ప్రెస్ రివ్యూ: కాంగ్రెస్ నేతలు, గవర్నర్ మధ్య వాగ్వాదం

  • 6 జనవరి 2018
ఉత్తమ్ కుమార్ రెడ్డి Image copyright Inctelangana/facebook

తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియా, మంద కృష్ణ అరెస్టు అంశాలపై ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. కాంగ్రెస్‌ నేతలు ఒక్కొక్కరుగా రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు, గవర్నర్‌ మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది అని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

'గవర్నర్‌ స్పందించిన తీరుతో కాంగ్రెస్‌ నేతలు సహనాన్ని కోల్పోగా.. వారి మాటలకు గవర్నర్‌ కూడా సంయమనం కోల్పోయారని తెలిసింది. గంటపాటు వాడివేడిగా భేటీ జరిగినట్లు సమాచారం' అని ఆంధ్రజ్యోతి ఓ వార్తను ప్రచురించింది.

Image copyright ktr/facebook

'ఎవరు మాఫియా?'

పదేండ్ల మీ పాలనలో ఇసుక ద్వారా రాష్ట్రానికి రూ.39 కోట్ల ఆదాయం వస్తే.. మూడున్నరేండ్ల మా పాలనలో వెయ్యి కోట్లు వచ్చాయి. ఇసుక మాఫియా మీదా? మాదా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నాయకులను నిలదీశారు అని నమస్తే తెలంగాణ పేర్కొంది.

'కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పాలనలో ఇసుకను మాఫియాకు వదిలేశారని కేటీఆర్ చెప్పారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో ఇసుక మాఫియా వీఆర్‌ఏను హత్య చేసినట్టు వచ్చిన వార్తల్లో నిజంలేదన్నారు. ఉదయం పత్రికల్లో వార్తలు చూసిన తాను కామారెడ్డి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడానని, మృతుడు సాయిలు వీఆర్‌ఏ కాదని, అది ఇసుక ట్రాక్టర్ కాదని రిపోర్టు ఇచ్చారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

పనిలేక గవర్నర్‌ను కలువటానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులకు ఈ విషయాలు తెలుసా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మీడియా కూడా సంచలనాలకు తావులేకుండా ప్రజలకు వాస్తవాలు తెలిసేవిధంగా సమాచారం ఇవ్వాలని కోరారు’ అని నమస్తే తెలంగాణ వార్త ప్రచురించింది.

Image copyright TWITTER/PIB

'విభజన హామీల అమలుకు టాస్క్‌ఫోర్స్'

విభజన హామీల అమలు కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని తెదేపా ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. శాఖలవారీగా నిర్దుష్టమైన మార్గసూచి తయారుచేసి తక్షణం పెండింగ్‌ అంశాలన్నీ పరిష్కరించాలని కోరారు అని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది.

వాగ్దానాల అమలుపై ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని ఎంపీలు ప్రధానికి విన్నవించారు.

శుక్రవారం తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత, కేంద్ర మంత్రి సుజనాచౌదరి నేతృత్వంలో ఎంపీలంతా పార్లమెంటులో ప్రధానిని కలిసి రాష్ట్ర సమస్యలపై 16 పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు.

'విభజనను రాష్ట్రంపై బలవంతంగా రుద్దినందున పెండింగ్‌ అంశాల పరిష్కారాన్ని కేంద్ర హోంశాఖ బాధ్యతగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా పరిస్థితిని సమీక్షించాలని వారు ప్రధానిని కోరారు. ఇందుకు ఆయన స్పందిస్తూ 'ఏపీ నా రాష్ట్రం.. అన్నీ చేస్తాం' అని హామీనిచ్చినట్లు ఎంపీలు తెలిపారు' అని ఈనాడు పేర్కొంది.

Image copyright Getty Images

'ఐటీ ఉద్యోగులపై బౌన్సర్'

దేశవ్యాప్తంగా 39 లక్షల మంది పనిచేస్తున్న ఐటీ పరిశ్రమలో ఉద్వాసనకు గురవుతున్న ఉద్యోగుల పట్ల కంపెనీలు చూపిస్తున్న వైఖరి వివాదాస్పదమవుతోంది అని సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది.

'రకరకాల కారణాలతో ఉద్యోగులను తొలగించడం సహజమే అయినా... బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డుల ద్వారా ఆ పని చేస్తున్నారు. ఎదురు తిరిగిన ఉద్యోగుల మానసిక పరిస్థితి బాగోలేదని సర్టిఫికేట్‌ ఇవ్వడమే కాక... మరే ఇతర కంపెనీలోనూ కెరీర్‌ లేకుండా చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు.

అంతర్జాతీయ సంస్థ వెరిజాన్‌ డేటా సర్వీసెస్‌పై హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. బెదిరించి తమతో ఉద్యోగానికి రాజీనామా చేయించారని బాధితుల ఫిర్యాదు చేశారు.

చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడానికి సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు, మానసిక నిపుణులను వినియోగిస్తున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైంది' అని సాక్షి పేర్కొంది.

Image copyright devaneni uma/facebook

'కాఫర్ డ్యాంకు సరే'

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాంను యథాతథంగా నిర్మించుకునేందుకు ఆమోదం లభించింది. ప్రధాన డ్యాంతో జత చేయకుండా 2300 మీటర్ల పొడవునా నిర్మించుకోవచ్చని డ్యాం ఆకృతుల కమిటీ తేల్చి చెప్పింది అని ఈనాడు పేర్కొంది.

'కేంద్ర జలవిద్యుత్తు పరిశోధన కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) కమిటీ సమర్పించిన ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కాదని అందరితో చర్చించిన మీదట స్పష్టం చేసింది.

జెట్‌ గ్రౌటింగ్‌ పనులు ప్రారంభించుకునేందుకు అనుమతించింది. కాఫర్‌ డ్యాం ఆకృతులు సమర్పించి ఆమోదం పొందవచ్చని సూచించింది.

దీంతో రెండు నెలలుగా పెండింగులో ఉన్న ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అనుమతి లభించినట్లయింది.

దిగువ కాఫర్‌ డ్యాంలో జెట్‌గ్రౌటింగు పనులు ఇప్పటికే జరుగుతున్నాయి.

దిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం పాండ్యా నేతృత్వంలో పోలవరం డ్యాం ఆకృతుల కమిటీ భేటీ జరిగింది. ఏపీ జలవనరులశాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం పర్యవేక్షక అధికారి వేమన రమేష్‌బాబు తదితరులు హాజరయ్యారు' అని ఈనాడు ఓ వార్త ప్రచురించింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)