సుప్రీం కోర్టు : థియేటర్లలో జాతీయ గీతం తప్పనిసరి కాదు

 • 9 జనవరి 2018
భారత జాతీయ గీతం ఆలపిస్తున్న చిన్నారులు Image copyright AFP

సినిమా థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.

దీనిపై 2016 నవంబర్ 30న ఇచ్చిన ఆదేశాల్లో మార్పులు చేసిందని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

థియేటర్ల యజమానులు తమ ఇష్టం మేరకు ఈ గీతాన్ని ప్రసారం చేయొచ్చని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన సమయంలో నిలబడటం నుంచి వికలాంగులకు ఇచ్చిన మినహాయింపు అమలులో ఉంటుందని న్యాయస్థానం తెలిపింది.

1971 జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టంలో సవరణలు చేసేందుకు 12 మందితో మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది.

థియేటర్లలో జాతీయ గీతం ఆలపించాలా? వద్దా? అనే అంశంపై అన్ని కోణాలను పరిశీలించి ఆ మంత్రివర్గ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం వెల్లడించింది.

మంత్రివర్గ కమిటీ ఆరు నెలల్లో నివేదిక సమర్పిస్తుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు.

జాతీయ గీతం గురించి ఈ విషయాలు తెలుసా?

 • 1911 డిసెంబర్ 27న కోల్‌కతాలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా 'జన గణ మన' ఆలపించారు.
 • 1911 డిసెంబర్ 30న బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ V భారత్‌కు వచ్చారని, ఆయనకు గౌరవార్థంగానే జన గణ మన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారని అప్పట్లో కోల్‌కతాలోని కొన్ని పత్రికలు పేర్కొన్నాయి. అయితే.. ఆ వాదనను 1939లో రవీంద్రనాథ్ ఠాగూర్ కొట్టిపారేశారు.
 • మొదటిసారిగా జన గణ మన గీతాన్ని సంగీతబద్ధంగా జర్మనీలోని హాంబర్గ్‌ నగరంలో ఆలపించారు.
 • 1950 జనవరి 24న 'జన గణ మన'ను జాతీయ గీతంగా గుర్తిస్తున్నట్టు రాజ్యాంగ పరిషత్ ప్రకటించింది.
 • ప్రముఖ కవి జేమ్స్ క్యూజిన్స్ సతీమణి మార్గరెట్ బెంగాలీ నుంచి ఇంగ్లీషులోకి లయబద్ధ అనువాదం చేశారు. అప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్న బీసెంట్ థియోసోఫికల్ కాలేజీలో ప్రధానాచార్యులుగా పనిచేస్తున్నారు.
 • బెంగాలీ నుంచి హిందీలోకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనువాదం చేశారు.
 • మొదట్లో జాతీయ గీతం పేరు 'సుబాహ్ సుఖ్ చైన్'. జాతీయ గీతాన్ని తప్పనిసరిగా 52 సెకండ్లలోనే పూర్తిగా ఆలపించాలి.
 • దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 'వందేమాతరం' గేయానికి 'జన గణ మన'తో సమాన గౌరవం ఉంటుందని అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు.
Image copyright Thinkstock

ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు

 • 'జాతీయ గౌరవానికి భంగం కలిగించే చర్యల నివారణ' అన్న 1971 చట్టం ప్రకారం 'జాతీయ గీతాలాపనకు ఆటంకం కలిగించే ఏ చర్య అయినా, లేదా అలా పాడడానికి గుమికూడిన వారికి ఆటంకం కల్పించే చర్యలు' మూడేళ్ల జైలు శిక్ష మరియు/లేదా జరిమానాతో శిక్షార్హం.
 • 1960-70లలో సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని ప్రదర్శించేవారు. కానీ ఆ అలవాటు క్రమంగా అంతరించింది.
 • జాతీయ గీతాలాపనకు సంబంధించి భారత్‌లో ఎక్కడా ఒకే రకమైన చట్టం లేదు. ఈ విషయంలో 29 రాష్ట్రాలు తమ సొంత చట్టాలను రూపొందించుకున్నాయి.
 • గతంలో రాష్ట్రానికో చట్టంలా ఉన్న, పెద్దగా పట్టించుకోని ఈ చట్టాన్ని గట్టిగా అమలు చేయాలని గతేడాది అక్టోబరులో సుప్రీంకోర్టు ఆదేశించింది.
 • అన్ని సినిమా థియేటర్లలో, జాతీయ జెండా చిత్రంతో జాతీయగీతాన్ని ప్రదర్శించాలని.. అప్పుడు అందరూ లేచి నిలబడాలని సుప్రీంకోర్టు 2016 నవంబర్ 30న తీర్పునిచ్చింది.
 • గీతాలాపన సమయంలో ఎవరూ లోపలికి రాకుండా, బయటికి వెళ్లకుండా తలుపులు మూసేయాలని కూడా తీర్పులో పేర్కొన్నారు.
 • ఆ తర్వాత కోర్టు లేచి నిలబడలేని వికలాంగులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.

తాజాగా ఈ నిబంధనల్లో కొన్నింటిని సుప్రీం కోర్టు మార్చింది. చివరకు థియేటర్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

లద్దాఖ్‌లో ప్రధాని మోదీ.. భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య హఠాత్ పర్యటన

తెలుగు రాష్ట్రాలకు 'ఆత్మనిర్భర్ భారత్' కింద వచ్చింది ఎంత? పేదలకు ఇచ్చింది ఎంత?

కరోనావైరస్ - ఉత్తర కొరియా: 'వెలిగిపోయే విజయం మాది' అంటున్న కిమ్ జోంగ్ ఉన్

కరోనా వ్యాక్సీన్ ఎప్పుడు? భారత్ బయోటెక్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లాతో బీబీసీ ఇంటర్వ్యూ

భారత్-చైనా 5జీ స్పెక్ట్రమ్‌పై కన్నేసిన చైనా కంపెనీలను అడ్డుకోవడం ఎలా?

కాన్పూర్‌లో ఎన్‌కౌంటర్, డీఎస్పీ సహా 8 మంది పోలీసుల మృతి

వందల సంఖ్యలో ఏనుగులు అక్కడ ఎలా చనిపోతున్నాయి? ఏమిటీ మిస్టరీ?

బాలీవుడ్ డాన్స్ మాస్టర్ 'ఏక్ దో తీన్..' ఫేమ్ సరోజ్ ఖాన్ మృతి...