నరేంద్ర మోదీ, ప్రవీణ్ తొగాడియాల దోస్తీ ఎక్కడ బెడిసి కొట్టింది?

  • ప్రశాంత్ దయాళ్
  • బీబీసీ కోసం
మోదీ - తొగాడియా

ఫొటో సోర్స్, AFP

అహ్మదాబాద్‌లోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయం నుంచి అదృశ్యమైన ఫైర్ బ్రాండ్ నేత ప్రవీణ్ తొగాడియా పది గంటల తర్వాత అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో స్పృహ లేని స్థితిలో కనిపించారు.

అహ్మదాబాద్, రాజస్థాన్ పోలీసులు కలిసి తనను 'ఎన్‌కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నార'ని తొగాడియా అన్నారు. దీనికి సంబంధించిన సమాచారం అందగానే, తాను తన కార్యాలయాన్ని వదిలి వెళ్లిపోయినట్లు తెలిపారు.

మంగళవారం ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యక్షంగా ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకుండానే, కేంద్ర ప్రభుత్వం తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని, తనను బెదిరిస్తోందని ఆరోపించారు.

కానీ చాలా ఏళ్ల క్రితం మోదీ-తొగాడియాల స్నేహం ఎంత బలంగా ఉండేదంటే, దాని గురించి గుజరాత్ బయట కూడా చర్చించుకునేవారు.

35 ఏళ్ల క్రితం మోదీ, తొగాడియా ఇద్దరూ కూడా అహ్మదాబాద్‌లో ఆరెస్సెస్ యూనిఫామ్ వేసుకుని, 'సదా వాత్సల్య మాతృభూమి..' అని ప్రార్థన గీతాలు పాడారు.

బీజేపీకి చెందిన మాజీ మంత్రి జనక్ పురోహిత్ పాత రోజులను గుర్తు చేసుకుంటూ.. 1978లో ప్రవీణ్ తొగాడియా తన స్వస్థలం నుంచి మెడిసిన్ చదువుకునేందుకు బీజే మెడికల్ కాలేజీకి వచ్చారని బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

తొగాడియా-మోదీల పరిచయం

మెడికల్ విద్యార్థిగా ఉన్న తొగాడియాకు మొదటి నుంచి హిందుత్వవాదంపై, ప్రచారంపై ఆసక్తి ఉండేది. ఆయన సంఘ్‌కు వెళ్లగా అక్కడ ఆయనకు నరేంద్ర భాయ్ మోదీతో పరిచయమైంది.

1980లలో వారిద్దరూ స్నేహితులయ్యారు. సైద్ధాంతికంగా ఒకే భావజాలం కలిగిన వారు కావడంతో ఆ స్నేహం మరింత బలపడింది.

మెడిసిన్ పూర్తయ్యాక తొగాడియా ప్రాక్టీస్ ప్రారంభించారు. అయినా సంఘ్‌తో ఆయన అనుబంధం కొనసాగింది.

1985లో అహ్మదాబాద్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగినపుడు, ప్రవీణ్ తొగాడియాకు విశ్వహిందూ పరిషత్ బాధ్యతలు అప్పగించారు. ఆ అల్లర్లలో హిందూ బాధితులకు సహాయం చేయడంతో పాటు, తొగాడియా ఇతర బాధ్యతలు కూడా తీసుకున్నారు.

తొగాడియా విశ్వహిందూ పరిషత్‌లో ఉండగా, మోదీ సంఘ్‌లో కొనసాగారు. కానీ వారి ప్రతి అడుగూ ఒకే దిశలో కలిసే సాగింది.

ఫొటో సోర్స్, Getty Images

మతఘర్షణల తర్వాత తొగాడియా వీహెచ్‌పీలో హిందువులను చేర్చే బాధ్యతను స్వీకరించారు.

తొగాడియా కార్యక్రమాలతో వీహెచ్‌పీ, సంఘ్ రెండూ ప్రభావితమయ్యాయి. దాంతో వీహెచ్‌పీలో ఆయన గుజరాత్ ప్రముఖ్‌గా ఎదిగారు.

1990లలో రామజన్మభూమి ఉద్యమం ప్రారంభంతో ప్రవీణ్ తొగాడియా పేరు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించడం ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Getty Images

కేశూభాయ్ సర్కార్‌లో చక్రం తిప్పిన మోదీ, తొగాడియాలు

దానికి ముందు 1987లో నరేంద్ర మోదీ కూడా సంఘ్‌ను వదిలిపెట్టి, బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.

1990లో, 1995-98 మధ్య కాలంలో గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి రావడంలో మోదీ, తొగాడియాలు ఇద్దరూ ముఖ్య పాత్ర పోషించారని గుజరాత్ సీనియర్ జర్నలిస్ట్ నరేందర్ శర్మ బీబీసీకి తెలిపారు. అప్పటివరకు వారిద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు.

1995లో బీజేపీ గుజరాత్‌లో అధికారంలోకి వచ్చినపుడు కేశుభాయ్ పటేల్ సీఎం అయ్యారు. అయితే ప్రతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఆయన మోదీ, ప్రవీణ్ తొగాడియాలను సంప్రదించేవారు.

అహ్మదాబాద్‌లోని సోలాలో తొగాడియా బంగ్లా ఎదుట ఎర్రబుగ్గ కార్లు వరుసగా నిలిచి ఉండేవి. ఇలా మోదీ, తొగాడియాలు ప్రభుత్వంలో భాగం కాకున్నా, పగ్గాలు మాత్రం వాళ్ల చేతుల్లోనే ఉండేవి. ఇది గుజరాత్ అధికారులందరికీ బాగా తెలుసు.

అప్పటికే ప్రవీణ్ తొగాడియా ప్రతిష్ఠ పెరగడం ప్రారంభించింది. ప్రభుత్వం ఆయనకు జెడ్ సెక్యూరిటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రుల కాన్వాయ్‌లో ఉన్నట్లే ఆయన కాన్వాయ్‌లోనూ ఆంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్ ఉండేవి.

1998లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చినపుడు, ఆయన ప్రాభవం అలాగే కొనసాగింది. డిసెంబర్ 2002లో తొగాడియా బీజేపీ తరపున 100కు పైగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

పదవీకాంక్ష వర్సెస్ స్నేహం

మోదీ 2002లో సీఎంగా మారాక పరిస్థితి మారింది. ప్రవీణ్ తొగాడియాకు ఇచ్చిన ప్రభుత్వ సదుపాయాలన్నీ ఆయన వెనక్కి తీసుకున్నారు.

నరేంద్ర శర్మ మాటల్లో చెప్పాలంటే, మోదీ ప్రభుత్వం తనకు ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వకపోవడాన్ని తొగాడియా భరించలేకపోయారు. దీంతో 2002 తర్వాత వాళ్లిద్దరి మధ్యా అడ్డుగోడ పుట్టుకొచ్చింది.

అయితే, నరేంద్ర మోదీ, ప్రవీణ్ తొగాడియాలు ఇద్దరూ పదవీ కాంక్షతోనే దూరం అయ్యారని గుజరాత్ సీనియర్ జర్నలిస్ట్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ మాజీ ఎడిటర్ డాక్టర్ హరి దేశాయ్ అంటారు.

వారిద్దరి లక్ష్యం ప్రధాని కావాలనేదే. మోదీ ఆ లక్ష్యాన్ని సాధించగా, ప్రవీణ్ తొగాడియా అక్కడికి చేరుకోలేకపోయారు. ప్రస్తుతం ఆయన ఆగ్రహానికి కారణం అదే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)