అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్: 'ఆ నీచమైన వాళ్లు మనకు అవసరమా?'

  • 12 జనవరి 2018
అమెరికా జెండా Image copyright 400tmax/getty images

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వలసదారులపై నీచంగా మాట్లాడారా?

అవుననే అంటోంది వాషింగ్టన్ పోస్ట్ కథనం. హైతీ, ఎల్ సాల్వడార్, ఆఫ్రికా దేశాలను పరోక్షంగా దుర్భాషలాడినట్లు తెలుస్తోంది.

'నీచమైన దేశాలు'

ఆ కథనం ప్రకారం.. గురువారం ప్రజాప్రతినిధులతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.

"అత్యంత నీచమైన దేశాల నుంచి వచ్చిన ప్రజలు మన దేశంలో ఎందుకు?" అని ప్రజాప్రతినిధులతో ట్రంప్ అన్నారు. నార్వే వంటి దేశాల నుంచి అమెరికాకు వలసదారులు కావాలని అభిప్రాయపడ్డారు.

అయితే, ట్రంప్ మాత్రం ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. తాను ఇలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని, ఎవరినీ దుర్భాషలాడలేదని తెలిపారు.

అయితే, ట్రంప్ ఆఫ్రికా దేశాలను ఉద్దేశించి ‘నీచమైన’ దేశాలు అని అన్నారని డెమొక్రటిక్ సెనేటర్ డిక్ డర్బిన్ చెప్పారు.

Image copyright shakzu/getty images
చిత్రం శీర్షిక సెంట్రల్ అమెరికా ప్రాంతీయులు ట్రంప్ నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు
Image copyright rarrarorro/getty images

'అమెరికా కోసం పోరాడుతున్నారు'

"కొందరు ప్రజాప్రతినిధులు పరాయి దేశస్తుల కోసం పాటుపడుతున్నారు. కానీ అధ్యక్షుడు ట్రంప్ అమెరికా పౌరుల కోసం పోరాడుతున్నారు" అని వైట్ హౌస్ అధికార ప్రతినిధి రాజ్ షా అన్నారు.

"ప్రపంచంలో కొన్ని దేశాలు ప్రతిభ ఆధారంగా విదేశీయులకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇదే బాటలో ట్రంప్ నడవాలనుకుంటున్నారు. వలసదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. మా దేశ అభివృద్ధికి పాటుపడుతూ మా సమాజంలో కలిసి పోయే వారికి మేం ఎప్పుడూ స్వాగతం పలుకుతాం" అని షా తెలిపారు. ఈమేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది.

ట్రంప్‌తో జరిగిన సమావేశంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ లిండ్సే గ్రాహాం కూడా పాల్గొన్నారు. అయితే ఈ విషయంపై ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

విమర్శలు

"ట్రంప్ క్షమించలేని వ్యాఖ్యలు చేశారు. ఇవి వైట్ హౌస్ గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను" అని మేరీ‌ల్యాండ్ డెమోక్రటిక్ ప్రజాప్రతినిధి ఎలీజా కమింగ్స్ ట్వీట్ చేశారు.

జాతి వివక్ష చూపుతూ ట్రంప్ మరింత దిగజారుతున్నారని ది నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ వ్యాఖ్యానించింది.

వైట్ హౌస్ ఇటువంటి విమర్శలను ఖండించింది.

అయితే అమెరికాలో ఎల్ సాల్వడార్ ఎంబసీ ప్రతినిధి దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.

ఎల్ సాల్వడార్‌ వలసదారులకు కల్పించిన తాత్కాలికంగా నివాస హక్కులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇటీవల అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో ట్రంప్ భేటీ అయ్యారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం