అభిప్రాయం: హజ్ సబ్సిడీ నిజంగా ముస్లింలకా, విమానయాన కంపెనీలకా?

  • 17 జనవరి 2018
కాబా వద్ద హజ్ యాత్రికులు Image copyright Getty Images

హజ్ సబ్సిడీని నిలిపివేయటం నిజంగా సంతోషకరమే. అయితే ఈ హజ్ సబ్సిడీకి సంబంధించి జరుగుతున్న చర్చలు, వాదోపవాదాల్లో కొన్ని ప్రాథమిక వాస్తవాలు లోపించాయి.

మొట్టమొదటి అంశం.. భారతదేశంలోని ముస్లింలో ఎన్నడూ సబ్సిడీ ఇవ్వాలని అడగలేదు. హజ్ సబ్సిడీని రద్దు చేయాలని సయ్యద్ షాహబుద్దీన్ నుంచి మౌలానా మహమూద్ మదానీ, అసదుద్దీన్ ఒవైసీ, జఫరుల్ ఇస్లాం ఖాన్‌ల వరకూ పలువురు ముస్లిం నాయకులు, ప్రముఖులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

రెండో విషయం.. ఎన్నో ఏళ్లుగా ఈ సబ్సిడీని విమానయాన సంస్థకు ఇస్తున్నారు కానీ ముస్లిం ప్రజలకు కాదు. సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించే హజ్ యాత్రికుల కోసం విమాన టికెట్ ధర మీద భారత ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. హజ్ కోసం ప్రయాణమయ్యే ఒక్కో యాత్రికుడికి సుమారు రూ. 10,000 స్వల్ప మొత్తాన్ని భారత ప్రభుత్వం మంజూరు చేసింది.

కానీ ఆచరణలో ఈ మొత్తాన్ని ఎన్నడూ హాజీలకు (యాత్రికులకు) నేరుగా చెల్లించలేదు. దీనిని ఎయిర్ ఇండియాకు బదిలీ చేసింది. మరో విధంగా చెప్పాలంటే.. ఎయిర్ ఇండియాపై భారం తగ్గించటానికి ఈ నగదు సాయం చేశారు కానీ యాత్రికుల భారం తగ్గించటానికి కాదు.

Image copyright Getty Images

రాజకీయంగా చూస్తే.. ఎమర్జెన్సీ అనంతర కాలంలో ముస్లిం ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవాలని భావించిన ఇందిరాగాంధీ మానసపుత్రికే ఈ హజ్ సబ్సిడీ.

ఆ కాలంలో చమురు సంక్షోభం కారణంగా హజ్ సంబంధిత రవాణా ధరలు కూడా ఆకాశాన్నంటాయి. ఆనాడు తాత్కాలిక చర్యగా హజ్ సబ్సడీని ప్రవేశపెట్టారు.

అయితే మైనారిటీలను అధికారికంగా ‘సంతృప్తిపరచే చర్య’ అనే ఆరోపణ అప్పటి నుంచీ కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో ముస్లింల సామాజిక ఆర్థిక జీవనాన్ని మెరుగుపరచటానికి పటిష్ట చర్యలు చేపట్టటానికి బదులుగా ఈ ’నామమాత్రపు చర్యల’కే ఇందిర, కాంగ్రెస్ పార్టీలు ప్రాధాన్యతనిచ్చాయి.

కాంగ్రెస్ నాయకత్వం ఆర్భాటంగా ముస్లింలైన జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌లను రాష్ట్రపతులను చేసింది. కానీ.. దేశంలో ముస్లిం మైనారిటీలకు ఉద్యోగాలు, భద్రత కల్పించాలని సిఫారసులు చేసిన రామ్ సహాయ్ కమిషన్, శ్రీకృష్ణ కమిషన్, గోపాల్‌సింగ్ కమిషన్, సచార్ కమిటీల నివేదికలను అమలు చేయకుండా పక్కనపెట్టింది.

దేశంలో మితవాద భావజాలం బలపడటంతో హజ్ సబ్సిడీ అనేది ముస్లింలకు వ్యతిరేకంగా ఉపయోగించే ఓ ముఖ్యాంశంగా మారింది.

లక్షలాది మంది జనం తిండి, చదువు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు లేక కునారిల్లుతోంటే ముస్లింల హజ్ యాత్ర కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ‘‘లౌకిక’’ పార్టీలు గుమ్మరిస్తున్నాయంటూ వాట్సాప్ మెసేజీల్లో, కరపత్రాల్లో ప్రచారం, వదంతులు సాగుతున్నాయి.

ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత అనే దానిని కనీసం వాదన కోసమైనా ఎన్నడూ ప్రముఖంగా ప్రస్తావించటమో, చర్చించటమో ఎవరూ చేయలేదు.

Image copyright kmy.gov.in

హిందువులు, సిక్కుల తీర్థయాత్రలకు ప్రభుత్వ సబ్సిడీల విషయం కానీ, ఆలయాల అభివృద్ధి కోసం కానీ, హిందూ పూజారుల వేతనాల కోసం కానీ, మహా కుంభమేళా, అర్ధ కుంభమేళా వంటి కార్యక్రమాల సమయంలో ఏర్పాట్లు, నిర్వహణల కోసం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు, చేస్తున్న ఖర్చుల గురించి కానీ ఎలాంటి చర్చా రాలేదు.

కైలాశ్ మానసరోవర్ తీర్థయాత్ర కోసం హిందువులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి, ఉత్తరప్రదేశ్, గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు లభిస్తాయి.

