హజ్ యాత్ర-మానస సరోవర్ యాత్ర రాయితీ ఒకటేనా?

  • 18 జనవరి 2018
కుంభమేళ Image copyright Getty Images

హజ్‌ యాత్ర రాయితీ రద్దుపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. మరికొందరు నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒకవర్గంపై వివక్ష చూపిస్తోందని విమర్శిస్తున్నారు.

హజ్ యాత్ర రాయితీ రద్దుతో ఇప్పుడు అందరి దృష్టి ఇతర మతాల వారికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక రాయితీలపై పడింది.

ఇంతకీ ఇతర మతాల వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయా?

హజ్ యాత్రకు-మానస సరోవర్ యాత్రకు ప్రభుత్వం చేస్తున్న సాయం ఒకే రకమైందా?

ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశాలు ఏమిటి?'తీర్థయాత్రలకు ప్రభుత్వ సబ్సిడీ'

నిజంగానే ప్రభుత్వాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నాయా.? ఈ అంశంపై ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలిశాయి.

బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో తీర్థయాత్రల కోసం అనేక పథకాలు ఉన్నాయి.

వాటిలో ముఖ్యమైంది 'ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ యోజన'.

మధ్యప్రదేశ్‌ వెలుపల ఉన్న ఆలయాల సందర్శనకు వెళ్లే వారికి ఈ పథకం కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం చేస్తుంది.

ఏడాదికి లక్ష మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ఒక అంచనా.

ఈ పథకానికి దేవాదాయ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది.

బద్రినాథ్, కేదార్‌నాథ్, పూరీ, ద్వారక, హరిద్వార్, అమర్‌నాథ్, వైష్ణోదేవి ఆలయం, కాశి, తిరుపతి, అజ్మీర్ దర్గా, గయా, షిర్డీ, రామేశ్వరం ఇలా దేశవ్యాప్తంగా ఉన్న 15 ఆలయాలను 'ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ యోజన' కింద ఎంపిక చేశారు.

Image copyright Twitter / CMOMP

విదేశాల్లో ఉన్న ఆలయాల సందర్శనకూ సాయం!

విదేశాల్లో ఉన్న ఆలయాల సందర్శనకు కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక సాయం చేస్తోంది.

చైనా-టిబెట్‌ సరిహద్దుల్లో ఉన్న 'కైలాస్ మానస సరోవర్‌' యాత్రకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నగదు ఇస్తోంది.


ఆలయం దేశం మధ్యప్రదేశ్ ప్రభుత్వ సాయం
'మానస సరోవర్‌' యాత్ర టిబెట్-చైనా సరిహద్దు 30వేలు
హింగలాల్‌దేవి ఆలయం పాకిస్తాన్ 30వేలు
నంకానా సాహెబ్ గురుద్వారా పాకిస్తాన్ 30వేలు
అంకార్‌వత్ ఆలయం కాంబోడియా 30వేలు
సీతాదేవి ఆలయం శ్రీలంక 30వేలు

పాకిస్తాన్‌లో ఉన్న 'హింగలాల్‌దేవి ఆలయం', గురునానక్‌ జన్మస్థలమైన 'నంకానా సాహెబ్‌ గురుద్వారా', కాంబోడియాలోని 'అంకార్‌వత్' ఆలయాల సందర్శనకు వెళ్లే వారికి ప్రభుత్వం రాయితీ ఇస్తోంది.

శ్రీలంకలో ఉన్న సీతాదేవి ఆలయం, అశోక వనం యాత్రకు కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాయం చేస్తోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కాంబోడియాలోని 'అంకార్‌వత్' ఆలయం

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఎంత ఇస్తోంది!

యాత్రకు అయ్యే మొత్తం ఖర్చులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 50 శాతం చెల్లిస్తుంది. గరిష్టంగా 30వేల రూపాయలు ఇస్తుంది.

అయితే, ఒక్కో పథకానికి ఒక్కోరకంగా నిబంధనలు ఉన్నాయి.

మానస సరోవర్ యాత్రకు వెళ్లొచ్చినట్లు సరైన ఆధారాలు చూపిస్తేనే రాయితీ డబ్బులు చెల్లిస్తోంది.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం.

