ప్రెస్‌రివ్యూ:'వెంకన్న ఏం దేవుడు?: కనిమొళి

  • 11 జనవరి 2018
కనిమోళి Image copyright Getty Images

తిరుమల వేంకటేశ్వరుడు కోటీశ్వరులకే దేవుడు. పేదవారు ఆయన్ను దర్శించుకోవాలంటే పడిగాపులు కాయాల్సిందే.

తన హుండీనే కాపాడుకోలేని ఆయన భక్తులనెలా కాపాడతాడు? తిరుమలేశుడికి శక్తులే ఉంటే ఆయనకు భద్రత ఎందుకు? అని డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.

'ఇటీవల తిరుచ్చిలో జరిగిన 'నాస్తిక సమాజం మహానాడు'లో కనిమొళి ఏడుకొండలవాడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలో ఉన్న అన్ని మతాలూ మానవులను విడగొడుతున్నాయని, నాస్తికవాదమే మానవ జాతి కలిసి ఉండేలా చేస్తుందని తెలిపారు.

మహిళలను బానిసలుగా మార్చేలా మతాలు ఉసిగొల్పుతున్నాయని, ప్రపంచ యుద్ధాల కంటే మతాల వల్ల చిందిన రక్తమే అధికమని కనిమొళి అన్నారు.

జాతి, మత ఘర్షణలు, వాదాలను నిర్మూలించాలంటే మానవతావాదాన్ని, నాస్తికవాదాన్ని వ్యాపింపజేయాలని ఆమె పిలుపునిచ్చారు.

వెంకన్నపై కనిమొళి చేసిన వ్యాఖ్యలపై హిందూమక్కల్‌ కట్చి మండిపడింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు' అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright Getty Images

భూగర్భజలం.. 17ఏళ్లలోనే ఘనం

ఒకటిన్నర దశాబ్దం కాలంలో రాయలసీమలో భూగర్భజలాలు ఇప్పుడున్నంత మెరుగ్గా ఎప్పుడూ లేవని విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం కోస్తాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాల కన్నా కూడా రాయలసీమ నాలుగు జిల్లాల్లో మెరుగైన పెరుగుదల కనిపిస్తోందని ఈనాడు తెలిపింది.

ఆయా సంవత్సరాల్లో వర్షపాతం, నీటి వినియోగం, బోర్ల సంఖ్య.. ఇలా అనేక అంశాలను సమ్మిళితం చేసి భూగర్భ జలశాఖ అధికారులు ఈ విశ్లేషణ చేశారు.

జలవనరులశాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు అందుబాటులో ఉన్న 17 సంవత్సరాల భూగర్భ జలమట్టాలను పరిగణలోకి తీసుకొని సమగ్ర పరిశీలన జరిపారు.

నైరుతిలో బాగా వర్షాలు పడటం, కోట్ల క్యూబిక్ మట్టి చెరువుల్లో పూడిక తీయడం. పంట కుంటల తవ్వకం.. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ వంటి అంశాలూ భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడ్డాయి.

ముఖ్యమంత్రి వద్ద ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ప్రస్తుత సీజన్‌లో భూగర్భ జలాలు పెరగడం వల్ల 200 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వాడకం తగ్గిందని సంబంధిత అధికారులు లెక్కలు చెప్పినట్లు సమాచారం అని ఈనాడు పేర్కొంది.

Image copyright Getty Images

'అంగట్లో అమ్మాయి'

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మానవ అక్రమ రవాణా ముఠాలు మళ్లీ పెట్రేగిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన 14 ఏళ్ల బాలికను కొందరు షాపింగ్‌ పేరుతో మాయమాటలు చెప్పి అపహరించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది అని ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ ఓ కథనాన్ని ప్రచురించింది.

'బాలికను అపహరించింది ఓ మహిళే! స్థానికంగా పూలమ్ముకొని జీవించే బాధితురాలి తల్లితో పరిచయం పెంచుకున్న ఆమె.. ఈ నెల 6న షాపింగ్‌ పేరుతో తీసుకెళ్లి బాలికను అపహరించింది. హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లో ఓ ఇంట్లో బాలికను బంధించింది.

అయితే, బాలిక.. తన దగ్గర ఉన్న సెల్‌ఫోన్‌ నుంచి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. తనతో పాటు మరో 13మంది బాలికలు అక్కడ ఉన్నట్టు బాధితురాలు చెప్పడంతో ఆసిఫాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు.

గత రెండేళ్లుగా ఈ ముఠాలు ఇక్కడ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు భావిస్తున్నారు.

బాలికల అక్రమ రవాణా కోసం వీరు స్థానిక మహిళల సాయాన్నే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కెరమెరి ప్రాంతానికి చెందిన ఓ గిరిజన యువతిని, మరో బాలికను రాజస్థాన్‌కు తరలిస్తుండగా పోలీసులకు పక్కా సమాచారం అందింది.