1992-94 మధ్య హజ్ యాత్రకు సముద్ర మార్గాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పూర్తిగా మూసివేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, ఆయన మంత్రివర్గంలోని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఎ.ఆర్.అంతూలేలు.. భారతదేశంలో ముస్లింలకు హజ్ సబ్సిడీని ఒక వరంగా ప్రచారం చేశారు.

Image copyright Getty Images

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దైవభక్తి గల సాధారణ ముస్లింలకు వార్షిక హజ్ తీర్థయాత్ర గురించి పూర్తిగా తెలియదు.

దైవ విశ్వాసులు పవిత్ర హజ్ యాత్ర చేపట్టే ముందుగా తగినన్ని నిధులను సమీకరించుకోవాల్సి ఉంటుంది. అది హలాల్ కమాయీ - అంటే కష్టపడి సంపాదించింది అయి ఉండాలి. అప్పులు కానీ, డబ్బు మీద వచ్చిన వడ్డీ కానీ కూగూడదు.

హజ్ అనే పవిత్ర ఆరాధన.. ఆర్థికపరంగానూ ఆరోగ్యపరంగానూ తాహతు గల వాళ్లకు మాత్రమే - అది కూడా జీవితంలో ఒక్కసారి మాత్రమే తప్పనిసరి.

ఈ పవిత్ర యాత్ర కోసం ప్రభుత్వం నుంచి స్వల్ప మొత్తం పొందటమనేది ఎన్నడూ ఆకర్షణీయమైన అవకాశంగా లేదు.

బస, ఆహారం, రవాణా, మొబైల్ ఫోన్ సిమ్ కార్డు తదితరాలన్నిటికీ తమ కష్టార్జితం నుంచి చెల్లించటాన్నే హాజీలు ఇష్టపడ్డారు.

ఇక దిల్లీ - జెడ్డా - దిల్లీ, లేదా ముంబై - జెడ్డా - ముంబై విమాన చార్జీ సాధారణంగా రూ. 28,000 - 30,000 గా ఉంటే.. సబ్సిడీ చార్జీ రూ. 55,000 గా ఎందుకు ఉంది అనే అంశం మీద ప్రభుత్వం మౌనం దాల్చింది.

Image copyright Getty Images

‘‘హజ్ యాత్ర చేసేటపుడు ఏ రకమైన నిర్బంధ పరిస్థితి కూడా ఉండటం షరియాకు వ్యతిరేకం. ఖురాన్ ప్రకారం ఖర్చులు పెట్టుకోగలిగిన వారు మాత్రమే హజ్ యాత్ర చేయాలి. వయోజనులు, ఆర్థిక స్తోమత గల వాళ్లు, ఆరోగ్యంగా ఉన్న ముస్లింలు మాత్రమే ఈ యాత్ర చేయాలన్న నిర్దేశముంది’’ అని జమాయత్ ఉలేమా్-ఎ-హింద్ ప్రతినిధి మౌలానా మెహమూద్ మదానీ 2006లో ప్రకటించారు.

‘‘సాధారణ ముస్లింలు హజ్ సబ్సిడీకి అనుకూలం కాదు. మేము ఈ సబ్సిడీని ఎయిర్ ఇండియా లేదా సౌదీ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చే సబ్సిడీగానే పరిగణిస్తాం కానీ ముస్లిం ప్రజలకు ఇచ్చే సబ్సిడీగా కాదు. మేం ఏ రోజూ సబ్సిడీ కావాలని కోరలేదు. కానీ సాధారణ ఓటర్లకు, ముస్లిం ఓటర్లకు తామే మేలు చేస్తున్నామని చూపటానికి మాత్రమే ప్రభుత్వం ఈ సబ్సిడీని పట్టుపట్టి ఇస్తోంది’’ అని జఫారుల్ ఇస్లాం ఖాన్ పేర్కొన్నారు.

చివరికి.. హజ్ సబ్సిడీని రద్దు చేయాలని, పదేళ్లలో దశల వారీగా తొలగించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ సబ్సిడీ మొత్తం ప్రతి ఏటా పెరుగుతోందని.. 1994లో రూ. 10.51 కోట్లుగా ఉన్న మొత్తం 2011లో రూ. 685 కోట్లకు పెరిగిందని సుప్రీంకోర్టు తన తీర్పులో ఉటంకించింది. ప్రస్తుత సంవత్సరంలో హజ్ సబ్సిడీ రూ. 200 కోట్లు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పాకిస్తాన్‌ను టార్గెట్ చేసిన మోదీ.. ‘సొంత దేశాన్నే చూసుకోలేకపోతున్న వారు, భారత్‌లో ఏం చేసినా ఇబ్బంది పడిపోతున్నారు’

'మా అమ్మను, తోబుట్టువులను నా ముందే చంపేశారు.. చనిపోయినట్లు నటించి నేను బయటపడ్డా'

కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన

ప్రెస్ రివ్యూ: 'బాహుబలి' తీయకపోతే 'సైరా' వచ్చేది కాదు: చిరంజీవి

Howdy Modi: ‘ట్రంప్ కోసం ఎన్నికల ప్రచారం చేసిన పీఎం మోదీ’ - కాంగ్రెస్ పార్టీ విమర్శ

అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ పెచ్చు ఊడిపడి మహిళ మృతి

హూస్టన్‌లో మోదీ సభా ప్రాంగణం ఎదుట ఆర్టికల్ 370 సవరణకు వ్యతిరేకంగా నిరసనలు

గులాలాయీ ఇస్మాయిల్: పాకిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన మానవహక్కుల కార్యకర్త