ఇక భారతీయులకు గ్రీన్ కార్డు కష్టమేనా?

  • 10 జనవరి 2018
అమెరికా జెండాలు Image copyright NumbersUSA

కొద్ది సంవత్సరాలుగా హెచ్-1బీ వీసా వివాదాల్లో ఉంటూ వస్తోంది.

హెచ్-1బీ వీసా గడువు పొడిగింపును ట్రంప్ ప్రభుత్వం నిషేధించనుందంటూ ఇటీవల వచ్చిన వార్తలు ప్రవాస భారతీయుల్లో ఆందోళన కలిగించాయి. అయితే ఇటువంటి ప్రతిపాదనలు ఏమీ లేవని తాజాగా అమెరికా ప్రకటించింది.

మరి గ్రీన్ కార్డుల కథేంటి..? అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి సంగతి ఏమిటి? అసలు గ్రీన్ కార్డు వస్తుందా.. రాదా? వంటి అంశాలపై బీబీసీ కోసం రజిత నిర్వహించిన ఫేస్‌బుక్ లైవ్‌లో హ్యూస్టన్‌కు చెందిన ఇమిగ్రేషన్ అటార్నీ రాహుల్ రెడ్డి తన అభిప్రాయాలు చెప్పారు. అవి ఆయన మాటల్లోనే..

Image copyright Facebook/DonaldTrump

కనిపించని గోడ

వలసదారుల పట్ల డోనాల్డ్ ట్రంప్ వ్యతిరేక వైఖరితో ఉన్నారు. ఇతర దేశాల నుంచి ఉద్యోగులు రాకుండా దాదాపు కంటికి కనిపించని ఒక గోడను ఆయన కట్టేశారు. నిబంధనలను కఠినతరం చేస్తున్నారు.

Image copyright NumbersUSA

చాలా ఇబ్బందులు

హెచ్-1బీ వీసా విషయంలో భారతీయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాది ఏడాదికి దరఖాస్తుల తిరస్కరణ పెరిగి పోతోంది. మొత్తం దరఖాస్తుల్లో గత ఏడాది ఒకటి రెండు తిరస్కరణకు గురయితే, ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిదికి పెరిగింది. గతంలో మూడు నెలల్లో వర్క్ వీసా లభించేది. ప్రస్తుతం ఇందుకు దాదాపు ఎనిమిది నెలలు పడుతోంది.

పొమ్మన లేక పొగ

హెచ్-1బీ వీసాల మీద ఇప్పటికే పని చేసే వారికి కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వీసాను పొడిగించుకోవాలంటే సవాలక్ష పత్రాలు అడుగుతున్నారు. గతంలో వీసా గడువును పొడిగించమని కోరుతూ 100 దరఖాస్తులు వస్తే, వీటిలో దాదాపు 30 దరఖాస్తులకు మాత్రమే అదనపు డాక్యుమెంట్లు కావాలని అధికారులు అడిగేవారు. ప్రస్తుతం 90 శాతం దరఖాస్తులకు అదనపు డాక్యుమెంట్లు కావాలని చెబుతున్నారు. దీంతో పేపర్ వర్క్ బాగా పెరిగిపోయి, కాలయాపన జరుగుతోంది. ఇది ఒకరకంగా పొమ్మన లేక పొగ పెట్టినట్లుగా ఉంది.

Image copyright NumbersUSA
చిత్రం శీర్షిక నెంబర్స్ యూఎస్ఏ వంటి సంస్థలు వలసదారులను వ్యతిరేకిస్తున్నాయి

లక్షకు పైగా తెలుగు వారు

హెచ్-1బీ మీద ఆరేళ్లు పూర్తి చేసుకుని గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న వారి జీవిత భాగస్వాముల (హెచ్-4 వీసా)కు కూడా వర్క్ పర్మిట్ ఇస్తూ గతంలో ఒబామా ప్రభుత్వం రెగ్యులేషన్ తీసుకొచ్చింది. అయితే దీన్ని ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చూస్తోంది. ఈ రెగ్యులేషన్‌ను పార్లమెంటు ఆమోదించలేదు. కనుక దీనికి చట్టబద్ధత లేదు. దీనిపై అధ్యక్షుడు ఏ నిర్ణయమైన తీసుకోవచ్చు.

ఒక వేళ ఇదే జరిగితే ప్రవాస భారతీయులకు, ప్రధానంగా తెలుగు వారికి ఎంతో ఇబ్బంది. అమెరికాలో హెచ్-4 వీసాలపై దాదాపు 2.50 లక్షల మంది ఉంటారు. వీరిలో దాదాపు 2.40 లక్షల మంది భారతీయులే. ఇందులో తెలుగు వారి వాటా సుమారు 1.40 లక్షలు.

108 ఏళ్లు

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్రీన్ కార్డు రావడం చాలా కష్టం. భారతీయులు ఈ ఏడాది గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే రావడానికి కనీసం 108 సంవత్సరాలు పడుతుంది. అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. 2012, ఆ తరువాత దరఖాస్తు చేసుకున్న వారికీ గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి.

Image copyright Facebook/USCIS
చిత్రం శీర్షిక అమెరికా పౌరసత్వం పొందిన వారు ఇలా ప్రమాణం చేయాలి

తప్పుడు సలహాలు

వలసదారుల గురించి ట్రంప్‌కు కొందరు తప్పుదారి పట్టించే సలహాలు ఇస్తున్నారు. నెంబర్స్ యూఎస్ఏ అనే సంస్థ ట్రంప్‌కు ఈ సమాచారాన్నిఅందిస్తోంది. దాదాపు 26 లక్షల మంది హెచ్-1బీ వీసాదారులు అమెరికాలో ఉన్నట్లు ఆ సంస్థ చెబుతోంది. ఇది వాస్తవం కాదు.

కోర్టుకు కంపెనీలు

హెచ్-1బీ వీసాలకు సంబంధించి న్యాయ పోరాటం చేసేందుకు కార్పొరేట్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. కలిసి కట్టుగా అందరూ దాదాపు 4 లక్షల డాలర్ల ఫండ్‌ను ఏర్పాటు చేశారు.

రాజకీయాల్లో చురుకుగా ఉండాలి

అమెరికా రాజకీయాలపై ప్రవాస భారతీయులు ఎక్కువగా ఆసక్తి చూపరు. తాము ఉంటున్న ప్రాంత ప్రజాప్రతినిధులకు సంబంధించి కనీస అవగాహన ఉండదు. నిక్కీ హేలీ, బాబీ జిందాల్, చివుకుల ఉపేంద్ర వంటి వారు ఉన్నా, వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందువల్ల పార్లమెంటులో బలంగా లాబీయింగ్ చేయలేకపోతున్నారు.

Image copyright Facebook/Rahul Reddy
చిత్రం శీర్షిక ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్ కార్డు రావడం చాలా కష్టమని ఇమిగ్రేషన్ అటార్నీ రాహుల్ రెడ్డి చెబుతున్నారు

భారత్‌కు వద్దు

తాజా పరిస్థితుల్లో అమెరికాలో స్థిరపడాలనుకునే ప్రవాస భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఉద్యోగాలు మారకూడదు. భారత్‌కు కూడా విపరీతంగా ప్రయాణాలు చేయకూడదు. విద్యార్థులు హెచ్-1బీ వీసా వచ్చేంత వరకు ఇక్కడే ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు