Hebbars Kitchen సృష్టికర్త ఈవిడే- BBCSpecial ఇంటర్వ్యూ

  • శరత్ బెహరా
  • బీబీసీ ప్రతినిధి
ఫొటో క్యాప్షన్,

'నేను వ్యక్తిగత స్వేచ్ఛను ఇష్టపడతా. నాకు సంబంధించిన విషయాలను పర్సనల్‌గా ఉంచుకోవడానికే ప్రాధాన్యమిస్తా. అందుకే నా ఫొటోలను ఎక్కడా పంచుకోను'

హెబ్బార్స్ కిచెన్.. చాలా సులభంగా భారతీయ వంటల్ని, ముఖ్యంగా దక్షిణాది శాకాహార వంటల్ని నేర్పించే ఆన్‌లైన్, సోషల్ మీడియా వేదిక.

ఫేస్‌బుక్‌లో దాదాపు 64లక్షలమంది అభిమానులు.. ఇప్పటిదాకా 160కోట్లకు పైగా వీడియో వ్యూస్.. నిత్యం ఆ పేజీలో వేలాది లైకులు, షేర్లు, కామెంట్లు నమోదవుతాయి.. ఇంత హంగామా జరుగుతున్నా ఆ పేజీ వెనక ఉన్న వ్యక్తి ఎవరో చాలా మందికి తెలీదు.

రండి.. మేం పరిచయం చేస్తాం.

ఫేస్‌బుక్‌లో కాస్త యాక్టివ్‌గా ఉండే చాలామంది భోజన ప్రియులకు 'హెబ్బార్స్ కిచెన్' అనే పేరు సుపరిచితమే. ఆ పేజీకి దాదాపు 64 లక్షల మంది ఫాలోయిర్లు ఉన్నా, ఆ పేజీని నిర్వహిస్తున్నది ఎవరనే విషయం చాలామందికి తెలీదు.

వంట చేసే వీడియోల్లో.. ఎడమ చేతి బొటన వేలికి బంగారపు ఉంగరం పెట్టుకున్న ఓ మహిళ చేతులు మాత్రమే కనిపిస్తాయి. మొహం తెలీదు, మాట వినిపించదు.

ఆ మహిళ కూడా తాను ఎవరనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించరు. అయినా ఫేస్‌బుక్‌, ట్విటర్, యూట్యూబ్, పింట్రెస్ట్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఆమె వంటల పేజీలకు లక్షలాది అభిమానులున్నారు.

అంతమందికి చేరువైన ఆ మహిళను 'బీబీసీ న్యూస్ తెలుగు' ఇంటర్వ్యూ చేసింది.

ఆమె పేరు అర్చన. స్వస్థలం కర్ణాటకలోని ఉడుపి పట్టణం. ఉంటోంది ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో.

ఏంటీ హెబ్బార్స్ కిచెన్?

ఫేస్‌బుక్‌లో అత్యధిక ఫాలోయిర్లు ఉన్న భారతీయ వంటకాల పేజీలో హెబ్బార్స్ కిచెన్ ఒకటి. సోషల్ మీడియా గణాంకాలను విశ్లేషించే 'విడూలీ' అనే సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2017లో వంటకాల విభాగంలో అత్యధిక వీడియో వ్యూస్ దక్కించుకున్న భారతీయ ఫేస్‌బుక్ పేజీ ఇదే.

2017 ఆగస్టులో 8.2కోట్లు, సెప్టెంబరులో 12.3కోట్లు, అక్టోబరులో 9.5కోట్లు, నవంబర్‌లో 8.1కోట్లు.. ఇలా నెలకు సగటున 9 కోట్లకు పైగా వ్యూస్‌తో ఆ పేజీ ముందుకెళ్తోంది.

ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ అర్చన అనే సాధారణ గృహిణి ఓ సరదా వ్యాపకంగా ఈ పేజీని మొదలుపెట్టారు. కానీ దానికి ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఎన్నడూ ఊహించలేదంటారు ఆమె.

