బీబీసీ ఇంటర్వ్యూ: న్యాయవ్యవస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి - సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్

  • 12 జనవరి 2018
సుప్రీంకోర్టు Image copyright SAJJAD HUSSAIN/AFP/Getty Images)
చిత్రం శీర్షిక సుప్రీంకోర్టు

దేశ న్యాయవ్యవస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ రాజు రామచంద్రన్ శుక్రవారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా తన పాత్రను తాను పోషించాలంటే ఇప్పుడు తెరపైకి వచ్చిన సమస్యలను న్యాయవ్యవస్థ పరిష్కరించుకోవాల్సి ఉందని తెలిపారు.

నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ సమావేశమై, చర్చించాల్సి ఉందని ఆయన చెప్పారు.

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ మీడియా సమావేశం నిర్వహించి, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహారశైలి, ఇతర అంశాలపై మాట్లాడారు.

ఈ నేపథ్యంలో రాజు రామచంద్రన్‌ను బీబీసీ ప్రతినిధి ఇక్బాల్ అహ్మద్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఆడియో ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు...

Image copyright Supreme Court
చిత్రం శీర్షిక సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్

ప్రశ్న: మీ అభిప్రాయం ప్రకారం తాజా పరిణామం ఎలాంటిది?

రాజు రామచంద్రన్: ఇది తీవ్రమైన పరిణామం. ముందెన్నడూ జరగనిది. ఇది చరిత్రలో నిలిచిపోయే పరిణామం. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పరిస్థితులు ఎంతగా క్షీణించాయో ఇది స్పష్టం చేస్తోంది.

ఇప్పటివరకు ఇలాంటి అంశాలపై న్యాయమూర్తులు ప్రజల ముందుకు రాకుండా సంయమనం పాటించేవారు. నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు ఈ సంప్రదాయాన్ని పక్కనబెట్టి మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. సుప్రీంకోర్టు పనితీరులో మెరుగైన పారదర్శకత కోసం తాము చేయగలిగినదంతా చేశామని ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రయత్నించారు.

మీడియానుద్దేశించి మాట్లాడటం న్యాయమూర్తులకు అలవాటు లేనందున వారు మీడియా సమావేశాన్ని అంత బాగా నిర్వహించలేకపోయుండొచ్చు. అయినప్పటికీ, వారి ఈ సమావేశం ముఖ్యమైన ప్రజాప్రయోజనాన్ని నెరవేర్చిందని నేను భావిస్తున్నాను. ఈ నలుగురు న్యాయమూర్తులు ప్రజలకు తాము చెప్పదలచుకొన్నది చెప్పగలిగారు.

రోస్టర్ విధానంపై నిర్ణయాధికారం ప్రధాన న్యాయమూర్తికే ఉన్నందున, ధర్మాసనాలకు కేసుల కేటాయింపులో ఆయన ఈ అధికారాన్ని హేతుబద్ధంగా ఉపయోగించాలని వారు ప్రధానంగా చెప్పారు.

ప్రధాన న్యాయమూర్తి తనకు నచ్చినట్టుగా కేసులను కేటాయించవచ్చనే అభిప్రాయం ప్రజల్లో ఉంటే న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుంది. దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన కేసులను సీనియర్ న్యాయమూర్తులు విచారించాలి.

Image copyright Reuters

ప్రశ్న: మీరు రోస్టర్ విధానం గురించి ప్రస్తావించారు.. ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి ఈ నలుగురు న్యాయమూర్తులు ఇంకేదైనా అంశాన్ని కూడా చెబుతున్నారా?

రాజు రామచంద్రన్: వారు ఏం ప్రస్తావించినా వారి వాదనలో అంతిమంగా రోస్టర్ విధానమే కీలకాంశం. ప్రధాన న్యాయమూర్తికి వారు రాసిన లేఖలోని భాష, సందేశం న్యాయవాదులు, న్యాయమూర్తులకు మాత్రమే వివరంగా అర్థమవుతుంది. ధర్మాసనాలకు కేసుల కేటాయింపు తీరు న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించేలా ఉండాలన్నదే వారు అంతిమంగా చెప్పదలచుకొన్నది.

సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులందరూ సమానులే అయినప్పటికీ, దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన కేసుల్లో వాటిని విచారించే న్యాయమూర్తుల సీనియారిటీకి ప్రాధాన్యం ఉంటుంది.

జస్టిస్ సీఎస్ కర్ణన్ కేసును ఏడుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన సుప్రంకోర్టు ధర్మాసనం విచారించింది. అదొక హైకోర్టు న్యాయమూర్తి కేసు కాబట్టే అంతమంది సీనియర్లతో కూడిన ధర్మాసనం విచారించింది.

