క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ గురించి ఆయన భార్య విజేత ఏమన్నారు?

  • 11 జనవరి 2018
రాహుల్ ద్రవిడ్ Image copyright Getty Images

రాహుల్ ద్రవిడ్ 45వ జన్మదినోత్సవానికి రెండు రోజుల ముందు ఆయన పెద్ద కుమారుడు సమిత్ డేవిడ్ తండ్రికి ఒక అద్భుతమైన కానుకను ఇచ్చారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సమిత్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అండర్-14 టోర్నమెంట్‌లో 150 పరుగులు చేశాడు.

సమిత్ ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంది. ఎందుకంటే మరో రాహుల్ ద్రవిడ్ కావడం అంత సులభం కాదు. ద్రవిడ్ రిటైర్మెంట్ ప్రకటించి ఆరేళ్లు గడిచాయి. కానీ భారత టీమ్‌లో 'ద వాల్' అని పిలిచే ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసే వారు ఇంకా రావాల్సి ఉంది.

కేప్ టౌన్ టెస్ట్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని సాధించలేక కుప్పకూలిన భారత్‌ను చూస్తుంటే రాహుల్ ద్రవిడ్ మళ్లీ మళ్లీ గుర్తుకు వచ్చారు.

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ లాంటి దూకుడుగా ఆడే, స్టార్ ఆటగాళ్ల మధ్య ద్రవిడ్ పేరు అంతగా వినిపించి ఉండకపోవచ్చు. కానీ టీమిండియా ఎప్పుడూ నమ్మదగిన బ్యాట్స్‌మ్యాన్ మాత్రం ద్రవిడే.

'అతను ఎప్పుడూ టీమ్ కోసమే ఆడేవాడు. నిబద్ధత, నిలకడ, క్లాస్, నమ్మకానికి ద్రవిడ్ ప్రతిరూపం. అతనితో కలిసి ఆడినందుకు గర్వపడుతున్నాను' అన్న వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ దీనికి అద్దం పడుతుంది.

Image copyright Google

మ్యాచ్‌ను రక్షించేవాడు, మనవైపు తిప్పేవాడు

గణాంకాల పరంగా చూస్తే.. ద్రవిడ్ 164 టెస్ట్ మ్యాచ్‌లలో 13 వేలకు పైగా పరుగులు చేశారు. వాటిలో 36 సెంచరీలున్నాయి. 344 అంతర్జాతీయ వన్డేలలో సుమారు 11 వేల పరుగులు చేశారు. వాటిలో 12 సెంచరీలున్నాయి. టెస్టుల్లో 210 క్యాచ్‌లు, వన్డేలలో 196 క్యాచ్‌లు పట్టారు.

కానీ గణాంకాలు అన్నిసార్లు విషయాన్ని విడమరిచి చెప్పలేవు. సెంచరీ, మ్యాచ్ సేవింగ్ ఇన్నింగ్స్‌ను మనం గణాంకాలలో చూడలేం. ద్రవిడ్ మ్యాచ్‌ను రక్షించేవాడు మాత్రమే కాదు, మ్యాచ్‌ను మనవైపు తిప్పేవాడు కూడా.

జగ్గర్‌నాట్ పబ్లికేషన్స్ భారత జట్టు టెస్ట్ మ్యాచ్‌లపై 'ఫ్రం ముంబై టు డర్బన్' అనే పుస్తకాన్ని ప్రచురించింది. దానిలో భారత్ టీమ్ చేసిన అద్భుత ప్రదర్శనలున్నాయి. రచయితలు ఎస్.గురునాథ్, వీ.జే.రఘునాథ్‌లు ఈ పుస్తకంలో 28 టెస్టు మ్యాచ్‌ల గురించి వివరించారు. వాటిల్లో 2001లో కోల్‌కతాలో జరిగిన చారిత్రాత్మక టెస్ట్‌ను అత్యుత్తమమైనదిగా పేర్కొన్నారు.

ఈ మ్యాచ్‌లోనే వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగులు చేశారు. ద్రవిడ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 180 పరుగులు చేశారు. గిరిధర్, రఘునాథ్‌లు తమ పుస్తకంలో ద్రవిడ్ ఇన్నింగ్స్ ఎంత విలువైనదో వివరించారు.

Image copyright Getty Images

ఈ పుస్తకంలోని అత్యుత్తమ మ్యాచ్‌ల జాబితాలో 2003లో అడిలైడ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ కూడా ఉంది. ఈ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ద్రవిడ్ భారత్‌కు విజయం సాధించి పెట్టారు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే విదేశీ గడ్డపై భారత ఆటగాడు చేసిన అత్యుత్తమ ప్రదర్శనగా దీనిని పేర్కొంటారు.

2011లో, ద్రవిడ్ అంతర్జాతీయ కెరీర్ చివరి రోజుల్లో భారత బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్ టూర్‌లో పరుగుల కోసం తిప్పలు పడుతున్నపుడు, తను మాత్రం ఆ సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించారు.

ద్రవిడ్ 2003-2007 మధ్యకాలంలో భారత టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే కోచ్‌ గ్రెగ్ చాపెల్‌తో ఆ సమయంలో వివాదం కూడా నడిచింది. అదే సమయంలో టీమ్‌లో వర్గాలు ఏర్పడ్డాయి.

ద్రవిడ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా వివాదాస్పదమయ్యాయి. అయితే విజ్డెన్ ఇండియా ఎడిటర్ దిలీప్ ప్రేమచంద్రన్ మాటల్లో చెప్పాలంటే వ్యూహం విషయంలో ద్రవిడే బెస్ట్ కెప్టెన్.

Image copyright Getty Images

క్రికెటర్లు హీరోలు కాదు

ఇవే కాకుండా రాహుల్ ద్రవిడ్‌లో అనేక ప్రత్యేకతలున్నాయి. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో ద్రవిడ్ క్రికెట్ జీవితంపై ప్రచురించిన 'టైమ్‌లెస్ స్టీల్' పుస్తకంలో, ఆయన భార్య విజేత ఆయన గురించి ఇలా చెప్పుకొచ్చారు:

'పెళ్లికి ముందు ద్రవిడ్ ఒకటి రెండుసార్లు నాగ్‌పూర్‌లోని మా ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయనలో భారత టీమ్‌లో తాను ముఖ్యమైన ఆటగాణ్ని అనే భావనే ఉండేది కాదు. ఆయన తన గురించి ఏమీ చెప్పేవాడు కాదు. కేవలం నా చదువులు గురించి, ఇంటర్న్‌షిప్ గురించే మాట్లాడేవారు. ఆయన తన గురించి మాట్లాడేకంటే, ఇతరుల గురించే ఎక్కువ సీరియస్‌గా ఆలోచిస్తారు.'

మరోసారి, 2004లో ద్రవిడ్‌కు సౌరవ్ గంగూలీతో పాటు పద్మశ్రీ లభించింది. ఆ మరుసటి రోజే వారిద్దరి ఫొటోలను ఒక వార్తాపత్రిక మొదటి పేజీలో ప్రచురించింది. దాన్ని చూసి ద్రవిడ్, మొదటి పేజీలో ఇలాంటి ఫొటోలను ప్రచురించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

హీరో అనే పదాన్ని చాలా జాగ్రత్తగా వాడాలని, కేవలం సైనికులు, శాస్త్రవేత్తలు, వైద్యులకే ఆ పదం సరిపోతుందని ద్రవిడ్ భావిస్తారు. అయినా రాహుల్ ద్రవిడ్ 16 ఏళ్లపాటు భారత క్రికెట్ టీం హీరోగానే ఉన్నారు.

నిబద్ధతకు మారుపేరైన ద్రవిడ్ రిటైరైన తర్వాత కూడా భారత క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు అండర్-19, ఇండియా-ఏ టీమ్‌లకు కోచింగ్ బాధ్యతలను తీసుకున్నారు.

చాలా తక్కువ మాట్లాడతారని ఆయనకు పేరుంది. ఇప్పుడు కూడా ద్రవిడ్ క్రికెట్ కోచ్‌గా మీడియాకు ఎప్పుడూ దూరంగానే ఉంటారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు 'హలో, నేను మీ భార్యను. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడ్డం లేదు' అని గుర్తు చేస్తుంటానని విజేత తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు