ప్రెస్‌రివ్యూ: పండక్కి పైసలెట్టా? ఏటీఎంలలో డబ్బులు నిల్!

  • 12 జనవరి 2018

ఏపీలో తీవ్ర నగదు కొరత ఏర్పడిందని సాక్షి కథనం పేర్కొంది. రాష్ట్రంలో 70 శాతం ఏటీఎంలు పని చేయకపోవడంతో పండుగకు ముందు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పంటలు అమ్మిన రైతులు చేతికి డబ్బులు రాక అవస్థలు పడుతున్నారు. గత 20 రోజుల నుంచి రాష్ట్రంలో ఈ పరిస్థితి ప్రారంభమైంది.

దీంతో హైదరాబాద్ నుంచి వచ్చే బంధువులను అక్కడి నుంచే నగదు తీసుకురమ్మని, తాము మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తామని అనేక మంది ఫోన్ చేస్తున్నట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.

Image copyright Getty Images

వీఐపీలంతా టీటీడీకి సహకరించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు.

ప్రముఖులు మళ్లీమళ్లీ తిరుమలకు రాకుండా సహకరిస్తేనే సామాన్యులకు దర్శనం సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

గురువారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న వెంకయ్యనాయుడు, భక్తులందరికీ త్వరగా దర్శనం లభించాలనే తాను అరుదుగా తిరుమలకు వస్తుంటానని అన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పండుగ రద్దీ

సంక్రాంతికి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈనాడు కథనం పేర్కొంది.

సికింద్రాబాద్‌తో పాటు కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు కూడా ఊళ్లకు వెళ్లే వారితో కిటకిటలాడుతున్నాయి. రెగ్యులర్ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లు కూడా కిక్కిరిసి కనిపిస్తున్నాయి.

ఆర్టీసీ బస్సుల్లో కూడా రెగ్యులర్ సర్వీసులతో పాటు 50 శాతం అదనపు చార్జీలతో నడిపే సర్వీసుల్లో కూడా వెయిటింగ్ లిస్ట్ పరిమితి దాటింది.

దీంతో గత్యంతరం లేక జనం ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తుండడంతో వారు ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతున్నట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.

  • షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కష్టసాధ్యమని కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. దళితుల్లోని 1264 ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేయలేమని, అయితే వారి అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అన్నారు. దళితులపై జరుగుతున్న దాడులకు రిజర్వేషన్లూ ఒక కారణమన్నారు. హిందువులకు వ్యతిరేకంగా దళితులు, ముస్లింల కలయిక వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని ఆయన హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నట్లు మనతెలంగాణ కథనం పేర్కొంది.
  • 28 పార్టీలు, ప్రజాసంఘాలతో తెలంగాణలో బహుజన వామపక్ష కూటమి(బీఎల్‌ఎఫ్) అనే మరో కొత్త రాజకీయ వేదిక ఆవిర్భవించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 119 స్థానాల్లోనూ బీఎల్‌ఎఫ్ పోటీ చేయనుంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య, గద్దర్, కాకి మాధవరావు తదితరులు పాల్గొన్నట్లు ఈనాడు కథనం పేర్కొంది. ఈ కూటమికి కన్వీనర్‌గా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో కూటమి ఆవిర్భావ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.
Image copyright facebook
చిత్రం శీర్షిక నారాయణ

గతంలో చికెన్ నారాయణగా గుర్తింపు పొందిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇప్పుడు కల్లు నారాయణ అవతారమెత్తారని సాక్షి కథనం పేర్కొంది. విజయవాడలో జరుగుతున్న జాతీయ సమితి సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన నారాయణ గురువారం సైకిల్‌పై మందడానికి వెళ్లారు.

గ్రామ శివార్లలో కల్లు గీత కార్మికులు కనిపించడంతో నారాయణ, అక్కడ సేదతీరి కల్లు ముంత ఖాళీ చేశారు. అనంతరం అక్కడి నుంచి సచివాలయ సమీపంలోని ఎన్టీఆర్ క్యాంటీన్‌కు వెళ్లి టిఫిన్ చేశారు.

నారాయణ గతంలో గాంధీ జయంతి రోజున చికెన్ తిని వార్తల్లోకెక్కిన విషయాన్ని సాక్షి కథనం గుర్తు చేసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు