కోడిపందేల చరిత్ర తెలిసి ఉండొచ్చు.. మరి కోడి చరిత్ర తెలుసా?

 • 10 జనవరి 2019
పందెం కోళ్లు Image copyright Facebook/Naidu Naidu's

సంక్రాంతి వస్తోందంటే కోస్తాంధ్రలో కోడి పుంజుకు చాలా ప్రత్యేకం. కోర్టులు, ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు విధించినా ఇక్కడ పందేలు మాత్రం ఆగవు. ఇక కనుమ వచ్చిందంటే చిల్లు గారెలోకి నాటు కోడి పులుసు ఉండాల్సిందే.

ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా నాన్‌వెజ్ ప్రియులు చాలామంది ముందుగా వెతికేది చికెన్ బిర్యానీ గురించే.

కోడి వేపుడు, చికెన్ పకోడి, చిల్లీ చికెన్, చికెన్ టిక్కా.. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ జాబితా కొండవీటి చేంతాడంత అవుతుంది. అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఈ కోడి అంత ఫేమసు మరి.

ఇంతగా సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న కోడి ఎక్కడ పుట్టిందబ్బా! అన్న ఆలోచన ఎప్పుడో ఒకసారి బుర్రకు తట్టే ఉంటుంది కదా? పదండి చూద్దాం..

Image copyright highviews/getty images

ఎక్కడ పుట్టింది?

కోడి ఎక్కడ పుట్టిందనేదానికి కచ్చితమైన ఆధారాలు లేవు. చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం కోడి మూలాలు ఆగ్నేయ ఆసియాలో ఉన్నాయి. అంటే నేడు మనం చూసే మియన్మార్, కాంబోడియా, థాయిలాండ్ వంటి దేశాలు అన్నమాట. అలాగే భారత ఉపఖండంలోనూ పుట్టిందనే వాదనలూ ఉన్నాయి.

వేల సంవత్సరాల కిందటే

 • దాదాపు 7,000-10,000 సంవత్సరాల కిందటే మనుషులకు కోళ్లు మచ్చికైనట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.
 • క్రీ.పూ.3,000-1300 మధ్య విలసిల్లిన సింధూ నాగరికతలోనూ కోళ్లు ఉన్నట్లు పురావస్తు ఆధారాలున్నాయి. మొహంజదారో నగరంలో కోడి బొమ్మగల ముద్రికలు, శాసనాలు లభించాయి.
 • క్రీ.పూ.5,400 సంవత్సరం ప్రాంతంలో ఈశాన్య చైనాలో కోడికి చెందినవిగా భావిస్తున్నశిలాజాలు లభించాయి.
Image copyright vvvita/gety images

తల్లి భారతేనా?

ప్రస్తుతం మనం చూస్తున్న అన్ని రకాల కోళ్లు రెడ్ జంగిల్ ఫౌల్ అనే జాతి నుంచి వచ్చాయని డార్విన్ సిద్ధాతం చెబుతోంది. ఈ కోడికి నల్లని తోక, పసుపు-నెమలి రంగు రెక్కలు, నారింజ-పసుపు వర్ణం మెడ ఉంటాయి.

అలాగే తెల్ల అడవి కోడిగా పిలిచే గ్రే జంగిల్ ఫౌల్ నుంచి కూడా కొన్ని రకాల కోళ్లు వచ్చినట్లు మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కోడి మూలాలు భారత్‌లో ఉన్నట్లు పరిశోధనకారులు భావిస్తున్నారు.

Image copyright AFP/getty images
చిత్రం శీర్షిక చికెన్ టిక్కా మసాలా

కోళ్ల పోటీలు

ఇది చాలా ప్రాచీనమైన క్రీడ. క్రీ.పూ.3,000 ఏళ్ల కిందటే కోళ్ల పోటీలు ఉన్నట్లు అంచనా. కోళ్ల పోటీలకు సంబంధించి తొలి రాతపూర్వక ఆధారాలు భారత్‌లోనే లభించాయి. దాదాపు క్రీ.పూ.1,500 ప్రాంతంలో కోళ్ల మధ్య పోటీలు నిర్వహించే వారని తెలుస్తోంది.

