'' అన్నారు.

ఇది చాలా వాస్తవం. ఛత్రపతి రాజులకు ప్రధాన మంత్రులైన పేష్వాలు - గ్వాలియర్‌లో సింధియాలు, ఇండోర్‌లో హోల్కర్లు, బరోడాలో గైక్వాడ్లు, నాగ్‌పూర్‌లో భోస్లేలు లాంటి మరాఠా సైన్యాధిపతుల ద్వారా భారతదేశంలోని చాలా భూభాగాన్ని పాలించేవారు. తర్వాత కాలంలో ఈ సైన్యాధిపతులంతా కలిసి పేష్వాలకు వ్యతిరేకంగా జతకట్టి వారి ఓటమికి కారణమయ్యారు.

Image copyright AFP

మహార్ రెజిమెంట్ ఎలా ఏర్పడింది?

పేష్వాలు చిత్పావన్ బ్రాహ్మణులు. మరాఠాలలో వారసత్వ పోరును తమకు అనుకూలంగా ఉపయోగించుకుని వారు ఛత్రపతి శివాజీ మహరాజు మనవడైన ఛత్రపతి సాహు మహారాజ్ తర్వాత తరం వారిని పక్కకు తోసేసారు.

మొదటి తరం ఇస్లామిక్ చొరబాటుదార్లకు వ్యతిరేకంగా స్వరాజ్యం అన్న నినాదంతో శివాజీ ఆ రోజుల్లో అంటరానివాళ్లుగా ఉన్న దళితులు సహా దేశంలోని నిచ్చెనమెట్ల కులవ్యవస్థలోని అన్ని వర్గాలనూ కలుపుకొని పోరాడారు.

అయితే పేష్వాలు మాత్రం తమ పాలనలో తిరిగి వర్ణవ్యవస్థను నెలకొల్పారు. అందువల్లే దళితుల్లో ఒకరైన మహార్లు, తమ పరిస్థితులను మార్చుకొని, మరింత మెరుగైన జీవితం కోసం బ్రిటిష్ వారి వైపు చేరారు. బ్రిటిష్ ఒక మహార్ రెజిమెంట్ (ఇది భారత సైన్యంలో ఇంకా కొనసాగుతోంది)ను నెలకొల్పింది.

తమ వీరోచిత పోరాటం ఫలితంగా భీమా-కోరెగావ్ యుద్ధంలో జనవరి 1, 1818న మహార్లు పేష్వాలను ఓడించారు. నాటి నుంచి మహార్లు ప్రతి ఏడాది ఆ రోజున విజయోత్సవం జరుపుకుంటున్నారు.

ఈ చరిత్ర మహారాష్ట్రలోని మూడు ప్రధాన కులాలు - మహార్లు, మరాఠాలు, బ్రాహ్మణుల మధ్య సామర్యానికి ఆటంకంగా మారింది. గతంలో ఊహాజనితంగా లేదా నిజంగా జరిగిన దారుణాల నేపథ్యంలో ఒకరికొకరు క్షమించుకోలేకపోతున్నారు.

చారిత్రకంగా మరాఠాలకు, బ్రాహ్మణులకు ఒకరంటే ఒకరికి గిట్టదు. శివాజీ వారసులను పక్కన పెట్టినందుకు మరాఠాలు ఎన్నడూ బ్రాహ్మణులను క్షమించలేకపోయారు. అదే విధంగా పేష్వాలను కూలదోసినందుకు వారి వారసులు మరాఠాలను ఎన్నడూ క్షమించలేరు.

అల్లర్ల వెనుక కుట్ర?

ఇటీవలి కాలంలో ఆత్మగౌరవ నినాదంతో ముందుకొస్తున్న దళితులకూ, తమను తాము పాలకవర్గంగా భావించే మరాఠాలకూ (చాలా మంది ముఖ్యమంత్రులు మరాఠాలే) మధ్య క్రమంగా ఘర్షణలు పెరుగుతున్నాయి. కానీ స్వాతంత్ర్యానంతరం మొదటిసారి మరాఠాలు మహారాష్ట్ర ప్రభుత్వంపై తమ పట్టును కోల్పోయారు.

ప్రస్తుత సీఎం, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ బ్రాహ్మణుడు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ మరాఠా. మహారాష్ట్రను తిరిగి పేష్వాయీ (బ్రాహ్మణ) పాలన కిందకు వెళతారా అని ప్రజలను ఆయన ఎగదోస్తున్నారు.

భీమా-కోరెగాంలో హింసను ప్రేరేపించారన్న కారణంతో బీజేపీ మాజీ కార్పొరేటర్ మిలింద్ ఎక్బోటే, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త శంభాజీ భిడేలను పుణె సమీపంలో అరెస్ట్ చేయడం, దీని వెనుక చాలా పెద్ద కుట్రే ఉందన్న అనుమానాలను రేకెత్తిస్తోంది.

భీమా-కోరెగావ్ అల్లర్లలో నిరాయుధులైన దళితులపై (మహిళలు, పిల్లలు సహా) జరిగిన దాడికి శివసేన లేదా మరాఠాలను (ఇద్దరూ కూడా కాషాయ జెండా కింద ఉన్నవారే) బాధ్యుల్ని చేసే ప్రయత్నం జరిగింది.

2015, జులైలో ఒక మరాఠా మైనర్ బాలికపై ముగ్గురు దళిత యువకులు అత్యాచారానికి ఒడిగట్టిన విషయంపై గత కొన్ని నెలలుగా మరాఠాలు, దళితుల మధ్య ఘర్షణపూర్వక వాతావరణం నెలకొంది.

అయితే దీని వల్ల ఎక్కడా హింస జరగలేదు, మత సామరస్యానికి భంగం వాటిల్లలేదు. కోర్టు ఆ కేసులో అత్యాచారానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధించింది. దీంతో మరాఠాలు కొంత శాంతించారు.

అయితే ఇటీవల జరిగిన అరెస్టులు - ఒక కులాన్ని మరో కులం పైకి రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను, భారత సమాజాన్ని మళ్లీ వెనుకటి రోజులకు తీసుకువెళ్లే ప్రయత్నాలను సూచిస్తున్నాయి.

ఇంతవరకు భీమా-కోరెగాం పోరాటాన్ని మహార్లు తప్ప మిగతా అందరూ మరచిపోయారు. కానీ కుట్రదారులు పాత గాయాలను కెలికి, భారత రాజకీయాలను మరింత భ్రష్టుపట్టించడానికి ప్రయత్నిస్తున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)