#రక్షాబంధన్: 'విటుడి'గా మారి చెల్లిని వ్యభిచారకూపం నుంచి విముక్తి చేసిన సోదరుడు

  • 8 జనవరి 2018
రక్షా బంధన్ Image copyright Getty Images

బిహార్ రాష్ట్రంలో బెగూసరాయ్ జిల్లాలోని బఖరీ పట్టణంలో ఓ యువకుడు ఓ బ్రోకరుకు డబ్బులు చెల్లిస్తాడు. ఆ తర్వాత ఓ అమ్మాయితో కలిసి ఓ గదిలోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన కొద్ది క్షణాలకే వెనక్కి తిరిగి వచ్చేస్తాడు.

తర్వాత, కాసేపటికి అదే యువకుడు పోలీసులను వెంటపెట్టుకుని మళ్ళీ అక్కడికే వస్తాడు. కానీ, ఈసారి అతడు అక్కడకు వచ్చింది ఒక మహిళని వ్యభిచారం నుండి తప్పించడానికి. ఆ మహిళ మరెవరో కాదు, అతని సొంత చెల్లెలే!

ఎవరినైనా చలింపజేసే ఈ సంఘటన సినిమా కథగానో లేదా కల్పితంగానో అనిపించవచ్చు. కానీ, బుధవారం (27 డిసెంబర్ 2017) బఖరీలో నిజంగానే ఇది జరిగింది. పోలీసుల సహాయంతో ఇద్దరు మహిళలను వ్యభిచార గృహం నుంచి విముక్తి చేశారు.

ఆ ఇద్దరు మహిళలలో ఒకరు బిహార్‌లోని శివ్‌హర్ జిల్లాకి చెందినవారు కాగా, మరొకరు ఝార్ఖండ్‌కు చెందినవారు.

Image copyright Amit Parmar

తెలిసిన వ్యాపారిని చూశాక చిగురించిన ఆశ

"దాదాపు మూడేళ్ల క్రితం అశోక్ ఖలీఫా అనే వ్యక్తి నన్ను సీతామఢీ నుంచి బలవంతంగా బఖరీకి తీసుకొచ్చి నా చేత వ్యభిచారం చేయించడం మొదలెట్టాడు" అని శివ్‌హర్‌కి చెందిన ప్రతిమ (పేరు మార్చాం) బీబీసీతో చెప్పారు. తన పుట్టిల్లు చేరుకున్న తర్వాత ఆమె బీబీసీతో ఫోన్‌లో మాట్లాడారు.

బఖరీలో ఆమె తన కుమారుడితో పాటు ఉండేవారు. వాళ్ళిద్దరూ పూర్తిగా నిర్బంధంలోనే ఉండేవారు. "ఎక్కడికీ కదిలేందుకు అవకాశం కూడా ఉండేది కాదు" అని ఆమె చెప్పారు.

"ఒక రెండు వారాల క్రితం వీధుల్లో తిరుగుతూ సామాన్లు అమ్ముకునే ఒక వ్యాపారి ఇక్కడికి వచ్చాడు. అతన్ని చూశాక బాగా తెలిసిన వ్యక్తిలాగా అనిపించింది. అతను కూడా నన్ను గుర్తుపట్టినట్టు మాట్లాడాడు. నేను అతని ఫోన్ నంబర్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడం గురించి అతనితో మాట్లాడుతూ ఉండేదాన్ని" అని ఆమె చెప్పారు.

ఆ వ్యాపారి నిజానికి ప్రతిమ పుట్టింటి గ్రామానికి చెందిన వ్యక్తే.

Image copyright Amit Parmar

పుట్టింటికి చేరిన వార్త

ఆ వ్యాపారి శివ్‌హర్ వెళ్లి పూర్తి విషయాన్ని ప్రతిమ కుటుంబానికి చేరవేశారు. ఆ తర్వాత, ఆమెను ఈ చెర నుంచి విడిపించడానికి వాళ్ళంతా బేగూసరాయ్ వచ్చారు.

ఆ తర్వాత జరిగిన విషయాలను ప్రతిమ వాళ్ల అన్నయ్య మనోజ్ (పేరు మార్చాం) బీబీసీకి తెలిపారు.

"నేను వస్తున్నాననే విషయాన్ని వ్యాపారి ముందుగానే మా చెల్లికి తెలియజేశాడు. నేను విటుడి లాగ మారి అశోక్ ఖలీఫా దగ్గరకు వెళ్లాను. రెండు వందల రూపాయలు ఇచ్చిన తరువాత అతను నాకు ఇద్దరు అమ్మాయిలను చూపించాడు" అని మనోజ్ చెప్పారు.

"నేను సైగలతో మా చెల్లిని ఎంచుకున్నాను. ఆ తరువాత నేను, మా చెల్లితో పాటు గదిలోకి వెళ్ళి ఐదు నిమిషాలు మాట్లాడాను. ఠాణాకు వెళ్లి వెంటనే పోలీసులను తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడినుండి బయటికొచ్చాను" అని మనోజ్ తెలిపారు.

తరువాత ప్రతిమ తండ్రి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ ఆధారంగా బుధవారం నాడు బఖరీ ఠాణా పోలీసులు, అక్కడ దాడి చేసి ప్రతిమనూ, మరో మహిళనూ వ్యభిచార కూపం నుంచి బయటకు తీసుకొచ్చారు.

Image copyright Amit Parmar

ఎట్టకేలకు ఇల్లు చేరిన బాధితులు

"ప్రతిమను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చిన తరువాత గురువారం నాడు వైద్య పరీక్షలు చేయించి, శుక్రవారంనాడు తన వాంగ్మూలాన్ని తీసుకున్నాం. అదే రోజు ఆ అమ్మాయిని వారి తల్లిదండ్రులకు అప్పగించాం" అని బఖరీ పోలీస్ స్టేషన్ అధికారి శరత్ కుమార్ బీబీసీకి తెలిపారు.

ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న ఇద్దరు నిందితులలో ఒకరైన నసీమా ఖాతూన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో వ్యక్తి అయిన అశోక్ ఖలీఫా పరారీలో ఉన్నారు.

శుక్రవారం అర్థరాత్రి ప్రతిమ బేగూసరాయ్ నుంచి తన పుట్టిల్లయిన శివ్‌హర్ చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)