ఒడిశా: ఏనుగులతో సెల్ఫీలు.. గాలిలో ప్రాణాలు!

  • 8 జనవరి 2018
ఒడిశాలో రోడ్డు దాటుతున్న అడవి ఏనుగు

సెల్ఫీ మోజు వల్ల జరుగుతున్న ప్రమాదాల గురించి మనం చదివాం. కానీ ఒడిశాలో అడవి ఏనుగులతో సెల్ఫీలు దిగుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇలా ఏనుగుల దాడిలో మరణిస్తున్నవారి సంఖ్య రానురానూ పెరుగుతోందని అటవీశాఖ అధికారులు బీబీసీతో అన్నారు.

డిసెంబర్‌లో జయకృష్ణా నాయక్ అనే వ్యక్తి.. మార్కెట్ నుంచి తన ఇంటికి వెళ్తున్నారు. దారిలో కొందరు గ్రామంలోకి వచ్చిన అడవి ఏనుగుతో సెల్ఫీలు తీసుకోవడాన్ని గమనించారు. తాను కూడా ఏనుగుతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు.

అప్పటికే గ్రామస్తుల గోలతో విసిగిపోయిన ఏనుగు, జయకృష్ణా నాయక్‌ను తొండంతో కొట్టి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో ఆయన మరణించారు.

''అప్పుడక్కడ చాలా మంది ఉన్నారు. కానీ ఏనుగు మా నాన్నను చంపేస్తుంటే ఎవ్వరూ కాపాడలేకపోయారు. భయంతో అందరూ పారిపోయారు'' అని జయకృష్ణా నాయక్ కుమారుడు దీపక్ నాయక్ బీబీసీతో అన్నారు.

ఇలాంటి సంఘటనే సెప్టెంబర్ నెలలో కూడా జరిగింది. అశోక్ భారతి అనే సెక్యూరిటీ గార్డు అడవి ఏనుగుతో సెల్ఫీ తీసుకోవడానికి ఏనుగుకు చాలా చాలా దగ్గరగా వెళ్లారు. దీంతో ఆ ఏనుగు అతనిపై దాడి చేసింది.

అక్కడున్న కొందరు ఈ ఘటనను వీడియో తీశారు. ఆ వీడియోలో.. సెల్ఫీ కోసం ప్రయత్నిస్తూ అశోక్ భారతి ఏనుగుకు దగ్గరగా వెళ్లడం గమనించవచ్చు.

ఏనుగు నుంచి తప్పించుకోవడానికి అశోక్ ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. పారిపోతున్న అశోక్‌ను ఏనుగు వెనక్కు లాగి కాళ్లతో తొక్కి చంపింది.

స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే అశోక్ చనిపోయారు. ఈ ఘటనలో చాలా మంది ప్రాణభయంతో పారిపోయారు కానీ.. తప్పించుకునే క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు.

ఇంజనీరింగ్ విద్యార్థి అభిషేక్ నాయక్ కూడా ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. నెత్తుటి మడుగులోవున్న అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

అభిషేక్ ప్రాణాలతో బయటపడ్డారు కానీ.. ఆరు నెలల తర్వాత కూడా తన మెడ, పొట్ట భాగాలకు వైద్యం చేయించుకుంటూనే ఉన్నారు.

''ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ కొన్నే వెలుగులోకి వస్తున్నాయి'' అని వన్యప్రాణి నిపుణులు విశ్వజిత్ మొహంతీ బీబీసీతో అన్నారు.

ఈ సంఘటనలను ఒడిశా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

అటవీ ప్రాంతాల్లో నివసించే గ్రామస్తులకు ఈ సంఘటనల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నామని ఒడిశా అటవీశాఖాధికారి సందీప్ త్రిపాఠి బీబీసీతో అన్నారు.

ఒడిశాలో అధికారిక లెక్కల ప్రకారం ఏనుగుల దాడిలో 60 మంది మరణించారు. కానీ వీరిలో సెల్ఫీల కోసం వెళ్లి ఎంత మంది మరణించారన్న విషయంలో స్పష్టత లేదు.

సెల్ఫీల మోజుతో వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

అడవుల్లో ఆహారం దొరక్కపోవడంతోనే ఏనుగులు జనావాసాల్లోకి వస్తున్నాయని మొహంతీ చెబుతున్నారు.

''డిసెంబర్, జనవరి మాసాల్లో ప్రజలు వరి పంటను సాగుచేస్తారు. ఆ పంటలను తినేందుకు అడవి ఏనుగులు ఊళ్లల్లోకి వస్తాయి'' అని మొహంతీ చెబుతున్నారు.

''ఏనుగులు ఊళ్లల్లోకి వచ్చిన వెంటనే ప్రజలు సెల్ఫీలు తీసేకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కెమెరాల్లో వచ్చే ఫ్లాష్ వెలుగుతో అవి భయపడతాయి. ఏనుగులు దాడి చేయడానికి ఇదే ప్రధాన కారణం'' అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి.ఎన్. మిశ్రా బీబీసీతో అన్నారు.

ఈ చావులను ఆపేందుకు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటుచేస్తున్నా, ప్రజలు మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన చెబుతున్నారు.

''అడవి ఏనుగులు ఊళ్లల్లోకి వచ్చినపుడు గ్రామస్తులు వాటికి చెరకుగడల్లాంటి వాటిని పెట్టి కాసేపటి తర్వాత సెల్ఫీల కోసం ప్రయత్నిస్తుంటారు. అక్కడే వచ్చింది చిక్కంతా'' అని మరొక అటవీశాఖ అధికారి రత్నాకర్ దాస్ బీబీసీతో అన్నారు.

కార్నీగీ మెలన్ యూనివర్సిటీ, దిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేసిన అధ్యయనం ప్రకారం.. సెల్ఫీ మరణాల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంది.

అడవి జంతువులతో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇతర దేశాల్లో కూడా జరిగాయి.

అమెరికాలోని ఓ పార్కులో తనతో సెల్ఫీలు తీసుకుంటున్న ఐదుగురిని ఓ అడవి దున్న కొమ్ములతో పొడిచి గాయపరిచింది. స్పెయిన్‌లో ఓ ఎద్దుతో సెల్ఫీ తీసుకుంటున్న వ్యక్తిపై అది దాడి చేసింది. దాడిలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

2016లో చైనాలోని జూలో నీటి జంతువుతో సెల్ఫీ తీసుకుంటూ ఓ వ్యక్తి నీటిలో మునిగిపోయారు. అతడిని కాపాడబోయిన ఓ జూ ఉద్యోగి కూడా చనిపోయారు.

యూట్యూబ్‌లో 25 డేంజరస్ సెల్ఫీస్ అన్న వీడియోకు కొన్ని కోట్ల వ్యూస్ వచ్చాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఅడవి ఏనుగు

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)