జస్టిస్ లోయా మృతిపై మాకు ఎవరిపైనా ఆరోపణలు లేవు: కుమారుడు

  • 14 జనవరి 2018
జస్టిస్ లోయా Image copyright CARAVAN MAGAZINE

జస్టిస్ బ్రజ్‌గోపాల్ లోయా కుమారుడు అనుజ్ ఆదివారం నాడు మీడియా ముందుకు వచ్చారు. తమ తండ్రి మృతిపై తమ కుటుంబానికి ఎవరిపైనా 'ఎలాంటి ఆరోపణలూ లేవు' అని ఆయన అన్నారు.

ఈ వివాదంతో తమ కుటుంబం బాగా ఇబ్బంది పడుతోందనీ, తాము ఇందులోంచి బయటపడాలని అనుకుంటున్నామనీ ఆయన ముంబయిలో జరిగిన విలేఖరుల సమావేశంలో చెప్పారు.

దీనిపై విచారణ జరిపించాలని కోరుకుంటున్నారా అని విలేఖరులు అడగగా, తాము ఎలాంటి విచారణనూ కోరుకోవడం లేదని అనుజ్ చెప్పారు.

"ఈ విషయంలో మా కుటుంబం చాలా ఇబ్బంది పడుతోంది. మాకు ఎవరిపైనా ఎలాంటి ఆరోపణా లేదు. మేం చాలా బాధలో ఉన్నాం. మేం వీటన్నింటి నుంచి బయట పడాలని అనుకుంటున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీడియా ద్వారా ఈ విషయాన్ని అందరి దృష్టికి తేవాలనుకుంటున్నాను" అని 21 ఏళ్ల అనుజ్ అన్నారు.

అనుమానాల నేపథ్యం

సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ లోయా 2014 డిసెంబర్‌ 1న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మరణించారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనడానికి ఆయన అక్కడికి వెళ్లగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్)తో ఆయన మృతి చెందారు.

జస్టిస్ లోయా ఆ సమయంలో సోహ్రాబుద్దీన్ 'ఎన్‌కౌంటర్' కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులు నిందితులుగా ఉన్నారు.

ఇప్పుడు ఆ కేసును మూసేశారు. అమిత్‌షాను నిర్దోషిగా తేల్చారు.

అయితే, లోయా కుటుంబీకులతో జరిపిన సంభాషణల ఆధారంగా 'ద కారవాన్' పత్రిక ప్రచురించిన కథనంలో ఆయన మృతికి దారితీసిన పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. దాంతో ఆయన మృతిపై విచారణ జరిపించాలనే డిమాండ్ మొదలైంది.

కానీ ఇద్దరు న్యాయమూర్తులను ఉటంకిస్తూ 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ప్రచురించిన మరో కథనంలో ఈ అనుమానాలు నిరాధారమని పేర్కొన్నారు.

శుక్రవారం ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కేసు చాలా తీవ్రమైందిగా అభివర్ణించింది.

చిత్రం శీర్షిక వధూవరులతో జస్టిస్ లోయా (కుడి వైపున చివరి వ్యక్తి)

లేఖ రాసింది నిజమే కానీ..

తన తండ్రి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అనుజ్ గతంలో రాసిన లేఖ గురించి విలేఖరులు ప్రస్తావించగా, "ఆ సమయంలో నేను తీవ్రమైన భావోద్వేగానికి లోనై ఉన్నాను. నేను విషయాలను అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడు నాకు అనుమానాలు కలిగాయి. కానీ ఇప్పుడు నాకు అనుమానాలేం లేవు" అని అనుజ్ చెప్పారు.

అనుజ్ గతంలో రాసినట్టుగా చెబుతున్న ఆ లేఖలో, "నాన్న గారి మృతిపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నేను ఆయనను (జస్టిస్ మోహిత్ షా) కోరాను. నాకు గానీ, మా కుటుంబ సభ్యులెవరికైనా గానీ ఏదైనా జరిగితే ప్రధాన న్యాయమూర్తి మోహిత్‌షాది, ఈ కుట్రలో భాగస్వాములైన ఇతరులదే బాధ్యత" అని ఉంది.