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ వద్ద ఓ హోటల్‌లో బాలికలను పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

గతంలో కెరమెరి ప్రాంతంలోనే పలువురు యువతులను యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ముఠాలు కొనుగోలు చేసి తీసుకెళ్లినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోనే ఈ తరహా ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు ఖంగుతిన్నారు అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

విషాన్ని శుద్ధి చేసే గుళికలు

Image copyright Getty Images

పండగపూట పాడు నూనె‘

సంక్రాంతి పండగ పూట మంచి నూనె వంటలు తినే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఘరానా నకిలీరాయుళ్లు రంగంలోకి దిగిపోయారు. చౌకగా మార్కెట్‌లో దొరికే పామాయిల్‌కు రంగులు, మిశ్రమాలు కలిపి.. దానినే సన్‌ఫ్లవర్‌, వేరుశనగ నూనెలుగా కలరింగు ఇస్తున్నారు అని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

'గుంటూరు జిల్లా నరసరావుపేటలో తొలిసారి నకిలీ నూనెల దందా బయటపడింది. ఈ వ్యవహారంలో అప్పట్లో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యాపారి ఇప్పుడు కాకినాడలోనూ చక్రం తిప్పుతున్నాడు. గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు నకిలీ సామ్రాజ్యాన్ని ఆయన విస్తరించాడని చెబుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో పామాయిల్‌ కిలో రూ. 65 ఉంది. సన్‌ఫ్లవర్‌ రూ.80, వేరుశనగ నూనె రూ. 120 పలుకుతున్నాయి. దీంతో కొందరు వ్యాపారులు పామాయిల్‌ లూజ్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఎస్సెన్స్‌ కలిపి వేరుశనగ వంటనూనెగా ప్యాకింగ్‌ చేస్తున్నారు. వైట్‌ వల్లీన్‌ (పామాయిల్‌ బాగా శుద్ధి చేస్తే వచ్చేది)కు ఎస్సెన్స్‌ కలిపి సన్‌ఫ్లవర్‌ నూనెలుగా చెలామణి చేస్తున్నారు.

మార్కెట్‌లో ఇప్పుడు దొరుకుతున్న వేరుశనగ నూనెల్లో 75 శాతం పామాయిల్‌ నుంచే తయారు చేస్తున్నట్టు వర్తకులే బాహాటంగా చెపుతున్నారు. సన్‌ఫ్లవర్‌ ప్యాకెట్‌ల్లో 50శాతం నకిలీవేనని ఒక అంచనా అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright Getty Images

దయలేని పుత్రులు..59.47శాతం

కని,పెంచి, విద్యాబుద్ధులు చెప్పించి తమ భవిష్యత్తును తీర్చిదిద్దిన తల్లిదండ్రులను... వృద్యాప్యంలో పట్టించుకోవట్లేదు నేటి తరం. దేశంలోని మెట్రో నగరాల్లో హెల్ప్ ఏజ్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది అని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.

'వారి సర్వేలో పాల్గొన్న వృద్దుల్లో 59.47 శాతం మంది... తమ కొడుకులు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సర్వే నివేదిక ప్రకారం...

దేశంలోని వృద్ధుల్లో 29 శాతం పట్టణాల్లో నివసిస్తుండగా... 71 శాతం మంది గ్రామాల్లో నివసిస్తున్నారు.

నగరాల్లో నివసించే వృద్ధుల్లో ఇతరులపై ఆధారపడి జీవించేవారు 51.1శాతం కాగా, చిన్నపాటి పట్టణాల్లో ఉండే వృద్ధుల్లో ఇలాంటి వారు కేవలం 12.4 శాతం మాత్రమే ఉన్నారు.

కోడళ్ల అనాదరణకు గురవుతున్నట్లు ఈ సర్వేలో చెప్పిన అత్తమామలు 61 శాతం మంది.

ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర జనాభాలో వృద్ధులు 10శాతం దాకా ఉన్నారు. నగరాల వారీగా చూస్తే.. బెంగళూరులో నివసించే వృద్ధుల్లో 70 శాతం మంది తమ పిల్లలు తమను సరిగ్గా చూడట్లేదని చెప్పారు అని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

ముఖ్యమైన కథనాలు

#BBCSpecial: బీదర్‌లో అసలేం జరిగిందంటే.. "గ‌డ్డి కోసే కొడ‌వ‌ళ్లు, క‌ర్ర‌లు, రాళ్లు పట్టుకుని దాదాపు 80 మంది వ‌చ్చారు"

బ్రిటన్: పార్లమెంటు సభ్యులకు ‘కొత్త ప్రవర్తనా నియమావళి’.. ఎంపీల సభ్యత్వం రద్దుకు ప్రతిపాదన

చైనా బాహుబలి: వారం రోజులు కూడా ఆడని భారీ బడ్జెట్ సినిమా ‘అసుర’

స్వామి అగ్నివేశ్‌పై దాడి: బీజేవైఎం కార్యకర్తలే కొట్టారని ఆరోపణ

ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?

సిరియా: శరణార్థుల్ని చేరుకోని సాయం.. సహాయక సంస్థల్ని దేశంలో అడుగుపెట్టనివ్వని ప్రభుత్వం

చేపలు తినొచ్చా.. తినకూడదా? ఈ రసాయనాల గొడవేంటి?

పాకిస్తాన్: సాధారణ ఎన్నికల బరిలో హిందువులు, దళితులు