ఎవరీ అర్చన?

అర్చనా హెబ్బార్.. 'హెబ్బార్స్ కిచెన్' వ్యవస్థాపకురాలు. ఆ ఫేస్‌బుక్ పేజీలో పెట్టే వంటలన్నీ ఆవిడే స్వయంగా చేస్తారు. వీడియో తీయడం, ఎడిటింగ్, అప్‌లోడింగ్ లాంటి పనులన్నీ ఆమే చూసుకుంటారు.

అర్చన పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోని ఉడుపిలో. పెళ్లయ్యాక 2015లో భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. సాఫ్ట్‌వేర్ టెస్టర్‌గా అక్కడ కెరీర్ కొనసాగిద్దామని ప్రయత్నించినా అది కుదరలేదు.

'గతంలో నాకు ఆస్ట్రేలియాలో పనిచేసిన అనుభవం లేకపోవడంతో అక్కడ ఉద్యోగం దొరకడం కష్టమైంది. ఆ సమయంలో టైం పాస్ కోసం ఓ వంటల బ్లాగ్‌ను మొదలుపెట్టాను.

చిన్నప్పట్నుంచీ నాకు వంట చేయడమంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తితోనే కొన్ని వంటలు చేసి వాటి ఫొటోలు తీసి తయారీ విధానాన్ని బ్లాగ్‌లో పెట్టడం ప్రారంభించాను. కానీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

మరోపక్క ఫేస్‌బుక్‌లో 'బజ్‌ఫీడ్', 'టేస్టీ వీడియోస్' లాంటి కొన్ని పేజీల వీడియోలకు మంచి స్పందన రావడం గమనించాను. వాటిని చూశాక నా దారి మార్చుకోవాలని అనుకున్నా' అంటూ హెబ్బార్స్ కిచెన్ ప్రారంభానికి పునాది వేసిన నేపథ్యం గురించి అర్చన వివరిస్తారు.

ఎలా మొదలైంది?

హెబ్బార్స్ కిచెన్‌ను మొదలుపెట్టే నాటికి సరైన భారతీయ వంటకాలను తక్కువ నిడివిలో ఫేస్‌బుక్ ద్వారా అందించే పేజీలేవీ తన కంట పడలేదంటారు అర్చన. ఆ పని తానే చేయాలన్న లక్ష్యంతో 'హెబ్బార్స్ కిచెన్' పేజీని ప్రారంభించారు.

'మొదట్లో ఐఫోన్‌కు సెల్ఫీ స్టిక్‌ను అమర్చి దాని సాయంతోనే వంటల వీడియోలు తీసేదాన్ని. వాటిని నా ల్యాప్‌టాప్‌లోనే ఎడిట్ చేసి పోస్ట్ చేసేదాన్ని. ఆ వీడియోల క్వాలిటీ అంత బావుండేది కాదు. వాటికి స్పందన కూడా గొప్పగా లేకపోయినా గతంతో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉండేది.

నా ఆసక్తిని గమనించి ఓ డీఎస్‌ఎల్ఆర్ కెమెరా, ప్రొఫెషనల్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్, కంప్యూటర్‌ను నా భర్త సుదర్శన్ హెబ్బార్ కొనిచ్చారు. ఆ ప్రోత్సాహంతో మరింత కష్టపడాలని నిర్ణయించుకున్నా. వీడియో తీయడం, ఎడిటింగ్, అప్‌లోడ్ చేయడం లాంటి పనులన్నీ స్వయంగా చేసుకునేదాన్ని.

క్రమంగా సానుకూల కామెంట్లు రావడం మొదలయ్యాయి. వీక్షకుల సంఖ్యా పెరుగుతూ వచ్చింది. దాంతో ఎప్పటికప్పుడు కొత్త పదార్థాలు వండి అప్‌లోడ్ చేస్తూ వచ్చా' అంటూ తన పేజీ ప్రయాణాన్ని అర్చన గుర్తు చేసుకుంటారు.

ఎందుకంత ప్రత్యేకం?

హెబ్బార్స్ కిచెన్ వీడియోలన్నీ దాదాపు 2నిమిషాల్లోపు నిడివితోనే ఉంటాయి. వంట చేసే వ్యక్తి చేతులు మాత్రమే కనిపిస్తాయి తప్ప మాట వినిపించదు.

ఒక చిన్న స్టవ్, దానిపైన ఓ పాత్ర తప్ప మరెలాంటి హంగులూ అందులో ఉండవు. సులువుగా చేసుకోగలిగే శాకాహార వంటలను ఆంధ్రా, సౌత్ ఇండియన్, కర్ణాటక, కేరళ.. ఇలా విభాగాల వారీగా అందిస్తున్నట్లు అర్చన చెబుతారు.

అర్చన ఏరోజూ తాను ఎవరన్న విషయాన్ని తన సోషల్ మీడియా పేజీల్లో ప్రస్తావించలేదు. వెబ్‌సైట్‌లోని 'ఎబౌట్ అజ్' విభాగంలో కూడా ఆమె గురించి ఎలాంటి సమాచారమూ ఉండదు.

'నేను వ్యక్తిగత స్వేచ్ఛను ఇష్టపడతా. నాకు సంబంధించిన విషయాలను పర్సనల్‌గా ఉంచుకోవడానికే ప్రాధాన్యమిస్తా. అందుకే నా ఫొటోలను ఎక్కడా పంచుకోను. లో ప్రొఫైల్‌లో ఉండటమే నాకు సౌకర్యంగా ఉంటుంది' అంటారామె.

నైపుణ్యం ఎలా?

''the way to a man's heart is through his stomach' అనే ఇంగ్లిష్ సామెతను నేను నమ్ముతా. నా భర్త సుదర్శన్ మంచి భోజన ప్రియుడు. ఆయనకు నచ్చేలా వండాలనే తాపత్రయంతో పెళ్లయిన కొత్తలో బాగా కష్టపడేదాన్ని.

మా అమ్మ చాలా బాగా వంట చేస్తారు. ఆమె సలహాలతోనే నా వంటలను మెరుగుపరచుకుంటూ వెళ్లా. నా వంటలకు తొలి క్రిటిక్ నా భర్తే. ఆయన ఆమోద ముద్రపడ్డాకే వంటలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తా' అంటారు అర్చన.

ఫొటో క్యాప్షన్,

హెబ్బార్స్.. కాలా జామూన్

ప్రణాళిక ఏంటి?

'రోజుకి కనీసం ఒక వంటకాన్నైనా తయారు చేసి అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తా. రాబోయే వారం రోజులపాటు ఏ పదార్థాలు వండాలనే విషయాన్ని నేనూ నా భర్తా కలిసి చర్చించి నిర్ణయిస్తాం.

రసం, సాంబార్‌ లాంటి కొన్ని పదార్థాలు సింగిల్ టేక్‌లో పూర్తవుతాయి. కానీ స్వీట్లు, కేకుల లాంటి పదార్థాలను పర్‌ఫెక్షన్ కోసం 2-3సార్లు చేయాల్సి వస్తుంది.

హెబ్బార్స్ కిచెన్ పేజీని ప్రారంభించిన మొదట్లో భిన్నమైన పదార్థాలను వండటానికి సమయం ఉండేది. కానీ పేజీ ప్రాచుర్యం పొందే కొద్దీ రీడర్స్ తమకు కావల్సిన వంటల్ని చేయమని అడగడం ప్రారంభించారు. దాంతో వాళ్లను దృష్టిలో పెట్టుకొని అందరికీ తెలిసిన పదర్థాలనే సులువుగా చేయడం ఎలాగో నేర్పడం మొదలుపెట్టా.

ఒక్క మాటలో చెప్పాలంటే.. సులువైన, ఆరోగ్యకరమైన వెజిటేరియన్ వంటకాలను క్రమం తప్పకుండా అందించాలన్నదే నా ప్రణాళిక'.

