అభిప్రాయం: కశ్మీర్‌పై భారతదేశానికి ఇజ్రాయెల్ దారి చూపిస్తోందా?

  • 15 జనవరి 2018
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు, భారత ప్రధాని నరేంద్ర మోదీ Image copyright Twitter/pib
చిత్రం శీర్షిక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు, భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఇజ్రాయెల్‌తో సాంప్రదాయంగా వస్తున్న భద్రతాపరమైన సంబంధాలను భారతీయ జనతా పార్టీ పటిష్టం చేసుకోవాలనుకుంటోంది.

జూన్ 14, 2000న నాటి హోం మంత్రి ఎల్ కే అడ్వాణీ ఇజ్రాయెల్‌ను సందర్శించినపుడు, ఆయన తన వెంట ముఖ్యమైన భద్రతాధికారులను కూడా తీసుకెళ్లారు. అలాంటి సంఘటన గతంలో ఎన్నడూ జరగలేదు.

అప్పుడు ఇజ్రాయెల్‌లో తీవ్రవాద అణచివేత చర్యలకు పేరొందిన రావెన్ పెజ్.. గతంలో పాలస్తీనా 'స్వాతంత్ర్య యోధుల'పై (స్వాతంత్ర్యాన్ని డిమాండ్ చేస్తున్న నిరసనకారులు) ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన దేశాలన్నీ, ఇప్పుడు క్యూలో నిలబడి అలాంటి 'స్వాతంత్ర్య యోధుల'తో వ్యవహరించే విధానాలను తమ దేశం నుంచి నేర్చుకుంటున్నాయని అన్నారు.

Image copyright Getty Images

ట్రంప్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ఓటు

గత ఏడాది (2017) ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఇజ్రాయెలీల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.

అయితే, డిసెంబర్, 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెరూసలేంను ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తించాలన్న ప్రతిపాదన తెచ్చినపుడు భారతదేశం ఐక్యరాజ్యసమితిలో దానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. భారత్ చర్య ఇజ్రాయెల్‌ను నిరాశకు గురి చేసింది.

జనవరి 4న ఇజ్రాయెలీ వార్తాపత్రిక 'హారెట్జ్' దీనిపై, 'భారత్‌ నిజంగా ఇజ్రాయెల్‌తో బలమైన సంబంధాలు కోరుకోవడం లేదు' అని వ్యాఖ్యానించింది.

భారత-ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు 'ఆకర్షణ'తో ప్రారంభమై, 'ప్రేమ' వరకు చేరుకుని, ఇప్పుడు 'ఇజ్రాయెల్ వ్యతిరేక' దశకు చేరుకున్నాయని ఆ పత్రిక విశ్లేషించింది. భారత దేశానికి అరబ్, ముస్లిం దేశాలతో అన్యోన్య సంబంధాలు నెలకొల్పుకోవాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో తమ దేశంలోని ముస్లింలలోనూ సామరస్య వాతావరణాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

సౌదీ అరేబియా-అమెరికా-ఇజ్రాయెల్‌ల ఉగ్రవాద వ్యతిరేక విధానాల వల్ల భారత విధానకర్తలు సమస్యలు ఎదుర్కొంటున్నారని పత్రిక అభిప్రాయపడింది.

Image copyright Twitter/pib

'కశ్మీర్‌లో ఇజ్రాయెలీ విధానాలు'

2014 నుంచి, పాలస్తీనా మద్దతుదారుల పట్ల ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాన్నే బీజేపీ.. భారతదేశం పరిపాలన కింద ఉన్న కశ్మీర్‌లో అనుసరిస్తోంది.

మే 14, 2017న బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ఉన్న ప్రతి తీవ్రవాదిని అంతం చేస్తామని అన్నారు. ఇజ్రాయెల్ తరహాలోనే సరిహద్దుల్లో దాడులను కూడా ప్రస్తావించారు.

అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా కశ్మీర్ లోయలో పరిస్థితి మాత్రం చక్కబడలేదు. రాళ్లు విసిరే మూకలతో పాటు, తీవ్రవాదులతో వ్యవహరించే విధానాలూ ఫలితాన్ని ఇవ్వడం లేదు. పెల్లెట్ గన్‌లతో భారతదేశం తన సొంత పౌరులనే అంధులను చేస్తోందంటూ అంతర్జాతీయ మీడియాలో కూడా భారత సైన్యం తీరుపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

గత ఏడాది బుర్హాన్ వాని మరణాంతరం, భారత భద్రతా బలగాలపై దాడులు పెరిగిపోయాయి. 2016 వరకు మావోయిస్టుల దాడిలో మరణించిన భద్రతా బలగాల సంఖ్య ఎక్కువగా ఉంటే, 2016 తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఈ సంఖ్య మావోయిస్టు ప్రాంతాలలో కన్నా పెరిగింది.

Image copyright AFP

తీవ్రవాదులకు సాధారణ ప్రజానీకం మద్దతు

సాధారణ ప్రజలు కూడా తిరుగుబాటులో పాల్గొంటుండడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. బుర్హాన్ వాని మరణాంతరం, ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావడం, సైన్యానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించడం పెరిగింది.

జనవరి 8, 2018 న బుడ్గావ్ జిల్లాలో ముగ్గురు తీవ్రవాదుల మరణాంతరం, సాధారణ ప్రజలు ప్రదర్శన నిర్వహించారు. ఇలా తీవ్రవాదులకు మద్దతుగా సాధారణ ప్రజలు ప్రదర్శనలు నిర్వహించడం ఆఫ్గానిస్తాన్, సిరియా, ఇరాక్ లాంటి తీవ్రవాద సమస్యను ఎదుర్కొన్న దేశాలలో కూడా కనిపించదు. ఇజ్రాయెలీ సరిహద్దుల్లో, ఇజ్రాయెలీల ఆక్రమణను వ్యతిరేకించే పాలస్తీనాలో మాత్రమే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది.

కశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ జులై 28, 2017న మాట్లాడుతూ.. త్వరలో కశ్మీర్ లోయలో సైన్యానికి, పోలీసులకు యువత భయపడే పరిస్థితి ఉండదన్నారు.

బీజేపీ నేత యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని కొందరు నేతలు, కశ్మీర్ సమస్యపై అక్కడి ప్రజల్లో రోజురోజుకీ అసహనం పెరిగిపోతోందన్నారు. ప్రదర్శనల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందన్న భారత ప్రభుత్వ వాదననూ వారు వ్యతిరేకించారు.

ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంలో ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా జనవరి 8, 2018న - కేవలం చర్చల ద్వారా మాత్రమే కశ్మీర్ సమస్య పరిష్కారమౌతుందని అన్నారు.

భారత ప్రభుత్వం కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మాజీ ఐబీ చీఫ్ దినేశ్వర్ శర్మను నియమించిన నేపథ్యంలో, ఇజ్రాయెలీ ప్రధాని బెంజమిన్ నెతాన్యహూ పర్యటన సందర్భంగా కశ్మీర్‌లో భద్రతాపరమైన అంశాలపై చాలా చర్చలే జరిగే అవకాశం ఉందని భావించడం అసందర్భం కాదేమో.

(ఈ అభిప్రాయలు రచయిత వ్యక్తిగతమైనవి)

(రచయిత కేబినెట్ సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శిగా పని చేసారు. 26/11దాడుల్లో పోలీసుల ప్రదర్శనపై విచారణ కోసం నియమించిన హై లెవల్ కమిటీలో కూడా ఆయన సభ్యులు.)

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)