ఈ కేసులాగే సీనియర్ న్యాయమూర్తులు విచారించాల్సిన ప్రధానమైన కేసులు ఇంకా ఉన్నాయి. ఈ కేసుల కేటాయింపునకు సముచితమైన విధానం ఉండాలి.

Image copyright STR/AFP/Getty Images
చిత్రం శీర్షిక ’’జస్టిస్ కర్ణన్ కేసును ఏడుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన సుప్రంకోర్టు ధర్మాసనం విచారించింది’’

ప్రశ్న: ఇప్పుడు నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి ఏం చేయాల్సి ఉందని మీరు భావిస్తున్నారు?

రాజు రామచంద్రన్: ఈ నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ చర్చించాలి. ఫుల్ కోర్టు సమావేశమై చర్చించాలి. తన సహచర న్యాయమూర్తులందరూ ఏమనుకొంటున్నారో ప్రధాన న్యాయమూర్తికి తెలియాల్సి ఉంది. ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. చక్కదిద్దలేనంతగా పరిస్థితులు ఉన్నాయనైతే నేను అనుకోవడం లేదు.

ఈ మీడియా సమావేశమైతే కచ్చితంగా ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ నలుగురు జడ్జిలు తనకు రాసిన లేఖలో లేవనెత్తిన అంశాలను సుప్రీంకోర్టు అనే వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాన న్యాయమూర్తి పరిష్కరించాలి.

ప్రశ్న: తాజా పరిణామం నేపథ్యంలో కార్యనిర్వాహక వ్యవస్థ చేయగలిగింది ఏమైనా ఉందా?

రాజు రామచంద్రన్: ఈ విషయంలో కార్యనిర్వాహక వ్యవస్థ చేయగలిగింది ఏమీ లేదు. న్యాయవ్యవస్థలోని ఒక తీవ్రమైన సంక్షోభాన్ని తాజా పరిణామం చాటి చెప్పింది. ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా తన పాత్రను తాను పోషించాలంటే ఇప్పుడు తెరపైకి వచ్చిన సమస్యలను న్యాయవ్యవస్థ పరిష్కరించుకోవాల్సి ఉంది.

Image copyright PTI
చిత్రం శీర్షిక మీడియా సమావేశంలో జస్టిస్ కురియన్, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ లోకూర్

బీబీసీ: తాజా పరిణామంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించారు.. ఈ విషయంలో ప్రభుత్వం చేయగలింది ఏమైనా ఉందా?

ఈ విషయంలో ప్రభుత్వం చేయగలింది ఏమీ లేదనుకుంటున్నాను. దేశానికి సంబంధించిన కీలకమైన పరిణామం కావడంతో వివరాలు తెలుసుకునేందుకు, చర్చించేందుకు న్యాయశాఖ మంత్రిని ప్రధాని పిలిపించి ఉంటారు.

ప్రభుత్వం ఒక్కటే చేయగలిగింది ఏమీ లేదు. అయితే ప్రభుత్వం, పౌర సమాజం, ఇతర సీనియర్ న్యాయమూర్తులు, న్యాయకోవిదులు, న్యాయవాదులు.. ఇలా దేశంలోని అందరూ మీడియా ద్వారా న్యాయమూర్తులకు ఒక విషయం తెలియజేయాల్సి ఉంది. అదేంటంటే- జడ్జిలు వారి సమస్యలను పరిష్కరించుకోవాలని, పరిస్థితులను చక్కదిద్దుకోవాలని.

ఈ విషయంలో ప్రభుత్వం కంటే ఇతర వర్గాలే మరింత ప్రాధాన్యమైన పాత్రను పోషించాల్సి ఉంది. ఎందుకంటే- గట్టి మెజారిటీ ఉన్న ప్రభుత్వం న్యాయవ్యవస్థ బలంగా ఉందా, బలహీనంగా ఉందా అనేదాని గురించి పెద్దగా పట్టించుకోదు. అయితే న్యాయవ్యవస్థ బలహీనంగా ఉంటే కన్నా కూడా బలంగా ఉంటేనే ప్రభుత్వం ఆందోళన చెందే అవకాశముంది.

ప్రశ్న: న్యాయవ్యవస్థ పట్ల సాధారణ పౌరుడిలో ఉండే నమ్మకంపై తాజా పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి? న్యాయవ్యవస్థపై పౌరుడిలో నమ్మకం తగ్గిపోయి ఉంటుందా?

రాజు రామచంద్రన్: కచ్చితంగా నమ్మకం తగ్గే ఉంటుంది. అయితే న్యాయవ్యవస్థలో జరుగుతున్నవాటిని తెర వెనక దాచేయడం కన్నా బయటపెట్టడం మంచిది. కొంత కాలంపాటు పౌరుడిలో నమ్మకం తగ్గిపోయినా, దిద్దుబాటు చర్యలు చేపడితే దానిని పునరుద్ధరించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)