నన్ను ఎన్‌కౌంటర్ చేసే కుట్ర జరుగుతోంది: తొగాడియా

 • 16 జనవరి 2018
ప్రవీణ్ తొగాడియా Image copyright Getty Images

విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అహ్మదాబాద్‌లోని చంద్రమణి ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు.

''నన్ను ఎన్‌కౌంటర్ చేయడానికి కుట్ర జరుగుతోంది. ఈ విషయం నాకు తెలియగానే, నాకున్న జెడ్ సెక్యూరిటీకి విషయాన్ని తెలియజేసి నేను సరాసరి ఎయిర్‌పోర్టుకు బయలుదేరాను. నేను శాలువా కప్పుకున్నాను కాబట్టి ఎవరూ నన్ను గుర్తించలేదు. నన్ను ఎవరు ఆసుపత్రికి తీసుకువచ్చారో నాకు తెలీదు. నేను హిందువులను ఏకం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను అణగదొక్కాలనుకుంటున్నారు'' అని తొగాడియా ఆరోపణలు చేశారు.

ప్రవీణ్ తొగాడియా చికిత్స పొందుతున్న అహ్మదాబాద్‌లోని చంద్రమణి ఆసుపత్రికి చెందిన డాక్టర్ రూపకుమార్ అగర్వాల్, ''తొగాడియాను ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువచ్చే సరికి ఆయన స్పృహలో లేరు. ఆయన షుగర్ లెవల్ కూడా పడిపోయింది. ఆ సమయంలో ఆయన మాట్లాడే స్థితిలో లేరు. అయితే ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు'' అని బీబీసీకి తెలిపారు.

Image copyright Getty Images

తొగాడియా మాట్లాడిన ముఖ్య విషయాలు:

 • నేను హిందువుల ఐక్యత కోసం కృషి చేస్తున్నాను. రామమందిరం, గోహత్యకు పాల్పడే వారిని శిక్షించేందుకు చట్టం, కాశ్మీరీ హిందువులను రక్షించాలని హిందువులు కోరుతున్నారు. వారి తరపున నేను వాటిని లేవనెత్తుతున్నాను. నా గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు.
 • నేను దేశం కోసం 10 వేల మంది డాక్టర్లను తయారు చేశాను. సెంట్రల్ ఐబీ వాళ్లను బెదిరించడానికి ప్రయత్నిస్తోంది.
 • నా గొంతును నొక్కేసే ప్రయత్నాల గురించి నేను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాను.
 • నాపై పాత కేసులన్నీ తిరగదోడుతున్నారు. మకర సంక్రాంతి రోజున రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేసేందుకు నాన్ బెయిలబుల్ వారెంట్‌తో నా వెంట పడ్డారు.
Image copyright Getty Images
 • ఆరెస్సెస్‌కు చెందిన భయ్యాజీ జోషీతో కలిసి మకర సంక్రాంతి జరుపుకుని రాత్రి ఒంటి గంటకు తిరిగి వచ్చా.
 • ఉదయం నేను పూజ చేసుకుంటుండగా, ఒక వ్యక్తి నా గదిలోకి ప్రవేశించి, వెంటనే ఆఫీసు వదిలి వెళ్లిపోండి అన్నాడు. లేకుంటే మిమ్మల్ని ఎన్‌కౌంటర్ చేస్తారు అన్నాడు.
 • నేను అతను చెప్పిన విషయాన్ని నమ్మలేదు. కానీ నాకు వచ్చిన ఫోన్‌తో నాకు అనుమానం కలిగింది. నేను లాయర్లు, స్నేహితులతో మాట్లాడితే వాళ్లు, కోర్టులో సరెండర్ కమ్మని సలహా ఇచ్చారు.
 • నేను వాళ్ల మాటలను పెద్దగా పట్టించుకోలేదు. నేను బయట చూసేసరికి ఇద్దరు పోలీసులు కనిపించారు.
 • నాకు ఏదైనా జరిగితే దాని వల్ల దేశంలోని వాతావరణం కూడా అల్లకల్లోలం కావచ్చు. నేను వెంటనే బయలుదేరి నా కార్యకర్తలను వెంట పెట్టుకుని బయలుదేరాను.
 • రాజస్థాన్ హోం మంత్రికి ఫోన్ చేసాను. వాళ్లకు ఈ విషయం గురించి తెలియదు. నేను అన్ని ఫోన్‌లను స్విచాఫ్ చేశాను.
Image copyright Getty Images

ఇంతకూ విషయమేంటి?

ఓ అల్లర్ల కేసులో రాజస్థాన్‌లోని గంగాపూర్ కోర్టు తొగాడియాకు సమన్లు జారీ చేసింది. వారెంటు జారీ చేసిన తర్వాత కూడా ఆయన పలుమార్లు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంటు జారీ అయింది.

సోమవారం రాజస్థాన్ పోలీసులు, అహ్మదాబాద్‌లోని సోలా పోలీసులతో కలిసి ఆయనను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా, ఆయన ఇంటిలో కనిపించకపోవడంతో వారు తిరిగి వెళ్లిపోయారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు