కర్నూలు: సిద్ధాపురం చెరువులో దొంగల సేద్యం

  • డీఎల్ నరసింహ
  • బీబీసీ కోసం
సిద్ధాపురం
ఫొటో క్యాప్షన్,

చెరువు వద్ద బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన బోర్డు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఏడాది సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు, పాములపాడు మండలాల్లోని వేలాది మంది రైతులు చిరకాలంగా ఈ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే సిద్ధాపురం గ్రామానికీ, ఈ ప్రాజెక్టుతో జలకళను సంతరించుకోబోతున్న చెరువుకూ దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది.

ఆనాడు అసలిక్కడ ఊరనేదే లేదు. చుట్టూ అంతా అడవే. బ్రిటిష్ అధికారులు ఈ ఊరిని ఏర్పాటు చేశారు.

ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చిన దొంగలను ఇక్కడ చేర్చి వారిని వ్యవసాయం వైపు మళ్లించారని స్థానికులు గుర్తు చేసుకుంటారు.

అంతే కాదు, సిద్ధాపురం గ్రామం ఒకప్పుడు బహిరంగ జైలుగా ఉండేదట. ఊరి నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన పహారా ఉండేదట.

ఫొటో క్యాప్షన్,

వెలుగోడు రిజర్వాయర్ నుంచి సిద్ధాపురం చెరువులోకి నీటిని మళ్లించే పథకం పురుడు పోసుకుంది 1993లో.

ఊరి కథ.. చెరువు కథ...

రూ. 119 కోట్ల వ్యయంతో చేపట్టిన సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ద్వారా 23 వేల ఎకరాలకు సాగునీరు, 12 గ్రామాలకు తాగునీరు అందుతుందని ప్రభుత్వం చెబుతోంది.

వెలుగోడు రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా సిద్ధాపురం చెరువుకు నీరు చేరుతుంది.

ఈ చెరువును 1922లో బ్రిటిష్ ప్రభుత్వం తవ్వించింది. ఈ చెరువు నిర్మాణం వెనుక ఓ ఆసక్తికరమైన కారణముందని స్థానికులు చెబుతారు.

'దొంగల్లో మార్పు తెచ్చేందుకే చెరువు'

దొంగతనాలకు, దారిదోపిడీలకు పాల్పడే వారిలో మార్పు తెచ్చేందుకు బ్రిటిష్ పాలకులు సిద్ధాపురం చెరువును తవ్వించారని స్థానికులంటారు.

అప్పట్లో వివిధ ప్రాంతాల్లో దారిదోపిడీలు, దొంగతనాలు చేసే నేరస్తులందరినీ బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధాపురం గ్రామానికి తరలించేదట.

దొంగతనాలు మాన్పించేందుకు గాను వారికి భూములు ఇచ్చి వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించింది.

ఫొటో క్యాప్షన్,

సిద్ధాపురం పోస్ట్ ఆఫీస్ - బ్రిటిష్ కాలపు ఆనవాళ్లు

సమాజంలో దొంగలుగా, బందిపోట్లుగా ముద్రపడిన వారికి పునరావాసం కల్పించేందుకు నాటి బ్రిటిష్ ప్రభుత్వం మరి కొన్ని చోట్ల కూడా ఇలాంటి గ్రామాలను ఏర్పాటు చేసింది.

వారికి వ్యవసాయానికి అవసరమైన సాగునీటికోసం చెరువును తవ్వించింది. వర్షపు నీటితో పాటు నల్లమల అడవుల నుంచి నీరు చెరువులోకి వచ్చేందుకు కాలువలను తవ్వించింది.

చెరువు పరిధిలో 1000 ఎకరాల ఆయకట్టు ఏర్పాటు చేసి గ్రామంలోకి తీసుకొచ్చిన నేరస్తులకు జీవనోపాధి కల్పించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం.

దాదాపు వందేళ్లపాటు ఆయకట్టు రైతాంగానికి సాగునీరందించింది ఈ సిద్దాపురం చెరువు.

1993 నాటిదీ ఎత్తిపోతల పథకం!

కాలక్రమంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, సకాలంలో చాలినంత వర్షాలు కురవకపోవటంతో చెరువులోకి నీరు చేరటం తగ్గుతూ వచ్చింది.

వర్షాధారమైన ఈ చెరువు కింద రాను రాను పంటలు పండటం తగ్గిపోయింది. దీనికి తోడు సమీపంలో వున్న శ్రీశైలం జలాశయం నుంచి కూడా కృష్ణా జలాలు అందకపోవటం ఈ ప్రాంత రైతాంగానికి శాపంగా మారింది.

ఈ నేపథ్యంలోనే 1993లో సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ప్రతిపాదన తెరమీదకొచ్చింది. అప్పటి నుంచి స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ ప్రాజెక్టు కోసం కృషి చేశారు.

2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు.

అయితే, ఎన్నో అవాంతరాల మధ్య పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. పదకొండున్నర యేండ్ల తరువాత ఇప్పుడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది.

ఈ ప్రాజెక్టుకు బుడ్డా వెంగళరెడ్డి ఎత్తిపోతల పథకం అని పేరు పెట్టారు.

బ్రిటిష్ కాలం నాటి ఊరు!