'ద కారవాన్' 2017 నవంబర్ 21 సంచికలో ఈ లేఖను ప్రచురించారు. ఆదివారం నాటి ప్రెస్ మీట్‌లో అనుజ్ ఆ లేఖను తాను రాయలేదని అనలేదు.

అయితే, 'ద కారవాన్' కథనం వెలువడ్డ వారం రోజులకే అనుజ్ యూ-టర్న్ తీసుకుంటూ, తనకు తన తండ్రి మృతి చెందిన పరిస్థితుల విషయంలో 'ఎలాంటి అనుమానాలు లేదా ఫిర్యాదులు లేవు' అని అన్నారు.

ఆదివారం నాటి ప్రెస్ మీట్‌లో అనుజ్ చాలా అసౌకర్యంగా కనిపించారు. ఈ సమావేశంలో ఆయన బంధువు, స్నేహితుడు, న్యాయవాది అమిత్ నాయక్ ఆయన పక్కనే ఉన్నారు.

అనుజ్‌ను ప్రశ్నలు అడగనివ్వకుండా న్యాయవాది అమిత్ పదే పదే అడ్డుకున్నారంటూ ఆ సమావేశంలో హాజరైన విలేఖరులు ఫిర్యాదు చేశారు.

జస్టిస్ లోయా మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అనుజ్ తాతగారు, మేనత్త పత్రికలకు ఇంటర్వ్యూ ఇవ్వడాన్ని గుర్తు చేస్తూ, కుటుంబంలో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయా అని అనుజ్‌ను ఓ విలేఖరి ప్రశ్నించారు.

దానికి జవాబుగా అనుజ్, "వారికి అనుమానాలు కలిగిన మాట నిజమే. ఇప్పుడు వారికి కూడా ఎలాంటి అనుమానాలు లేవు" అని చెప్పారు.

అనుజ్ కుటుంబ స్నేహితుడైన ఓ వ్యక్తి సమావేశంలో ఇలా అన్నారు: "ఈ కుటుంబ సభ్యులను వేధించవద్దని నేను ఎన్‌జీవోలకూ, న్యాయవాదులకూ, రాజకీయ నాయకులకూ విజ్ఞప్తి చేస్తున్నా. వీరు గత మూడేళ్లుగా బాధ పడుతున్నారు. బీహెచ్ లోయా మృతిపై ఎలాంటి వివాదం లేదు. ఈ విషయంలో మీడియా సహకారం కోరుకుంటున్నాం. దీని నుంచి లబ్ధి పొందాలని ఎవరూ ప్రయత్నించొద్దని మేం కోరుకుంటున్నాం."

Image copyright OFFICE OF RGV TWITTER

'ద కారవాన్' కథనం అచ్చయిన తర్వాత, లోయా మృతిపై విచారణ జరిపించాలని రిటైర్డ్ న్యాయమూర్తి ఏపీ షా డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కోర్టు ఆ పిటిషన్ విచారణను జనవరి 15కు వాయిదా వేసింది.

శుక్రవారం నాడు నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. 'తీవ్ర పరిణామాలుండే అవకాశాలున్న కేసులను పారదర్శకత లేకుండా కేటాయిస్తున్నారని' నలుగురు న్యాయమూర్తులు విమర్శలు చేశారు.

తాము లేవనెత్తుతున్న ఫిర్యాదుల్లో జస్టిస్ లోయా మృతి కేసు కూడా ఉందా అని విలేఖరులు వారిని ప్రశ్నించగా, నలుగురు న్యాయమూర్తుల్లో ఒకరు "అవును" అని జవాబిచ్చారు.

ఈ కేసును కాంగ్రెస్ పార్టీ కూడా లేవనెత్తింది. జస్టిస్ లోయా మృతిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం నాడు డిమాండ్ చేశారు.

అంతకు ముందు, బహ్రెయిన్‌ పర్యటన సందర్భంగా మాట్లాడుతూ, తీవ్రమైన కేసుల విచారణ జరిపే న్యాయమూర్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)