దేవతలు తెల్లగానే ఎందుకు ఉండాలి? నల్లగా ఉంటే తప్పేంటి?

హిందూ దేవతలు

ఫొటో సోర్స్, Naresh Nil

కాళీమాత, వివిధ అమ్మవార్ల ఫొటోలు నల్లగా ఉంటాయి. కానీ కొన్ని ఫొటోలూ బొమ్మలూ సినిమాలు చూస్తే దేవుళ్లు తెల్లగానే కనిపిస్తారు.

ఏం.. దేవుళ్లు ఇక్కడ తెల్లగానే ఉండాలా? నల్లగా ఎందుకు ఉండకూడదు?

చెన్నైకి చెందిన భరద్వాజ్ సుందర్, నరేష్ అనే ఇద్దరు కుర్రాళ్లకు అదే ప్రశ్న తలెత్తింది.

దేవుళ్ల విషయంలో కూడా వర్ణవివక్షను చూపిస్తున్నారనే భావన వాళ్లలో కలిగింది.

ఫొటో సోర్స్, Naresh Nil

ఫొటో క్యాప్షన్,

కుమారస్వామి

అందుకే ఆ వివక్షకు వ్యతిరేకంగా 'డార్క్ ఈజ్ డివైన్' అనే థీమ్‌తో ఈ మధ్య వాళ్లు ఓ ఫొటోషూట్ చేశారు. ఆ ఫొటోషూట్ కోసం కేవలం నల్లగా ఉండే మోడళ్లనే ఎంచుకున్నారు.

లక్ష్మీదేవి, సరస్వతీ దేవి, శివుడు, సీత.. ఇలా ఆ ఫొటోల్లోని దేవుళ్లూ దేవతలూ నల్లగానే కనిపిస్తారు.

వీడియో క్యాప్షన్,

వీడియో: దేవుళ్లు తెల్లగానే ఎందుకుండాలి? నల్లగా ఉంటే తప్పేంటి?

‘సాధారణంగా పెళ్లికూతుళ్లను లక్ష్మీ దేవితో పోలుస్తారు. కానీ ప్రతిసారీ లక్ష్మీదేవిని తెల్లగానే చిత్రిస్తారు.

రవివర్మ పెయింటింగుల్లో కూడా దేవతలు తెల్లగానే ఉంటారు. తెలుపే దేవుళ్లకు ప్రతీకగా ఉండాలా? ఏం.. లక్ష్మీదేవి నల్ల రంగులో ఉండకూడదా? ఆ విషయం చెప్పాలనే ఇలా ఫొటోషూట్ చేశాం. దీని కోసం కేవలం నల్ల రంగులో ఉండే మోడల్స్‌ని వెతికి పట్టుకున్నాం’ అంటారు ఫిల్మ్‌మేకర్ భరద్వాజ్.

ఫొటో సోర్స్, Naresh Nil

ఫొటో క్యాప్షన్,

దుర్గా దేవి

‘ఈ థీమ్‌ని చూసి మా బృందంలోని ఓ బ్యుటీషియన్ కూడా స్ఫూర్తి పొందారు. ఆమె కూడా నల్లగా ఉంటారు. తనకు కూడా ఫొటోషూట్‌లో పాల్గొనాలని ఉందని చెప్పారు. ఆ కోరిక మేరకు ఆమెను సీతా దేవి రూపంలో చూపించాం. లవకుశులను కూడా నల్లగా చూపించాం’ అంటారు ఫొటోగ్రాఫర్ నరేష్.

ఈ ఫొటోషూట్‌లో శ్రుతి పెరియసామి అనే మోడల్ లక్ష్మీదేవిగా కనిపించారు. తమిళనాడులో కూడా నల్లరంగుపై వివక్ష ఉండటం ఆశ్చర్యకరమని ఆమె అంటారు.

ఫొటో సోర్స్, Naresh Nil

ఫొటో క్యాప్షన్,

లక్ష్మీ దేవి

‘నా ఫ్రెండ్ ఒకమ్మాయి కాస్త నల్లగా లావుగా ఉంటుంది. ఆమెకు మోడలింగ్ అంటే ఇష్టం. కానీ అవకాశాలు రాలేదు. ఆమెలాంటి చాలామంది వ్యక్తులు నల్లగా ఉన్నారనే కారణంతో మోడలింగ్ అవకాశాలకు దూరమవుతున్నారు.

లక్ష్మీదేవిగా నా ఫొటోలు చూశాక, తనకు కూడా అలాంటి మోడలింగ్ అవకాశాలేవైనా ఉంటే చెప్పమని నా ఫ్రెండ్ అడిగింది.

అలా ఈ ప్రాజెక్టు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది’ అంటారు శ్రుతి.

ఫొటో సోర్స్, Naresh Nil

ఫొటో క్యాప్షన్,

శ్రీ కృష్ణుడు

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)