ప్రెస్ రివ్యూ: తెలంగాణలో సకల నేరస్థుల సమగ్ర సర్వే

  • 18 జనవరి 2018
వేలిముద్రలు Image copyright Getty Images

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాతనేరస్థుల వివరాలు సేకరించేందుకు పోలీసు శాఖ గురువారం సకల నేరస్థుల సమగ్ర సర్వేను నిర్వహించనుందని 'నమస్తే తెలంగాణ' తెలిపింది.

పదేళ్ల నుంచి ఉన్న అన్ని రకాల నేరస్థుల వివరాలను పోలీసులు సేకరిస్తారు.

‘‘పోలీసులు ప్రతి నేరస్థుడి ఇంటికి వెళ్లి.. అతడు చేసిన నేరం, కేసు ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది, నేరస్థుడు ఏం చేస్తున్నాడు లాంటి వివరాలతోపాటు నేరస్థుడి ఫొటో, వేలిముద్రలు సేకరిస్తారు. రాష్ట్రంలో రైల్వే కేసుల్లో ఉన్న నేరస్థుల వివరాలు కూడా సేకరిస్తారు'' అని పత్రిక పేర్కొంది.

కాగా ఈ సర్వే ఇప్పటికే ప్రారంభమైంది. ఈ మేరకు ఈనాడు తెలిపింది.

Image copyright Getty Images

మొబైల్‌ ఇంటర్నెట్‌ లేకున్నా, ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులు చాటింగ్‌ చేసుకునేందుకు, వార్తలు చదువుకునేందుకు వీలుగా 'టోటల్‌' పేరిట కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు దేశీయ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ హైక్‌ తెలిపిందని 'ఈనాడు' చెప్పింది.

క్రీడాపోటీల వివరాలు తెలుసుకునేందుకు, జ్యోతిష్యానికి, రైల్‌ టికెట్ల బుకింగ్‌కు, నగదు బదిలీకి, చెల్లింపులకు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అయితే చిత్రాలు పంపుకొనేందుకు వీలుండదు.

'టోటల్' సదుపాయాన్ని అందించేందుకు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎయిర్‌సెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని ‘హైక్' తెలిపింది.

టోటల్‌ కోసం 20 ఎంబీ డేటా రూ.1కి లభిస్తుందని సంస్థ పేర్కొంది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో గోవును కోస్తున్న దళితులపై దాడి

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో పండుగ సందర్భంగా సోమవారం రాత్రి మాంసం కోసం గోవును కోసుకుంటున్న దళితులపై ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు దాడి చేశారని 'నవ తెలంగాణ' రాసింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా మాంసం కోసం దళితులు గోవులను కొనుక్కున్నారని పత్రిక పేర్కొంది.

‘‘సోమవారం అర్ధరాత్రి దళితవాడకు కొద్ది దూరంలో ఎర్ర చంద్రయ్య, ఎర్ర ఉప్పలయ్య, బొల్లారం యాదయ్య, ఎర్ర పోషయ్య, ఎర్ర మల్లయ్య, నర్సయ్య, ఉప్పలయ్య, సోమయ్య, బడే స్వామి, భూషాపాక ఎల్లయ్య తదితర దళితులు గోవును కోస్తున్నారు. యాదగిరిగుట్ట మండల కేంద్రం, పెద్దకందుకూర్‌ గ్రామం నుంచి గోసంరక్షణ పేరిట కోకల సందీప్‌, కట్టగొమ్ముల రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 30 మంది ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు బైక్‌లపై అక్కడికి చేరుకుని, వెంట తెచ్చుకున్న కర్రలతో దళితులపై దాడి చేశారు'' అని ప్రజాసంఘాల నాయకులు, బాధితులను ఉటంకిస్తూ 'నవ తెలంగాణ' చెప్పింది.

యూపీ: రద్దయిన నోట్లు భారీగా స్వాధీనం.. మూలాలు హైదరాబాద్‌లో..

రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను కొత్త నోట్లుగా మార్చేందుకు యత్నించిన 16 మందిని ఉత్తర్ ప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారని 'ఆంధ్రజ్యోతి' రాసింది.

వీరిలో ఇద్దరు హైదరాబాదీలని పత్రిక పేర్కొంది. ఈ నోట్ల ముఖవిలువ రూ.97 కోట్లని తెలిపింది.

కాన్పూర్‌కు చెందిన ఆనంద్‌ ఖత్రీ అనే బిల్డర్‌ పూర్వీకుల ఇంట్లో పోలీసులు ఈ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

''ఖత్రీ ఏజెంట్లు యూపీలోంచి రద్దయిన నోట్లను సేకరించి ఖత్రీకి అందజేస్తే.. ఆయన వాటిని హైదరాబాద్‌కు పంపించి కొత్త నోట్లుగా మారుస్తున్నారు'' అని యూపీ పోలీసులు పేర్కొన్నారు.

జైసింహా, అజ్ఞాతవాసి నిర్మాతల కార్యాలయాల్లో సోదాలు

బుధవారం హైదరాబాద్‌లో 'జైసింహా' చిత్ర నిర్మాత సి.కల్యాణ్, 'అజ్ఞాతవాసి' చిత్ర నిర్మాత రాధాకృష్ణ అలియాస్‌ చిన్నబాబుతోపాటు మరో నలుగురు సినీ ప్రముఖుల కార్యాలయాల్లో ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు దాడులు చేసినట్లు 'సాక్షి' తెలిపింది.

దాడుల్లో కీలక డాక్యుమెంట్లతోపాటు హార్డ్‌డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసిందని పత్రిక పేర్కొంది. సి.కల్యాణ్‌ నివాసంలోనూ సోదాలు జరిగినట్లు చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)