కోడిపందేలు: ఇక్కడ గెలిచిన కోడి రూ.50 లక్షలు పలుకుతుంది

 • వరికూటి రామకృష్ణ
 • బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్ కోడి పందేలు

ఫొటో సోర్స్, BEHROUZ MEHRI/getty images

సంక్రాంతి వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేల జోరు మొదలవుతుంది. కోడి పుంజుల పోరు కనిపిస్తుంది.

కోర్టులు ఎన్ని ఆంక్షలు విధించినా పందెం రాయుళ్లు ఏ మాత్రం తగ్గరు. జామ్‌జామ్ అంటూ పుంజులను పోటీలకు దించుతారు. ఆపైన పందేలు కాస్తారు.

ఈ కోడి పందేల జోరు, హోరు మన వరకే పరిమితం కాదండోయ్!

ఈ కోడి ప్రపంచాన్నే చుట్టేసింది. అనేక దేశాల్లో ఈ కోడి పందేలు జరుగుతాయి.

వేల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. అలాంటి కొన్ని దేశాలను చుట్టేసొద్దాం పదండి..

ఫొటో సోర్స్, Hulton Archive/getty images

బ్రిటన్: కింగ్ హెన్రీ (1154-1189) కాలంలో కోడి పందేలు ప్రారంభమయ్యాయి.

 • బ్రిటిషర్లకు వీటిని రోమన్లు పరిచయం చేశారు.
 • కొంతకాలం జాతీయ క్రీడగా కూడా ఉండేదంటే ఆ రోజుల్లో కోడి పందేలను ఎంతగా ప్రేమించే వారో అర్థం చేసుకోవచ్చు.
 • కోళ్ల ఎంపిక, పెంపకం, పోటీలకు సిద్ధం చేయడం వంటి వాటి కోసం ప్రత్యేక శిక్షణశాలలు ఉండేవంటే ఆశ్చర్య పోవాల్సిందే.
 • కొన్ని దశాబ్దాల కిందటే కోడి పందేలను ఇక్కడ నిషేధించారు. అయినా పందెం రాయుళ్లు వెనక్కి తగ్గరు కదా. ఇప్పటికీ అక్రమంగా పందేలు వేస్తూనే ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫిలిప్పీన్స్: ఇక్కడి పందేలను సాబాంగ్ అంటారు.

 • కోడి పందేలకు ప్రత్యేక స్టేడియాలు ఉంటాయి.
 • వీటిని చూడటానికి ప్రజలు టికెట్లు కొనాలి.
 • ఒక్కో పోటీ బహుమతి రూ.3 లక్షల వరకు ఉంటుంది.

ఫొటో సోర్స్, JAY DIRECTO/getty images

థాయిలాండ్: ఇక్కడ కోళ్ల పందేలు చాలా జోరుగా సాగుతాయి.

 • ఒక్కో పోటీలో ఆరు రౌండ్లు ఉంటాయి.
 • గెలిచిన కోడికి గిరాకీ చాలా ఎక్కువ.
 • విజయకేతనం ఎగరవేసిన ఒక్కో కోడి దాదాపు రూ.50 లక్షల వరకు ధర పలుకుతుంది.

ఫొటో సోర్స్, Al Bello/getty images

మలేసియా: చట్ట ప్రకారం నేరం అయినప్పటికీ అక్కడక్కడ పందేలు జరుగుతుంటాయి.

 • సెలంగర్ రాష్ట్రంలో పందేల జోరు ఎక్కువ.

ఫొటో సోర్స్, AFP/getty images

పాకిస్తాన్: కోడి పందేలు ఇక్కడ నిషేధం.

 • అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చాటుమాటుగా పందేలు వేస్తుంటారు.
 • మియన్వాలి అసీల్ కోడికి ఆదరణ ఎక్కువ.
 • శిక్షణ పొందిన కోడి రూ.25-45 వేల వరకు ధర పలుకుతుంది.
 • ఓఎల్‌ఎక్స్ వంటి వెబ్‌సైట్లలోనూ కోళ్లను అమ్మకానికి పెడతారు.

ఫొటో సోర్స్, SLT

అమెరికా: కొన్ని వందల సంవత్సరాల పాటు అమెరికాలో కోడి పందేలు జరిగాయి.

 • కాల క్రమంలో ఒక్కో రాష్ట్రం వీటిని నిషేధిస్తూ వచ్చింది.
 • అయినా అక్రమంగా అనేక రాష్ట్రాల్లో ఈ పందేలు జరుగుతుంటాయి.

ఫొటో సోర్స్, AFP

ప్యూర్టో రికో: అమెరికా నియంత్రణంలో ఉండే ఈ దీవిలో కోడి పందేలు చట్టబద్ధం.

 • ఏడాదికి దాదాపు రూ.600 కోట్ల వ్యాపారం జరుగుతుంది.
 • ఈ దీవిలో మొత్తం జనాభా దాదాపు 34 లక్షలు.
 • ఇందులో దాదాపు సగం మంది ఈ కోళ్ల పెంపకంపై ఆధారపడి జీవిస్తారు.

ఫొటో సోర్స్, ASIL CLUB

ఫొటో క్యాప్షన్,

పందెం కోళ్లకు వివిధ రకాల కత్తులు కడతారు

ఎన్నివివాదాలున్నా..

వినోదం పేరిట కోళ్లను హింసిస్తున్నారంటూ అనేక దేశాలు వీటిని నిషేధించాయి.

కొన్ని దేశాల్లో అధికారికంగానే జరుగుతున్నాయి. తెలుగు ప్రజల మాదిరిగానే కోడి పందేలను తమ సంస్కృతి, సంప్రదాయంగా అనేక దేశాల్లో భావిస్తున్నారు. వినోదంగా చూస్తున్నారు.

జంతు హింస, బెట్టింగులు వంటి వివాదాలు ఉన్నా.. ఈ కోడి పందేలకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)