భక్తులను యాత్రలకు తీసుకెళ్లేందుకు మధ్యప్రదేశ్‌లో దేవాదాయ శాఖ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉన్నాయి.

అయితే, మతంతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ యాత్రలకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Image copyright MEA
చిత్రం శీర్షిక భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో కైలాస్ మానస సరోవర్ యాత్ర కొనసాగుతుంది.

'మానస సరోవర్ యాత్ర విశేషాలు'

'చైనా-టిబెట్ సరిహద్దుల్లో ఉన్న మానస సరోవర్ యాత్రకు ప్రభుత్వ పరంగా 'రాయితీ ఇస్తున్నారు' అన్నది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఇందులో వాస్తవం ఎంత?

ప్రతీ ఏడాది జూన్ - సెప్టెంబర్ మధ్య కాలంలో కైలాస్ మానస సరోవర్ యాత్ర జరుగుతుంది.


మానస సరోవర్ యాత్ర విశేషాలు

  • * 24 రోజుల పాటు సాగనున్న యాత్ర

  • * 1.60లక్షల నుంచి 2.5 లక్షలు ఒక్కో భక్తుడికి అయ్యే ఖర్చు

  • * ఎలాంటి సబ్సిడీ యాత్రికులకు ఇవ్వడం లేదన్న భారత ప్రభుత్వం

  • * 20వేల నుంచి రూ.లక్ష వరకు యాత్రికులకు రాష్ట్రాల సాయం

Getty Images

ఉత్తరాఖండ్, దిల్లీ, సిక్కిం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భారత విదేశాంగ శాఖ దీన్ని నిర్వహిస్తోంది.

యాత్రికులకు ఎలాంటి సబ్సిడీ ఇవ్వడం లేదని భారత ప్రభుత్వం చెబుతోంది.

కొన్నిరాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం యాత్రికులకు రూ.20 వేల నుంచి లక్ష రూపాయల దాకా సాయం చేస్తున్నాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చార్‌ధామ్ యాత్రలకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక సాయం చేస్తున్నాయి

'సరోవర్ యాత్రకు యూపీ రాయితీ లక్ష'

మానస సరోవర్ యాత్రకు రాయితీల విషయంలో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది.

మానస సరోవర్‌ యాత్రకు వెళ్లే వారికి యూపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు ఇస్తోంది.

పాతిక వేలు ఉన్న ఈ రాయితీని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ 50వేలకు పెంచితే, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 50వేలను లక్షకు పెంచేసింది.

బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌ కూడా మానస సరోవర్ యాత్రికులకు లక్ష చొప్పున ఆర్ధిక సాయం చేస్తోంది.


యాత్ర పేరు రాష్ట్రం ఆర్ధిక సాయం
కైలాస్ మానస సరోవర్ ఉత్తరప్రదేశ్ రూ.లక్ష
కైలాస్ మానస సరోవర్ రాజస్థాన్ రూ.లక్ష
కైలాస్ మానస సరోవర్ హరియాణా రూ.50వేలు
కైలాస్ మానస సరోవర్ తమిళనాడు రూ.50వేలు
కైలాస్ మానస సరోవర్ గుజరాత్‌ రూ.20వేలు
కైలాస్ మానస సరోవర్ మధ్యప్రదేశ్‌, కర్ణాటక రూ.30వేలు
కైలాస్ మానస సరోవర్ చత్తీస్‌గఢ్‌ రూ.25వేలు

గుజరాత్‌ అయితే 1998 నుంచే సరోవర్ యాత్రకు 20వేలు సబ్సిడీ ఇస్తోంది.

సరోవర్ యాత్రకు వెళ్లే వారు దిల్లీలో ఫార్మాలిటీలు పూర్తయ్యే వరకు వారి బస, భోజనం ఖర్చులను దిల్లీ ప్రభుత్వమే భరిస్తుంది.

అంతేకాదు, దిల్లీలో కూడా ముఖ్యమంత్రి యాత్రా దర్శన్ పథకం ఉంది. ఏడాదికి 77వేల మందికి దీని ద్వారా అవకాశం కల్పిస్తారు.

Image copyright AFP

రాజ్యాంగం ఏం చెబుతోంది?

