బద్వేల్‌‌లో వెయ్యి గుడిసెలు దగ్ధం; అక్కడసలు అన్ని గుడిసెలు ఎందుకున్నాయి?

  • 5 జనవరి 2018
శిథిలాల మధ్య వృద్ధులు Image copyright DL Narasimha

కడప జిల్లా బద్వేల్‌లో ఓ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం 5.30కు జరిగిన ఈ ఘటనలో దాదాపు 1000 గుడిసెలు కాలి బూడిదయ్యాయి.

బద్వేల్ శివారులోని అంబేడ్కర్ మార్కిస్ట్ కాలనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఇక్కడి ప్రభుత్వ భూముల్లో చాలా మంది పేదలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. బద్వేల్ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కువ మంది ఇక్కడకు వచ్చారు.

ఈ కాలనీలో మొత్తం దాదాపు 2,000 గుడిసెలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గత 2-3 ఏళ్ల నుంచి ఇక్కడికి వలసలు ప్రారంభమయ్యాయి.

ఇక్కడ గుడిసెల్లో ఉండే వారంతా ప్రధానంగా రోజుకూలీ పనులు చేసుకుంటూ బతుకు నెట్టుకొస్తున్నారు. ఎక్కువ మంది భవన నిర్మాణాల్లో కూలీలుగా పని చేస్తారు.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక దాదాపు 1000 గుడిసెలు కాలిపోయినట్లు అధికారులు తెలిపారు

వంట చేసే సమయంలో..

వంట చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు పడటంతో ఒక గుడిసె అంటుకుంది. ఇక్కడి నుంచి మంటలు దావానలంలా చుట్టుపక్కల గుడిసెలకు వ్యాపించాయి.

ఇక్కడ గుడిసెలు ఇరుకు ఇరుకుగా, ఒకదానికొకటి ఆనుకొని ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. చుట్టూ అంతా ఖాళీ ప్రదేశం కావటంతో గాలి వాటుకు మంటలు మరింత చెలరేగాయి.

గాలి బాగా వీస్తుండడంతో మంటల్ని ఆర్పడానికి వివిధ ప్రాంతాల నుంచి ఫైరింజన్లు తెప్పించాల్సి వచ్చిందని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఓబులేషు చెప్పారు.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక తక్షణ ఉపశమన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు

ఏ దిక్కూ లేదు

ఇందిరా ఆవాస్, అందరికీ పక్కా ఇళ్లు వంటి ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నప్పటికీ ఒక్క చోటనే ఇంత పెద్ద సంఖ్యలో గుడిసెలు ఉండటం పలు ప్రశ్నలకు తావిచ్చింది.

తమకు ఏ దిక్కూ లేకనే ఇక్కడ గుడిసెలు వేసుకొని బతుకుతున్నామని బాధితులు చెబుతున్నారు. తమకు ఎక్కడా స్థిర నివాసం లేదని, ఎన్నో ఊర్లు తిరుగుతూ వచ్చి చివరకు ఇక్కడ స్థిరపడ్డామని అంటున్నారు. ఏనాటికైనా ప్రభుత్వం తమను ఆదుకోక పోతుందా? తమకు పక్కా నివాసాలు కల్పించకపోతుందా అన్న ఆశతోనే జీవిస్తున్నట్లు వారు చెప్పారు.

ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా మా సమస్యలు తీర్చడం లేదని వెంకటమ్మ అనే బాధితురాలు అన్నారు. రెండు మూడు సార్లు పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ పట్టించుకోలేదని ఆమె తెలిపారు. అధికారులు చూసి పోతున్నారు తప్ప చర్యలేవీ తీసుకోవడం లేదని బచ్చల సుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక సర్వం బుగ్గిపాలు అయినట్లు బాధితులు చెబుతున్నారు

నీళ్లు కూడా లేవు

ఇక్కడ ఎంతో మంది ఇక్కడ నివసిస్తున్నా నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

గుడిసెలు కాలిపోవడంతో ఇప్పుడు కట్టుబట్టలతో మిగిలిపోయామని, ఎక్కడికి పోవాలో తెలియడం లేదని రసూల్‌బీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తగిన సహాయం చేసి తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక ప్రభుత్వ భూముల్లో దాదాపు 2,000 గుడిసెలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు

దాదాపు 12 ఎకరాలు

వీరంతా ప్రభుత్వానికి చెందిన దాదాపు 12 ఎకరాల్లో వీరు గుడిసెలు వేసుకున్నారు. ఈ భూమిలో కొంత భాగాన్ని నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల కోసం కేటాయించారు.

మరికొంత భాగంలో ఇళ్లులేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చారు. అయితే పట్టాలు తీసుకున్న వారు ఇక్కడ నివసించడం లేదు.

ఈ భూములను పేదలు ఆక్రమించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ భూమి విలువ మొత్తం దాదాపు రూ.2 కోట్లు ఉండొచ్చిని స్థానికులు అంచనా వేస్తున్నారు.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నట్లు తహశీల్దారు నరసింహులు చెబుతున్నారు

'ఆక్రమించుకున్నారు'

ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసుకున్నట్లు గోపవరం మండలం తహశీల్దారు నరసింహులు తెలిపారు. ఎన్నో సార్లు ఖాళీ చేయమన్నా చేయలేదని చెప్పారు.

"గుడిసెలు వేసుకున్న వారిలో చాలా మందికి వేరే చోట్ల ఇళ్లు ఉన్నాయి. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేస్తే ఏ రోజుకైనా పట్టా ఇస్తారని, వాటిని అమ్ముకోవచ్చని వారు భావిస్తున్నారు. ఇంతవరకు సరైన ఆధారాలతో ఎవరూ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోలేదు. అసలు సరైన గుర్తింపు కార్డులు చూపడం లేదు" అని ఆయన తెలిపారు.

ప్రస్తుతానికి పై అధికారులతో మాట్లాడి తక్షణ ఉపశమన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

అయితే తమ దగ్గర అన్ని రకాల గుర్తింపు కార్డులు ఉండేవని బాధితులు చెబుతున్నారు. ఇప్పుడవన్నీ గుడిసెలతోపాటు అవీ కాలిపోయాయని అంటున్నారు.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్‌వీ సుబ్బయ్య ఆరోపిస్తున్నారు

దరఖాస్తులు ఇచ్చాం

తమ దగ్గర అన్ని ఆధారాలున్నట్లు భూపోరాట కమిటీ ప్రతినిధి ఎస్‌వీ సుబ్బయ్య అంటున్నారు. దాదాపు 20 ఏళ్ల నుంచి బద్వేల్‌లోనే నివసిస్తున్నామని.. ఆధార్, రేషన్ కార్డులు అన్నీ ఉన్నట్లు తెలిపారు.

తాము అన్ని ఆధారాలతో దరఖాస్తులు చేసినప్పటికీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు వస్తున్నారు పోతున్నారు కానీ సమస్య అయితే తీరడం లేదని అన్నారు.

Image copyright DL Narasimha
చిత్రం శీర్షిక విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ చలపతి తెలిపారు

విచారణ జరుపుతున్నాం

గురువారం సాయంత్రం ఈ గుడిసెలకు మంటలు అంటుకున్నట్లు సబ్-ఇన్‌స్పెక్టర్ పి.చలపతి తెలిపారు.

"ఒక మహిళ వంట చేయడానికి పొయ్యి వెలిగించి నీళ్ల కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం దాదాపు 2,000 గుడిసెలుంటాయి. ఇందులో 800-1000 గుడిసెల వరకు కాలిపోయాయి. తహశీల్దారు ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నాం" అని వెల్లడించారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.