సీజేకు రిటైర్డు జడ్జిల లేఖ: 'ప్రధాన కేసులన్నీ సీనియర్ల రాజ్యాంగ ధర్మాసనానికే'

  • 14 జనవరి 2018
జస్టిస్ దీపక్ మిశ్రా Image copyright NALSA.GOV.IN
చిత్రం శీర్షిక జస్టిస్ దీపక్ మిశ్రా

కేసుల కేటాయింపు, ఇతర అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ దీపక్ మిశ్రాకు నలుగురు రిటైర్డు జడ్జిలు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. కేసుల కేటాయింపునకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు తీసుకురావాలని, వాటిని తీసుకొచ్చే వరకు ముఖ్యమైన, సున్నితమైన కేసులన్నీ ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని ఆయనకు సూచించారు.

లేఖ రాసిన వారిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీబీ సావంత్, దిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజిత్ ప్రకాశ్ షా (ఏపీ షా), మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె. చంద్రు, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి హెచ్. సురేశ్ ఉన్నారు.

ధర్మాసనాలకు కేసుల కేటాయింపులో హేతుబద్ధమైన, నిష్పాక్షికమైన, పారదర్శకమైన విధానాన్ని అనుసరించాలని ప్రధాన న్యాయమూర్తికి వీరు సూచించారు. కీలకమైన, సున్నితమైన కేసుల్లో కోరుకొన్న ఫలితం వెలువడేలా అధికార దుర్వినియోగమేదీ జరగడం లేదనే భరోసాను ప్రజలకు కల్పించాలంటే ఇదొక్కటే మార్గమని తెలిపారు.

సుప్రీంకోర్టులో కీలకమైన, సున్నితమైన కేసులు తామనుకున్న జూనియర్ న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాలకే వెళ్లేలా ఏకపక్షంగా కేసుల కేటాయింపు జరగకూడదని వారు వ్యాఖ్యానించారు.

Image copyright SAJJAD HUSSAIN/AFP/Getty Images)
చిత్రం శీర్షిక సుప్రీంకోర్టు

దేశ చరిత్రలో తొలిసారిగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ మీడియా సమావేశం నిర్వహించి, కేసుల కేటాయింపు తీరు, ఇతర అంశాలపై తమ అభ్యంతరాలను వ్యక్తంచేసిన రెండు రోజులకే తాజా పరిణామం చోటుచేసుకొంది.

కేసుల కేటాయింపు ముఖ్యంగా సున్నితమైన కేసుల కేటాయింపు తీరుకు సంబంధించి ఆ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు తీవ్రమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చారని తమ లేఖలో రిటైర్డు న్యాయమూర్తులు ప్రస్తావించారు.

కేసులు సరైన పద్ధతిలో కేటాయించడం లేదనీ, తాము కోరుకున్న ధర్మాసనాలకు అందులోనూ తరచూ జూనియర్ న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనాలకు ఏకపక్షంగా కేసులు కేటాయిస్తున్నారని చెబుతూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు (జస్టిస్‌లు జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ లోకూర్, కురియన్ జోసెఫ్) తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారని రిటైర్డు జడ్జిలు పేర్కొన్నారు.

న్యాయ నిర్వహణ, చట్టబద్ధ పాలనపై ఈ పరిస్థితి హానికర ప్రభావాన్ని చూపుతోందని వీరు ఆందోళన వ్యక్తంచేశారు.

Image copyright Supreme Court
చిత్రం శీర్షిక సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్

'వారితో ఏకీభవిస్తున్నాం'

రోస్టర్ విధానం ప్రకారం కేసుల కేటాయింపులో నిర్ణయాధికారం ప్రధాన న్యాయమూర్తిదే అయినప్పటికీ ఇది ఏకపక్షంగా జరగడకూదన్న నలుగురు సీనియర్ న్యాయమూర్తుల వాదనతో తాము ఏకీభవిస్తున్నామని రిటైర్డు న్యాయమూర్తులు లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉందని చెప్పారు.

సహేతుకంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా కేసుల కేటాయింపునకు వీలుగా స్పష్టమైన నియమ నిబంధనలను నిర్దేశించాలని వీరు చెప్పారు. న్యాయవ్యవస్థపై, సుప్రీంకోర్టుపై ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి కల్పించేందుకు తక్షణం ఈ చర్య చేపట్టాల్సి ఉందని తెలిపారు.

ఈ చర్య చేపట్టే వరకు ప్రధానమైన, సున్నితమైన కేసులన్నీ ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనమే చేపట్టాలని రిటైర్డు జడ్జిలు సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఇలాంటి కేసుల విషయంలోనూ ఇలాగే చేయాలని చెప్పారు.

''ఇలాంటి చర్యలు చేపడితేనే సుప్రీంకోర్టు నిష్పాక్షికంగా, పారదర్శకంగా పనిచేస్తోందనే, రోస్టర్ విధానంపై ప్రధాన న్యాయమూర్తికి ఉన్న నిర్ణయాధికారం ముఖ్యమైన, సున్నితమైన కేసుల్లో కోరుకొన్న ఫలితం వెలువడేలా దుర్వినియోగం కావడం లేదనే భరోసా ప్రజలకు ఉంటుంది. అందుకే ఈ విషయంలో తక్షణ చర్యలు చేపట్టాలని మిమ్మల్ని కోరుతున్నాం'' అని ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి వీరు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు