ఇచట వృద్ధులకు పెళ్లిళ్లు చేయబడును!

  • 17 జనవరి 2018
వృద్ధుల వివాహం Image copyright BBC/Sangeetham Prabhakar

అరవై ఏళ్ల వయసులో పెళ్లా? కొందరికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. మరికొందరు ఈ తరహా వివాహాలను ఒకటీ అరా చూస్తే చూసి ఉండొచ్చు.

ఏది ఏమైనప్పటికీ పెళ్లి అనేది కేవలం ఒక వయసు ముచ్చటే కాదు. తోడు ఎవరికైనా అవసరమే. ఒంటరితనాన్ని భరించలేని వృద్ధులు, జీవిత చరమాంకంలోనూ తోడును కోరుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ ధోరణి క్రమంగా పెరుగుతోంది.

ఇలాంటి ఒంటరితనమే ఓ మహిళను వేధించింది. తన అనుభవ సారాన్నే పెట్టుబడిగా పెట్టి వృద్ధుల కోసం ఆమె ఒక మ్యారేజీ బ్యూరోను ప్రారంభించారు. ఆమె పేరు రాజేశ్వరి. ఆ సంస్థ పేరు "తోడునీడ". 2010లో ఈ సంస్థ ప్రారంభమైంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఅరవై ఏళ్ల వయసులో పెళ్లా? కొందరికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు.

వేధిస్తున్న ఒంటరితనం

ప్రస్తుత ప్రపంచంలో ఎవరికీ స్థిమితం లేదు. అందరివీ ఉరుకులపరుగుల జీవితాలే. బతుకుదెరువు కోసం పిల్లలు పొలిమేర దాటి పోతున్నారు. కన్నవాళ్లతో కలిసి ఉండలేని స్థితిలోకి జారి పోతున్నారు.

ఫలితంగా వృద్ధ్యాప్యంలోని తల్లిదండ్రులు ఒకరికొకరు తోడుగా జీవించాల్సి వస్తోంది. వీరిలో ఏ ఒక్కరు దూరమైనా మిగతా వారి జీవితం దుర్భరంగా మారుతోంది. ఒంటరితనం తీవ్రంగా వేధిస్తోంది.

స్మార్ట్‌ఫోన్ల తెరలపై కన్నబిడ్డలను తడుముకోవాల్సిందే కానీ అలసిన మనసుకు వారి ఆసరా లభించదు. మనుమలు, మనుమరాళ్ల అల్లరి చేష్టలను కంప్యూటర్ తెరలపై చూడాల్సిందే కానీ వారిని ముద్దు చేసే భాగ్యం దక్కదు.

ఇలా ఒంటరితనం కాస్త మనోవేదనకు దారి తీస్తోంది. ఇది శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతోంది.

Image copyright BBC/Sangeetham Prabhakar
చిత్రం శీర్షిక వృద్ధుల వివాహాలకు పిల్లల సహకారం కావాలని రాజేశ్వరి అంటున్నారు

'ఎగతాళి చేశారు'

వృద్ధుల కోసం ఒక వివాహ వేదికను ప్రారంభించాలన్న తన కల అంత సులభంగా సాకారం కాలేదని రాజేశ్వరి చెబుతున్నారు.

"బంధువులు, స్నేహితులు చివరకు ఈ సమాజం కూడా నన్ను గేలి చేసింది. ఆ వయసులో ఇదేం ఆలోచన అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే నన్ను వెలి వేశారు" అంటూ గత జ్ఞాపకాలను రాజేశ్వరి తలచుకున్నారు.

Image copyright BBC/Sangeetham Prabhakar

'ఉచితంగానే'

50 ఏళ్లు పైబడిన వారికి ఈ మ్యారేజీ బ్యూరో ద్వారా సంబంధాలు చూస్తారు.

జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు లేదా చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నవారు ఇందుకు అర్హులు.

"మా ద్వారా వృద్ధులు తమ అభిరుచులకు తగిన వ్యక్తులను కలుసుకోవచ్చు. ఇందుకు ఎటువంటి రుసుమూ తీసుకోం" అని రాజేశ్వరి అన్నారు.

