దళితులకు గుండు గీయించి, మెడలో ‘ఆవుల దొంగ’ అనే బోర్డు వేసి ఊరేగించారు!

  • 13 జనవరి 2018
దళిత యువకుల కుటుంబ సభ్యులు Image copyright Rihai Manch
చిత్రం శీర్షిక బాధిత యువకుల కుటుంబ సభ్యులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఆవుల దొంగతనానికి పాల్పడ్డారనే ఆరోపణపై ఇద్దరు దళిత యువకులకు గుండు గీయించి, వీధుల్లో ఊరేగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పోలీసులు ఆ ఇద్దరు యువకులను ఆవుల దొంగతనం ఆరోపణపై అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే వారిని కొట్టి ఊరేగించిన గుంపులోంచి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

అయితే, ఆ యువకులపై భౌతికి దాడికి పాల్పడ్డ వారిపై కూడా కేసు నమోదు చేశామని బలియా పోలీసులు బీబీసీకి తెలిపారు.

ఉమ, సోను అనే ఇద్దరు యువకులు తాము ఆవుల దొంగతనానికి పాల్పడ్డామని ఒప్పుకున్నట్టు అవధేశ్ కుమార్ చౌధరి అనే పోలీసు అధికారి బీబీసీకి చెప్పారు. అందుకే వారిని జైలుకు పంపించినట్టు ఆయన వివరించారు.

అయితే వారిద్దరినీ తప్పుడు కేసులో ఇరికించారని యువకుల కుటుంబ సభ్యులంటున్నారు.

Image copyright EPA

మందిరం సమీపంలో దాడి

ఈ ఘటన గత సోమవారం ఉదయం ఒక మందిరానికి సమీపంలో జరిగింది. మందిరం సమీపంలో ఉన్న ఓ గుంపు ఈ యువకులను పట్టుకొని ఆవుల దొంగతనానికి పాల్పడ్డారంటూ దుర్భాషలాడుతూ విపరీతంగా కొట్టారు.

వారి మెడలో 'నేను ఆవుల దొంగను' అని రాసున్న బోర్డు వేలాడదీసి ఆ పరిసర ప్రాంతాల్లో ఊరేగించారు.

వీరిలో ఒక యువకుడి తండ్రి సుభాష్ రామ్ బీబీసీతో మాట్లాడుతూ, "వాళ్లిద్దరూ ఆ సమయంలో బంధువుల ఇంటికి వెళ్తున్నారు. మఠానికి చెందిన వ్యక్తులు వారిని పట్టుకొని కొట్టారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని గుంపు దాడి నుంచి కాపాడారు" అని అన్నారు.

"మఠానికి చెందిన వాళ్లు యువకులను మీ కులమేంటని ప్రశ్నించారు. వారిద్దరూ దళితులని తెలిశాక వారిని దారుణంగా కొట్టారు. వారి వద్ద ఉన్న డబ్బులు, మొబైల్, ఇతర సామాన్లు కూడా లాక్కున్నారు" అని ఆయన చెప్పారు.

ఈ ఘటన గురించి ఎక్కడా చెప్పవద్దని ఒత్తిడి చేశారని కూడా ఇద్దరు యువకుల కుటుంబ సభ్యులు ఆరోపించారు.

సోను సోదరుడు చంద్రేశ్ బీబీసీతో మాట్లాడుతూ, "నా సోదరుడు చాయ్ దుకాణం దగ్గర నిలబడి ఉన్నాడు. అక్కడే చాలా ఆవుదూడలు కూడా ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఓ మహంత్ వచ్చాడు. దూడల్ని దొంగిలించాలనే దుర్బుద్ధితో వాటి వైపు చూస్తున్నావా అంటూ ఆరోపణ చేశాడు" అని చెప్పారు.

"మఠంలోని వాళ్లకు వీరిద్దరూ దళితులని తెలియడంతో వాళ్లను దారుణంగా కొట్టారు. మీరు దళితులు కాబట్టి మిమ్మల్ని కొట్టి వదిలి పెడుతున్నాం, మీరే గనుక ముస్లింలై ఉంటే నరికి పడేసే వాళ్లమని దాడికి పాల్పడ్డవారు అన్నారు" అని చంద్రేశ్ అన్నారు.

Image copyright Getty Images

వీడియో వైరల్

ఇద్దరు యువకులకు గుండు గీయించి, మెడలో బోర్డు వేసి ఊరేగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

"మేం బలహీనులం. కాబట్టి దీనికి మేం బదులు తీర్చుకోలేం. దాడికి పాల్పడ్డవారు బలవంతులు. వారికి అధికారంలో ఉన్నవారి అండదండలున్నాయి" అని చంద్రేశ్ వాపోయారు.

కాగా, ఈ ఘటనపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిస్తానని జాతీయ ఎస్‌సీ/ఎస్‌టీ కమిషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ రమాశంకర్ కఠేరియా అన్నారు.

బీబీసీతో మాట్లాడుతూ కఠేరియా, "ఇలా జరిగి ఉంటే ఈ కేసుపై దర్యాప్తు జరిపిస్తాను. తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్‌పీలను ఆదేశిస్తాను" అని అన్నారు.

"ఈ కేసు విషయంలో ఎవరైనా లిఖితపూర్వకంగా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. నేను స్వయంగా ఎలాగూ దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నాను" అని కఠేరియా అన్నారు.

గత కొద్ది నెలలుగా దేశంలో దళితులపై చాలా చోట్ల దాడులు జరిగాయి. గుజరాత్‌లోని ఉనాలో చనిపోయిన పశువుల చర్మాన్ని ఒలుస్తున్న దళితులను పట్టుకొని కొట్టిన ఘటన జాతీయ స్థాయిలో కలకలం రేపింది.

గోరక్షకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రకటన చేయాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)