ఏ ఒక్క మతాన్ని ప్రభుత్వం ప్రోత్సహించరాదని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 27 చెబుతోంది.

దాని ప్రకారం హజ్‌ రాయితీని క్రమక్రమంగా తగ్గించాలని 2012లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు పదేళ్ల గడువు విధించింది.

హజ్‌ యాత్రకు ఇచ్చే సబ్సిడీ డబ్బులను మైనార్టీల సంక్షేమానికి ఉపయోగించాలని సుప్రీంకోర్టు సూచించింది.


తగ్గుతూ వస్తున్న హజ్ సబ్సిడీ
సంవత్సరం రాయితీ
2012-2013 రూ.836కోట్లు
2013-2014 రూ.691కోట్లు
2016 రూ.408కోట్లు
2017 రూ.200 కోట్లు

హజ్ సబ్సిడీ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా.. ఖురాన్ కూడా దీన్ని సమర్థించదని కోర్టు అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హజ్ సబ్సిడీని కేంద్రం తగ్గిస్తూ వస్తోంది.

2012-2013లో 836 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం 2013-14లో 691కోట్లు, 2016లో 408కోట్లు, 2017లో 200కోట్లు హజ్ యాత్ర రాయితీ కోసం కేటాయించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కుంభమేళాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి

కుంభమేళాల్లో కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు

కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మతపరమైన కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

హజ్‌ యాత్రతో పాటు కైలాస్ సరోవర్ యాత్ర కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

సరోవర్ యాత్రలో భాగంగా ఒక్కో యాత్రికుడి బస, భోజనం కోసం భారత్ సుమారు 6వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు.

కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఖండిస్తోంది. హిందూ కుంభమేళాల్లో ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి.

హరిద్వార్, అలహాబాద్, నాసిక్, ఉజ్జయిని కుంభమేళాలకు భారీగా ఖర్చు చేశారు.

కుంభమేళాకు వేలాది మంది వస్తారు కాబట్టి, ఆ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఏర్పాట్లు చేయడం ప్రభుత్వ కర్తవ్యం.

అందుకోసం కేంద్ర రాష్ట్రాలు భారీగా నిధులు కేటాయిస్తున్నాయి.

Image copyright upcmo

2016లో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఉజ్జయిని సింహస్త మహాకుంభమేళా కోసం కేంద్ర సాంస్కృతిక శాఖ 100కోట్లు కేటాయించింది.

12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే సింహస్త కుంభమేళా కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3400 కోట్లు కేటాయించినట్లు స్థానిక వార్తా పత్రికలు పేర్కొన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో 2019లో జరగాల్సిన 'అర్ధ్ కుంభమేళా' కోసం రూ.2500కోట్లు ఖర్చు పెడతామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

అంతేకాదు, సరోవర్ యాత్రికుల కోసం ఘాజియాబాద్‌లో 'కైలాస్ మానస సరోవర్ భవన్‌'కు గత సెప్టెంబర్‌లో యోగి శంకుస్థాపన చేశారు. సుమారు వంద కోట్లతో దీన్ని నిర్మించబోతున్నారు.

Image copyright Getty Images

2013లో అలహాబాద్‌లో నిర్వహించిన మహా కుంభమేళాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1017.37 కోట్లు ఖర్చు చేశాయని కంప్ట్ర్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్ తన నివేదికలో తేల్చింది.

ఇందులో రూ.800 కోట్లు భారత ప్రభుత్వం రాష్ట్రానికి గ్రాంట్‌గా ఇచ్చింది. ఆ తర్వాత మరిన్ని నిధులు కేటాయించింది. మొత్తంగా 1141.63కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు కాగ్ గుర్తించింది.


కుంభమేళా ఏర్పాట్లకు భారీగా ఖర్చు

  • * రూ.1017.37 కోట్లు 2013 అలహాబాద్‌ కుంభమేళా ఏర్పాట్ల ఖర్చు

  • * రూ.800 కోట్లు రాష్ట్రానికి గ్రాంట్‌గా ఇచ్చిన భారత ప్రభుత్వం

  • * రూ.969.17 కోట్ల ఖర్చుకు సరైన ఆధారాలు లేవు

Getty Images

హరియాణాలో రెండు రకాల యాత్రలు ఉన్నాయి. సింధూ దర్శన్ పేరుతో లడక్ వెళ్లే యాత్రికులకు ఏటా 10వేల చొప్పున 50మందికి సబ్సిడీ ఇస్తోంది.

