హైదరాబాద్ క్లాక్‌టవర్స్.. గడిచిన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు

  • 7 జనవరి 2018
టవర్ క్లాక్

చేతి గడియారాలు, గోడ గడియారాలు ఎక్కువగా లేని కాలం అది. సమయం ఎంతైందో తెలుసుకోవాలంటే నాలుగు రోడ్ల కూడలికి పోవాల్సిందే!

అక్కడ తల ఎత్తి చూస్తే ఎదురుగా ఎత్తుగా ఓ టవర్ క్లాక్ ఉంటుంది. అందులోని గడియారాన్ని చూసి టైం తెలుసుకునేవారు.

కానీ.. ఇప్పుడు ఆ టవర్ క్లాక్‌లన్నీ చరిత్రలో కలిసిపోతున్నాయి. చేతికి వాచ్‌లు, జేబులో సెల్ ఫోన్లు వచ్చాక ఎవ్వరికీ టవర్ క్లాక్‌ల అవసరం లేకుండా పోయింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionటవర్ క్లాక్‌లు.. చరిత్రకు సాక్షులు

హైదరాబాద్ సంస్కృతిలో ఈ చారిత్రక గడియారాలు ఓ భాగం. ఇప్పుడు ఆ చారిత్రక సాక్ష్యాలన్నీ నిరాదరణకు గురవుతున్నాయి.

కాలం మారింది.. టెక్నాలజీ పెరిగింది. కానీ, చరిత్రకు అద్దం పట్టే ఇలాంటి ఆనవాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందంటున్నారు రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ సభ్యులు వీరేష్ బాబు.

రామ వీరేశ్ బాబు ఓ ఫొటోగ్రాఫర్. హైదరాబాద్‌లోని టవర్ క్లాక్‌లపై తీసిన ఫొటో సిరీస్‌ 2000 సంవత్సరంలో ఈయనకు ‘రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్’ గౌరవాన్ని తెచ్చింది.

ఒక్క హైదరాబాద్‌లోనే 22 టవర్ క్లాక్‌లు ఉన్నాయి. చార్మినార్, సికింద్రాబాద్, మొజాంజాహి మార్కెట్ గడియారాలు బాగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో కొన్ని 18వ శతాబ్దానికి చెందినవి.

‘‘1850లో మొట్టమొదటి క్లాక్‌ టవర్‌ను ముర్గీచౌక్‌లో మొదటి సాలార్‌జంగ్ నిర్మించారు. సుల్తాన్ బజార్‌లోని టవర్ క్లాక్ స్వాతంత్రోద్యమ కార్యక్రమాలకు వేదికగా నిలిచింది.. ఇప్పుడు ఇవి మన నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా మిగిలాయి’’ అని పరవస్తు లోకేశ్వర్ అనే రచయిత, చరిత్రకారుడు తన పుస్తకంలో ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో లాగా టవర్ క్లాక్ అవసరం ప్రస్తుతం లేదు. కానీ వీటిని జ్ఞాపకాల్లా పదిలం చేసుకోవాలని, భవిష్యత్ తరాలకు ఈ జ్ఞాపకాలే చరిత్రను వివరిస్తాయని వీరేష్ బాబు అభిప్రాయపడుతున్నారు.

వీడియో షూట్-ఎడిట్: నవీన్ కుమార్

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)