ప్రెస్‌రివ్యూ: ‘కేంద్రం- రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు’

  • 9 జనవరి 2018
తెలంగాణ సీఎం కేసీఆర్ Image copyright facebook/telangana cmo
చిత్రం శీర్షిక తెలంగాణ సీఎం కేసీఆర్

కేంద్రంలోని మోదీ సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తోందన్న సమాచారంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

నవంబర్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ పార్టీ ముఖ్యులను కేసీఆర్ ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిసిందని సాక్షి కథనాన్ని ప్రచురించింది.

''ఈ ఏడాది నవంబర్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే అనివార్యంగా మనమూ వెళ్లక తప్పదు. బడ్జెట్‌ సమావేశాల తర్వాత పూర్తిగా నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టండి.

ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొందాం. వివిధ సర్వేల్లో మనకు అంతా అనుకూలంగానే ఫలితం వస్తోంది' అని సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలకు చెబుతున్నట్లు టీఆర్‌ఎస్‌లోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని ఆ పత్రికల పేర్కొంది.

Image copyright facebook/chandrababunaidu
చిత్రం శీర్షిక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

చంద్రబాబుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది: బిల్‌గేట్స్

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు అని ఈనాడు తెలిపింది.

'వ్యవసాయంలో రాష్ట్రాన్ని ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నారని చంద్రబాబుకు రాసిన లేఖలో బిల్‌గేట్స్‌ ప్రస్తావించారు. అగ్రిటెక్‌ సదస్సు ముఖ్యమంత్రి దూరదృష్టికి అద్దం పడుతోందన్నారు.

అధికశాతం ప్రజలకు బీమా సౌకర్యం కల్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ భారత్‌లోనే ముందంజలో ఉన్న విషయాన్ని తెలుసుకున్నానన్నారు.

Image copyright Getty Images

'కరెంట్ చార్జీలు తగ్గవేం'

విద్యుత్తు చార్జీలు పెంచమని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖర్‌ రావు పలుసార్లు ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ధరలు ఎంతగా దిగివచ్చినా... జనంపై మాత్రం భారం తగ్గదు! విద్యుత్‌ చార్జీల విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది అని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.

'గతంలో కొనుగోలు ధరకంటే తక్కువకే సామాన్య వినియోగదారులకు కరెంటును సరఫరా చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో యూనిట్‌ కరెంటు కొనుగోలుకు విద్యుత్‌ సంస్థలు సగటున 4 రూపాయలు వెచ్చిస్తున్నాయి. అదే విద్యుత్‌ వినియోగదారులకు రూ.6 నుంచి 6.50 వరకు విక్రయిస్తున్నాయి.

ప్రస్తుతం ఉత్తరాదిలో విద్యుత్‌కు డిమాండ్‌ పడిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో డిమాండ్‌ యథాతథంగా ఉంది. గ్రిడ్‌ కనెక్టివిటీ పెరగడంతో పరస్పర వినిమయమూ సులువుగా మారింది. 'కరెంటు కష్టాలు' అనే మాటకు ఇప్పుడు తావే లేదు. కొనుగోలు ధరలు గణనీయంగా పడిపోయాయి. అయినప్పటికీ. చార్జీలు మాత్రం తగ్గడంలేదు' అని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

Image copyright Telanganacmo/facebook

లక్షా 80 వేల కోట్ల బడ్జెట్!

బడ్జెట్ ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. సోమవారం సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ బడ్జెట్‌పై సమావేశం నిర్వహించారు అని నమస్తే తెలంగాణ పేర్కొంది.

పెరిగిన రాష్ట్ర వృద్ధిరేటును పరిశీలించిన అధికారులు 2018-19 వార్షిక బడ్జెట్ దాదాపుగా రూ.1.80 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. బడ్జెట్ ప్రతిపాదనలు మొదట ఈనెల 9వ తేదీవరకు ఆన్‌లైన్‌లో పంపించాలని ఆర్థికశాఖ అన్నిశాఖలను ఆదేశించింది' అని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)