అలాగే, సరోవర్ యాత్రకు వెళ్లే వారికి ఒక్కొక్కరికి 50వేల చొప్పున మరో 50 మందికి ఇస్తోంది.

2016-17 ఆర్ధిక సంవత్సరంలో ఇందుకోసం హరియాణా ప్రభుత్వం 30 లక్షలు కేటాయించినట్లు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌'కథనం పేర్కొంది.

Image copyright SRILANKA TOURISM
చిత్రం శీర్షిక శ్రీలంకలో ఉన్న సీతాదేవి ఆలయం

విమాన ప్రయాణంలో రాజస్థాన్ రాయితీ!

తీర్థ యాత్రలకు విమానంలో వెళ్లేవారికి కూడా రాజస్థాన్ ప్రభుత్వం రాయితీ ఇస్తోంది.

రాజస్థాన్‌ ప్రభుత్వం గతేడాది 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ వరిష్ట్‌ నాగరిక్ తీర్థ్ యోజన' ప్రారంభించింది.

తీర్థ యాత్రలకు వెళ్లే 65 ఏళ్లు దాటిన వృద్ధులకు విమాన ప్రయాణంలో రాయితీ సౌకర్యం కల్పించింది.

ప్రస్తుతం ఈ పథకం కింద 13 ఆలయాలను చూసి రావొచ్చు.

2013 నుంచి 80 వేల మంది లబ్ది పొందారు. 5762 మంది విమాన యానం చేశారు. ఇందుకోసం 125 కోట్లు ఖర్చు చేసింది.


రాష్ట్రం యాత్ర పథకాలు
రాజస్థాన్‌ 'దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్ వరిష్ట్‌ నాగరిక్ తీర్థ్ యోజన'
కర్ణాటక తీర్థయాత్ర
అస్సోం (కాంగ్రెస్ ప్రభుత్వం) ధర్మజ్యోతి
అస్సోం (బీజేపీ ప్రభుత్వం) 'పుణ్యధామ్ యాత్ర'
మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ యోజన

కర్ణాటకలో తీర్థయాత్ర పేరుతో ప్రభుత్వం ఏటా 5కోట్లు ఖర్చు చేస్తోంది. చార్ ధామ్ యాత్రకు వెళ్లే వారికి 20వేల ఆర్థిక సాయం చేస్తోంది.

జెరూసలెం వెళ్లే క్రిస్టియన్లకు, మానస సరోవర్ వెళ్లే హిందువులకు 2012 నుంచి తమిళనాడు ఆర్థిక సాయం చేస్తోంది.

2004-05లో అసోంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ధర్మజ్యోతి పథకం ప్రారంభించింది.

వివిధ తీర్థయాత్రలకు వెళ్లే వారికి 50శాతం సబ్సిడీ ఇస్తోంది.

1.33 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి 3కోట్ల రూపాయలు కేటాయించారు.

అసోం బీజేపీ ప్రభుత్వం 2017లో 'పుణ్యధామ్ యాత్ర' ప్రారంభించింది.

3 వేల మంది యాత్రికులకు ఏసీ త్రీ టైర్‌లో ఉచిత రైలు ప్రయాణం, 3రోజుల వసతి, ఇతర ఖర్చులకు రోజుకు 150రూపాయలు ఇస్తోంది.

Image copyright Getty Images

పుష్కరాలను ఘనంగా నిర్వహించిన తెలుగు రాష్ట్రాలు

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తెలుగు రాష్ట్రాలు కూడా ఘనంగానే ఖర్చు చేస్తున్నాయి.

గోదావరి పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం 1000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. దేవాదాయ శాఖ అదనంగా 23.237కోట్లు ఖర్చు చేసింది. ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో పుష్కరాల కోసం 1360 కోట్లు కేటాయించింది.

కృష్ణా పుష్కరాల కోసం బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం 250కోట్లు కేటాయించింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.