Image copyright BBC/Sangeetham Prabhakar
చిత్రం శీర్షిక సత్యనారాయణతో వివాహం తరువాత సంతోషంగా ఉన్నట్లు ఇందిర చెబుతున్నారు

'చాలా ఆనందంగా ఉన్నా'

ఆమె పేరు ఇందిర. వయసు 65 సంవత్సరాలు. ఈ వయసులో వివాహం చేసుకున్నారు.

తన భర్త తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని, తన బాగోగుల విషయంలో ఎంతో శ్రద్ధ చూపుతున్నాడని ఇందిర చెబుతున్నారు.

ఈ పెళ్లి తరువాత తాను చాలా ఆనందంగా ఉన్నట్లు తెలిపారు.

Image copyright BBC/Sangeetham Prabhakar

'మళ్లీ అమ్మ దొరికింది'

ఆయన పేరు సత్యనారాయణ కపూర్. వయసు 69 ఏళ్లు. ఇందిరను పెళ్లి చేసుకుంది ఈయనే.

భార్యను కోల్పోయి ఒంటరితనం వేధిస్తున్న తరుణంలో ఈ వివాహం చేసుకున్నట్లు ఆయన చెబుతున్నారు.

ఇందుకు తన కూతురు ఎంతగానో సహకరించినట్లు తెలిపారు.

ఈ పెళ్లి వల్ల తన పిల్లలు కూడా సంతోషంగా ఉన్నట్లు ఆనందం వ్యక్తం చేశారు.

యవ్వనంలోనే కాదు వృద్ధాప్యంలోనూ పెళ్లి అవసరమేనని సత్య నారాయణ అంటున్నారు.

ఈ విషయంలో వృద్ధులు సమాజానికి భయపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

Image copyright BBC/Sangeetham Prabhakar

'పిల్లల సహకారం ముఖ్యం'

వృద్ధాప్యంలో వివాహాలకు కేవలం 10 శాతం మంది పిల్లలు మాత్రమే సహకరిస్తున్నారని రాజేశ్వరి చెబుతున్నారు.

తమ తల్లిదండ్రుల వివాహాలను ఆపడానికి ప్రయత్నించే పిల్లలు ఇప్పటికీ ఉన్నట్లు తెలిపారు.

తల్లిదండ్రులు తమ నుంచి దూరం అవుతారనో లేక ఆస్తిలో వాటా అడుగుతారేమో అనే భయాలు పిల్లలను వెంటాడటమే ఇందుకు ప్రధాన కారణాలని రాజేశ్వరి వివరించారు.

'ఆస్తి కోసం కాదు'

మలి వయసులో వివాహాలు ఆస్తిపాస్తుల కోసం చేసుకోరని రాజేశ్వరి అంటున్నారు.

కేవలం తోడు కోసమే చేసుకుంటారని ఆమె చెబుతున్నారు.

ఈ విషయాన్ని పిల్లలు అర్థం చేసుకుంటే వృద్ధ్యాప్య వివాహాలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 150 మంది వృద్ధులు ఒకటైనట్లు రాజేశ్వరి చెప్పారు.

Image copyright BBC/Sangeetham Prabhakar

మార్పు రావొచ్చు

వృద్ధాప్యంలో వివాహాలపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు.

సమాజం భిన్నంగా చూడొచ్చు. అయితే వయసు ఏదైనా ఒంటరి జీవితం మాత్రం కష్టమేనన్నది నిర్వివాదం.

ఒకనాడు వితంతు వివాహాలను వ్యతిరేకించిన సమాజమే నేడు వాటిని ఆహ్వానిస్తోంది.

వృద్ధుల వివాహాల పట్ల సమాజం తీరులోనూ భవిష్యత్తులో మార్పు రావొచ్చు.

బహుశా ఏదో ఒకనాడు మా నాన్నకు పెళ్లి లేదా మా అమ్మకు పెళ్లి అంటూ శుభలేఖలు పట్టుకు వచ్చే పిల్లలను మనం చూడచ్చేమో!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)