Image copyright Scott Nelson/getty images

పందేలు ఎలా ప్రారంభం?

 • సాధారణంగా సంస్కృతి, సంప్రదాయాలు, వినోదం, ఆటవిడుపు వంటి వాటి చుట్టూ కోళ్ల పోటీలు ముడిపడి ఉన్నాయి.
 • సింధూ నాగరికతలో కోళ్ల పోటీలు ఉండేవని తెలుస్తోంది.
 • ఈజిప్టులో ఇది వినోద క్రీడగా ఉండేది.
 • గ్రీసులో సైనికులను ఉత్తేజ పరిచేందుకు, వారిని యుద్ధానికి సన్నద్ధం చేసేందుకు కోళ్ల మధ్య పోటీలు నిర్వహించే వారు.
 • సిరియన్లు పోటీల్లో పాల్గొనే కోళ్లను దైవంతో సమానంగా చూసేవారు.
 • రోమన్లు, గ్రీకులు దేవాలయాల్లో కోళ్ల పోటీలు నిర్వహించే వారు. చనిపోయిన కోడిని దేవతలకు నైవేద్యంగా అర్పించేవారు.
 • కాల క్రమంలో గెలుపు ఓటములపై సరదాగా పందేలు వేయడం ప్రారంభమైంది.
Image copyright bhofack2/getty images

తెలుగు నేలపై..

తెలుగు నేలపై కోడి పందేలకు ఎంతో ఆదరణ ఉంది. ఇందుకోసమే కుక్కుట శాస్త్రం అనే పుస్తకం కూడా ఉండటం విశేషం. దీన్ని ఎవరు రాశారో? ఎప్పుడు రాశారో? తెలిపే కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ నేడు చాలా మంది కుక్కుట శాస్త్రం ప్రకారం సమయం, నక్షత్రం, వాస్తు, కోడి రంగు వంటి వాటికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు.

Image copyright jaranjen/getty images

షౌరుషానికి ప్రతీక

కాల క్రమంలో కోడి పందేలు పౌరుషానికి ప్రతీకగా మారాయి. 11వ శతాబ్దం నాటి పల్నాటి రాజుల కాలంలో కోడి పందేలు వినోదానికి మాత్రమే కాకుండా పౌరుషానికీ ప్రతీకగా ఉన్నట్లు తెలుస్తోంది. బాల నాగమ్మతో పందెంలో ఓడిపోయిన పల్నాటి బ్రహ్మనాయుడు అడవులకు వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. ఇక బొబ్బిలి, విజయనగర రాజుల మధ్య కూడా కోడి పందేలు పరువు-ప్రతిష్ఠల సమస్యగా ఉండేదంట.

నేడు ఇలా..

తెలుగు వారి సంస్కృతిలో నేటికీ కోడి పందేలు భాగంగా ఉంటూ వస్తున్నాయి. ఇప్పటికీ గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వీటికి మంచి ఆదరణ ఉంది. బెట్టింగులు జరుగుతున్నాయి. రూ.వందల కోట్లు చేతులు మారుతుంటాయి.

పందేల పేరుతో జీవహింసకు పాల్పడుతున్నారంటూ కోర్టులు వీటిని నిషేధిస్తున్నా పందెం రాయుళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

కోడి పందేలు సంప్రదాయంగా వస్తున్నాయని, ఇది సరదాగా ఆడే ఆటని అనే వారూ ఉన్నారు. ఎవరో కత్తులు కడితే మొత్తం కోడి పందేలను నిషేధించడం సబబు కాదని అభిప్రాయపడే వారూ ఉన్నారు.

Image copyright THEPALMER/getty images

ఈ బంధం వీడనిదీ

కోడి ఎక్కడిదైనా అది తెలుగు వారి సంస్కృతిలో భాగం. వారి ఆచారాలలోనూ, ఆహారంలోని ప్రధాన అంశం. కోడి కూర లేని ఆదివారాన్ని చికెన్ లేని బిర్యానీని చాలా మంది ఊహించలేరు. కాబట్టి కోడికి తెలుగోడికి గల బంధం విడదీయలేనది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)