ఫొటో క్యాప్షన్,

పనీర్ వంటకాలంటే అర్చనా హెబ్బార్‌కు ఇష్టం

భవిష్యత్తు ఆలోచన

'హెబ్బార్స్ కిచెన్‌ను కేవలం నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి మొదలుపెట్టా. కానీ సోషల్ మీడియాలో ఈ స్థాయి ఆదరణ దక్కుతుందని ఊహించలేదు. ఇతరులకు నేర్పిస్తూ, అందులో భాగంగా నేనూ నేర్చుకుంటూ ఈ పనిని ఆస్వాదిస్తున్నా' అంటారు అర్చన.

అర్చన వంటగది చాలా సింపుల్‌గా ఉంటుంది. దాన్ని చూసి చాలామంది గృహిణులు స్ఫూర్తి పొందుతున్నట్లూ, తాము కూడా అలా వంటలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లూ ఫేస్‌బుక్, యూట్యూబ్ కామెంట్లలో పేర్కొంటున్నారు. అలాంటి కామెంట్లే తనను ముందుకు నడిపిస్తున్నాయని అర్చన చెబుతారు.

'నేను చేసే ప్రతి వంటకానికీ లైకులు, షేర్లు, కామెంట్ల రూపంలో లక్షలాది మంది స్పందిస్తున్నారు. వాళ్ల నుంచి వచ్చే ఆ ఫీడ్‌బ్యాక్ కారణంగానే ఏ రోజుకారోజు నేను కొత్త వంటకాలు చేయగలుగుతున్నా' అన్నది అర్చన మాట.

మరికొన్ని సంగతులు ఆమె మాటల్లోనే..

హెబ్బార్స్ తొలి వంటకం: 2016 ఫిబ్రవరి 6న మెంతి రైతా చేసి ఫేస్‌బుక్ పేజీలో పెట్టా. వీడియోలు తీయడానికి లైటింగ్ చాలా ముఖ్యమని ఆ వీడియో తీశాకే అర్థమైంది.

ఎక్కువ మంది చూసింది: రసగుల్లా తయారీ వీడియోని ఫేస్‌బుక్‌లో 1.7కోట్ల మందికిపైగా చూశారు. రవ్వకేసరి, ఆలూ కుల్చా లాంటి పదార్థాల తయారీని దాదాపు కోటిన్నర మంది వీక్షించారు.

వండిన తరవాత..: కూరలు, టిఫిన్స్ లాంటి పదార్థాలనైతే మేమే తినేస్తాం. స్వీట్లూ, కేకుల లాంటి వాటిని ప్యాక్ చేసి నా భర్త ఆఫీసులో స్నేహితులకు పంపిస్తా.

ఇష్టమైన వంటలు: పనీర్‌తో చేసే ఏ పదార్థమైనా నాకు బాగా నచ్చుతుంది.

హెబ్బార్స్ టీం: మా టీం చాలా చిన్నది. నేను వంటలు చేసి, వీడియోలు తీసి, అప్‌లోడ్ చేస్తా. నా భర్త సుదర్శన్ వెబ్‌సైట్ బాధ్యతలు చూస్తారు. ఫేస్‌బుక్, కమ్యూనికేషన్ వ్యవహారాలు ముంబైలో ఉండే నా స్నేహితురాలు శ్రీప్రద చూసుకుంటారు.

హెబ్బార్స్ మైలురాళ్లు: గతేడాది ఏప్రిల్‌లో 'విడూలీ' సంస్థ విడుదల చేసిన జాబితాలో 'మోస్ట్ వ్యూడ్ ఇండియన్ ఛానల్స్ ఇన్ ఫేస్‌బుక్' జాబితాలో 'హెబ్బార్స్ కిచెన్' మూడో స్థానంలో నిలిచింది. ఫేస్‌బుక్‌లో 63.7లక్షల ఫాలోయిర్లు, యూట్యూబ్‌లో 4.75లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)