ఎత్తిపోతల పథకం ప్రారంభమైన సందర్భంగా, సిద్ధాపురం గ్రామ ప్రజలతో బీబీసీ మాట్లాడింది. ఆంగ్లేయుల ఏలుబడిలో గ్రామంలో పరిస్థితులు ఎలా ఉండేవో, వారి తాతలు, తండ్రులు ఏమని చెప్పేవారో కనుక్కుంది.

"మా తాతలు, ముత్తాతలు దొంగతనాలు చేసేవారట. వారి లాగే ఈ ఊరి పూర్వీకుల్లో చాలా మంది ఈ పనే చేసేవారట. బేతంచర్ల, కడప, కావలి, గుంటూరు, బెంగళూరు, మద్రాసు నుంచి దొంగలను బ్రిటిష్ వాళ్లు తీసుకొచ్చి ఈ ఊళ్లో పడేశారు" అని సిద్ధాపురం సర్పంచ్ రమణమ్మ తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

సిద్ధాపురం గ్రామ సర్పంచ్ రమణమ్మ

"అప్పుడు ఇదంతా అడవిలా ఉండేదట. చెట్లు, పుట్టలు కొట్టుకొని వ్యవసాయం చేసుకోమని భూములిచ్చారట. నీటి వసతి కోసం చెరువును కట్టించారు. దొంగతనాలు మాన్పించేందుకే బ్రిటిష్ వాళ్లు ఈ పని చేశారని మా తాత, నాయన చెప్పేవాళ్లు" అని ఆమె అన్నారు.

అయితే ఇప్పుడు అదంతా చరిత్ర అని దొంగతనాలు మానేశారని , అందరూ రైతులుగా స్థిరపడి బతుకుతున్నారని ఆమె చెప్పారు. కాలక్రమంలో ఈ ఊరికి చాలా మంది వచ్చి చేరారు.

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలు మూడున్నాయని రమణమ్మ తెలిపారు.

ఎత్తిపోతల పథకం ప్రారంభం కావటంతో ఎన్నో యేండ్లనాటి కల నెరవేరినట్లైందని సంతోషం వ్యక్తంచేశారు రమణమ్మ.

అయితే సిద్ధాపురం వాసుల భూములకు ఇప్పటికీ పట్టాలు లేవనీ, సాంకేతికంగా ఇదంతా ఇప్పటికీ ప్రభుత్వ భూమేనని ఆమె తెలిపారు. ఇలా పట్టాలు లేకపోవడం వల్ల బ్యాంకు రుణాలు లభించడం కష్టమవుతోందని ఆమె అన్నారు.

ఫొటో క్యాప్షన్,

ఊరి చుట్టూ ఓ కంచె ఉండేది... ఎటూ వెళ్లనిచ్చేవారు కాదు.

సిద్దాపురం ఒకప్పుడు బహిరంగ జైలు!

సిద్ధాపురానికి చెందిన వెంకటమ్మ అనే వృద్ధురాలు బీబీసీతో మాట్లాడుతూ, "అప్పట్లో ఈ ఊరిలోకి తెచ్చిన వారిని ఎవ్వరిని బయటకు పోనిచ్చేవారుకాదు. ఇక్కడే వ్యవసాయం చేసుకొని ఇక్కడే బతకాలి. ఊరి చుట్టూ ఓ కంచె ఉండేది. ప్రతిరోజూ రాత్రి ఆఫీసర్లు వచ్చి హాజరు వేసేవారు. దొంగతనాలు చేసేందుకు వెళ్లి పోతారేమోననే అనుమానంతో, వారిని అక్కడి నుంచి పారిపోనివ్వకుండా ఉండేందుకు అలా చేసేవాళ్లు" అని చెప్పారు.

"ఈ ఊరిలో పోలీసు స్టేషన్, డిపో, బడి, పోస్టాఫీసు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇక్కడే ఉండేవాళ్ళు. పండిన పంటలను డిపోలో పెట్టి అందరికి పంచేవారు. కూలీతోపాటు విత్తనాలు ఎరువులు కూడా ఇచ్చేవాళ్ళు. అప్పటి వాళ్లు కష్టపడటం వల్లే ఇప్పుడు ఊళ్ళో అందరికీ పొలాలున్నాయి" అని చెప్పుకొచ్చారు.

ఫొటో క్యాప్షన్,

చెరువుకు నీళ్లొస్తే రెండు పంటలు పండిస్తాం!

"సిద్దాపురం అంటే బహిరంగ జైలులాగా ఉండేదని అంటారు మాపెద్దోళ్లు. బ్రిటీషోళ్లు భూములిచ్చారు, చెరువు తవ్వించారు. అప్పుడు వ్యవసాయం తక్కువ కాబట్టి సరిపోయేదంట. రాన్రాను దొంగతనాలు తగ్గి వ్యవసాయం పెరిగింది. వానలు పడటం తగ్గిపోయాయి. దీంతో అంతా మారిపోయింది. నిన్నటిదాకా వానలొస్తేనే పంటలు పండేవి. పంటలేశాక వాన లేదంటే అంతా నష్టమే. బాగా ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. చెరువుకు నీల్లు రావటంవల్ల రెండు పంటలు పండుతాయి" అంటూ సంతోషంగా చెప్పారు మంతయ్య అనే వృద్ధుడు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.