కర్ణాటకలో విజయానికి అమిత్ షా వ్యూహం ఏంటి?

  • 10 జనవరి 2018
అమిత్ షా Image copyright Getty Images

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన ఎనిమిది రోజుల పర్యటన కోసం కర్ణాటక చేరుకున్నారు. కర్ణాటకలో మూడు నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందువల్ల పార్టీ ఎన్నికల ఏర్పాట్లపై షా దృష్టి నిలిపారు.

షా గతంలోనే బెంగళూరు చేరుకోవాల్సి ఉన్నా, ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానాల ఆలస్యంతో డిసెంబర్ 31న జరగాల్సిన సమావేశం వాయిదా పడింది.

కర్ణాటకలో సిద్ధరామయ్యను ఓడించి కాంగ్రెస్‌ను అధికారం నుంచి తొలగించాలనేది ఆయన వ్యూహం. స్థానిక నేతలు కేంద్ర నాయకత్వం మాటలను వినాల్సిన సమయం వచ్చిందని షా ఇప్పుడు వారికి స్పష్టం చేసారు.

జైన్ యూనివర్సిటీ ప్రొ వైస్ ఛాన్సెలర్ సందీప్ శాస్త్రి.. ''చాలా మంది దీన్ని 'అమిత్ షా స్కూల్ ఆఫ్ ఎలెక్షన్ మేనేజ్‌మెంట్' అని పిలుస్తారు. దీనిలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. కేవలం ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టడమే కాకుండా, చివరి క్షణం వరకు ప్రచారం జరిగేలా చూస్తారు'' అని వివరించారు.

Image copyright Getty Images

స్థానిక నాయకత్వం

''రాష్ట్రంలో స్థానిక నాయకత్వాన్ని చూసి ప్రజలకు పార్టీపై విశ్వాసం కలగడం లేదని షా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో అధికారం సాధించాలంటే, దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించాలని అమిత్ షా గుర్తించారు'' అని సందీప్ శాస్త్రి తెలిపారు.

అమిత్ షా బెంగళూరుకు వచ్చినపుడల్లా రాష్ట్ర నాయకత్వంలో ఒక రకమైన ఆందోళన, వ్యాకులత కనిపిస్తుంది. వారంతా ఒక ముఖ్యమైన పరీక్షకు సిద్ధమౌతున్న వారిలా కనిపిస్తారు. గత పర్యటనలో అమిత్ షా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిపై ఒక ఛార్జ్ షీట్ తయారు చేయాలని వారిని ఆదేశించారు.

అంతే కాకుండా ప్రతి బూత్‌కు ఒక 'పన్నా ప్రముఖ్'ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కర్ణాటక బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వమన్ ఆచార్య మాట్లాడుతూ.. ''గత ఆగస్టులో అమిత్ షా ఇక్కడికి వచ్చినపుడు, ప్రజలు ఆయన ఎలాంటి మ్యాజిక్‌నైనా చేయగలరని విశ్వసించారు. కానీ ఆయన మాత్రం 'కేవలం మరింత శ్రమించడం ద్వారా మాత్రమే మనం ప్రజల చెంతకు వెళ్లగలం' అన్నారు'' అని తెలిపారు.

''పోయినసారీ ఆయన మా ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన పర్యటన అంటే మేం భయపడుతున్నామన్న విషయం నిజం కాదు'' అని ఆచార్య అన్నారు.

Image copyright Getty Images

లింగాయత్ వర్గం

ధార్వాడ్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ హరీష్ రామస్వామి మాట్లాడుతూ.. సిద్ధరామయ్యను ఎలా ఎదుర్కొనాలో తమ కార్యకర్తలకు చెప్పేందుకే అమిత్ షా బెంగళూరుకు వస్తున్నారని అభిప్రాయపడ్డారు. సిద్ధరాయమ్యకు రాజకీయ భాష బాగా తెలుసు. అందువల్ల బీజేపీ రక్షణాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది అని రామస్వామి అన్నారు.

కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి పథకాలు, పేదల కోసం చేపట్టిన విధానాలను ఎలా ఎదుర్కొనాలో బీజేపీకి అర్థం కావడం లేదు. మంత్రి డీకే శివకుమార్‌లాంటి వారిపై జరిగిన ఆదాయ పన్ను దాడులను కానీ, లింగాయత్‌ల ఓటు బ్యాంకు నుంచి కానీ బీజేపీ లాభపడలేకపోయింది. ఆ పార్టీ వద్ద ఇతర బలమైన ప్లాన్‌లు కూడా లేవని ఆయన తెలిపారు.

Image copyright Getty Images

కర్ణాటకలో యోగి

బీజేపీ నాయకత్వం కర్ణాటక కోసం చాలా కాలం నుంచి ద్విముఖ వ్యూహాన్ని రచిస్తోంది. ఒకవైపు బీఎస్ యడ్యూరప్ప 'పరివర్తన్ యాత్ర'లో కేవలం అభివృద్ధి గురించి మాట్లాడుతుండగా, మరోవైపు యోగి ఆదిత్యనాథ్, అనంతకుమార్ హెగ్డేలాంటి నేతలు హిందుత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

కర్ణాటక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బీఎల్ శంకర్ మాట్లాడుతూ.. ''హిందుత్వ అజెండా కేవలం కర్ణాటకలోని కొన్ని కోస్తా జిల్లాలలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ప్రజలు ఈ విభజన రాజకీయాలను ఇష్టపడరు'' అన్నారు.

కర్ణాటక ప్రజలు యోగి ఆదిత్యనాథ్‌ను 'హిందూ ఐకాన్'గా చూడరనేది ఆయన అభిప్రాయం. ''ఆయన గోహత్యల గురించి మాట్లాడితే ప్రజలు ఆయనను గోరఖ్‌పూర్‌లోని ఆసుపత్రులలో మరణించిన పిల్లల గురించి ప్రశ్నిస్తారు'' అని శంకర్ అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బెంగళూరు మెట్రో

బీజేపీ రికార్డు

''కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ సమాజంలోని అన్ని వర్గాలను తన వెంట తీసుకెళ్లలేదు. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ముఖ్యంగా కోస్తా ప్రాంతాలలో ఇప్పటివరకు సుమారు 28 హత్యలు జరిగాయి'' అని డాక్టర్ ఆచార్య అన్నారు.

కాంగ్రెస్ స్థానిక అజెండాలో చిక్కుకుపోయిందనేది ప్రొఫెసర్ శాస్త్రి అభిప్రాయం. ఆ పార్టీ అన్ని సమస్యలను సిద్ధరామయ్య వైపు నెడుతోంది.

అదే సమయంలో 2008-13 మధ్య కాలంలో తమ రికార్డు కూడా బాగా లేకపోవడంతో బీజేపీ స్థానిక సమస్యల గురించి భయపడుతోంది.

ఒకవైపు సిద్ధరామయ్య.. రాష్ట్రానికి ప్రత్యేక జెండా, బెంగళూరు మెట్రోలో హిందీలో అనౌన్స్‌మెంట్ లేకపోవడం లాంటి వివిధ చర్యలు చేపడుతుండగా, మరోవైపు బీజేపీ జాతీయవాదం లాంటి అంశాలను ముందుకు తెస్తోంది.

ఒక్కముక్కలో చెప్పాలంటే విజయం సాధించాలంటే అమిత్ షా కర్ణాటకలో జరిగే అతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది. విజయం కోసం ప్రతి కార్యకర్తతో మాట్లాడి, వాళ్లు ప్రజలతో కలిసిపోయేలా చూడాలి.

కర్ణాటక ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, 1985 నుంచి ప్రతి రెండోసారీ ప్రతిపక్ష పార్టీనే అధికారంలోకి వస్తోంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)