'ద ట్రిబ్యూన్ జర్నలిస్టుపై కేసు.. పత్రికా స్వేచ్ఛపై దాడి'

  • 8 జనవరి 2018
आधार Image copyright Getty Images

ఆధార్ డేటా లీకేజీపై కథనాన్ని రాసిన 'ద ట్రిబ్యూన్' జర్నలిస్టు రచనా ఖైరాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. యూఐడీఏఐ అధికారుల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 419, 420, 468, 471ల కింద ఆమెపై కేసు నమోదు చేసారు. వాటిలో పాటు ఆధార్ చట్టంలోని సెక్షన్ 36/37 కింద కూడా ఆమెపై కేసు నమోదైంది.

కేసు నమోదైన వెంటనే అనేకమంది జర్నలిస్టులు ఈ కథనం రాసిన రచనా ఖైరాకు బాసటగా నిలిచారు. రచనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను ఖండిస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆ ప్రకటనలో, యూఐడీఏఐ ఒక రకంగా మీడియాను బెదిరించడానికి ప్రయత్నిస్తోందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆరోపించింది

''ఇది పత్రికాస్వేచ్ఛపై దాడి. జర్నలిస్టుపై కేసు పెట్టడానికి బదులుగా, యూఐడీఏఐ ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలి'' అని ఆ ప్రకటన పేర్కొంది.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, రిపోర్టర్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ వెనక్కి తీసుకుని, నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు.

ఫౌండేషన్ ఫర్ మీడియా ఫ్రొఫెషనల్స్ అన్న మరో మీడియా సంస్థ కూడా ట్రిబ్యూన్ రిపోర్టర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని ఖండించింది. ఫౌండేషన్ డైరెక్టర్ మనోజ్ మిట్టా తన ఫేస్‌బుక్ పోస్టులో, ''ట్రిబ్యూన్ ప్రతినిధిపై కేసు పెట్టడం ఆందోళన కలిగించే విషయం. ఆధార్‌ విషయంలో ఒక ఏడాది వ్యవధిలో ఇలా భావప్రకటనా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నం జరగడం ఇది నాలుగోసారి'' అన్నారు.

ప్రభుత్వం తన విశ్వసనీయతను, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను పణంగా పెట్టి ఆధార్‌‌ను సమర్థిస్తోందని అన్నారు. న్యాయవ్యవస్థ దీనిపై తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

'ద ట్రిబ్యూన్ ' ఎడిటర్ కృతజ్ఞతలు

మీడియా సంస్థలు తమ ప్రతినిధి రచనా ఖైరాకు సంఘీభావం తెలియజేయడంపై 'ద ట్రిబ్యూన్ ' ఎడిటర్ హరీష్ ఖరే కృతజ్ఞతలు తెలిపారు.

‘'మా వార్తా సేకరణ చట్టబద్ధంగానే జరిగినట్లు మేం భావిస్తున్నాం. ఒక బాధ్యతాయుత మీడియా సంస్థగా మేం పత్రికా విలువలను పాటిస్తాం '' అని హరీష్ అన్నారు.

‘'ఈ వార్త సాధారణ ప్రజల మేలు కోసం ఉద్దేశించిన ఒక తీవ్రమైన సమస్యకు సంబంధించినది. నిజాయితీగా రాసిన ఈ వార్తను అధికారులు తప్పుగా తీసుకోవడం విచారకరం'' అన్నారు.

''పరిశోధనాత్మక జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు ఉన్న అన్ని రకాల చట్టబద్ధమైన మార్గాలను అన్వేషిస్తాం'' అన్నారు.

Image copyright ThE TRIBUNE
చిత్రం శీర్షిక ద ట్రిబ్యూన్

ఈ ఎఫ్‌ఐఆర్‌ను పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో దీనిపై యూఐడీఏఐ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ వస్తున్న వార్తలను అది ఖండించింది.

యూఐడీఏఐ ప్రెస్ నోట్‌లో, ''మేం పత్రికాస్వేచ్ఛను గౌరవిస్తాం. ట్రిబ్యూన్ జర్నలిస్టుపై దాఖలైన ఎఫ్‌ఐఆర్ మీడియా స్వేచ్ఛపై దాడి కాదు'' అని పేర్కొంది.

ఆధార్ డేటాబేస్‌ దుర్వినియోగం అవుతోందన్న వార్తలను ఖండించిన యూఐడీఏఐ.. ఆధార్ డేటాబేస్‌లోని బయోమెట్రిక్ డేటా పూర్తిగా సురక్షితమని పేర్కొంది.

''ప్రజలకు సాయపడేందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలకు, కొందరు వ్యక్తులకు డేటాబేస్‌కు యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఆరోపణలు వచ్చినా వాటిని పరిష్కరించేందుకు యూఐడీఏఐ ప్రయత్నిస్తుంది'' అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

''ఈ కేసులో ప్రజల హితార్థం ఇచ్చిన సదుపాయాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. అందువల్లే దీనిలో ప్రమేయం ఉన్న వ్యక్తిపై ఫిర్యాదు చేసాం’' అని తెలిపారు.

దిల్లీ పోలీసులు ఏమంటున్నారు?

ఈ సంఘటనపై జనవరి 5న తమ సైబర్ సెల్‌కు యూఐడీఏఐ ఫిర్యాదు చేసిందని దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదులో 'ద ట్రిబ్యూన్' ప్రతినిధి, యూఐడీఏఐ సమస్య పరిష్కార వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు, డేటాబేస్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను వెల్లడించిన వ్యక్తి కోసం వెదుకుతున్నట్లు తెలిపారు.

Image copyright ThE TRIBUNE
చిత్రం శీర్షిక జనవరి 4న 'ద ట్రిబ్యూన్‌'లో అచ్చయిన రచనా ఖైరా రిపోర్టు

ఆధార్ డేటాబేస్‌కు సంబంధించిన భద్రతపై ఎప్పటికప్పుడు వివాదం చెలరేగుతోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకార్ పటేల్, గతంలోనే ఆధార్ డేటాబేస్‌పై తన సందేహాలను వెల్లడిస్తూ ఒక వ్యాసం రాసారు.

ఆ వ్యాసంలో ఆయన, తాను ఇంతవరకు ఆధార్‌ను ఎందుకు తీసుకోలేదో వివరించారు. ఆధార్‌ను తప్పనిసరి చేసే నిబంధనను తొలగించాలని కోరారు.

'ద ట్రిబ్యూన్' ఈ నెల 4న ప్రచురించిన ఒక కథనంలో, ఒక ఏజెంట్‌కు 500 రూపాయలు చెల్లించి, యూఐడీఏఐ డేటాబేస్ నుంచి ఎవరి సమాచారాన్నైనా తెలుసుకోవచ్చనే సంచలన కథనాన్ని ప్రచురించింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)