BBC EXCLUSIVE: రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే..: కోదండరామ్ ఇంటర్వ్యూ

  • 18 జనవరి 2018
కోదండరామ్ Image copyright NOAH SEELAM/Getty Images

తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకుడు కోదండరామ్ త్వరలో పార్టీ పెట్టబోతున్నారు. మరో 15-30 రోజుల్లో పార్టీ ఏర్పాటు గురించి తుది నిర్ణయం ప్రకటించగలమని ఆయన చెప్పారు.

అయితే, తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ స్వరూప స్వభావాలపైన ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.

రాజకీయాల్లోకి రావాలనే ఒత్తిడి జేఏసీపై ఎప్పటి నుంచో ఉందని అంటూ, ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించాలనే నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.

"రాజకీయాలు కలుషితమైన నేపథ్యంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదు. మార్పు రావాలి. ఈ మార్పు రావాలంటే రాజకీయాల్లోకి రావాలని జేఏసీ, జేఏసీకి అనుబంధంగా ఉండే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం మేరకు ప్రచారం ప్రారంభించాం" అని కోదండరామ్ అన్నారు.

ప్రస్తుత రాజకీయాలు కాంట్రాక్టర్లు కేంద్రంగా నడుస్తున్నాయనీ, డబ్బే ప్రధానమై పోయిందనీ కోదండరామ్ ధ్వజమెత్తారు.

కోదండరామ్‌ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివే..

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపదిహేను రోజుల్లో కోదండరామ్ కొత్త పార్టీ

మీ రాజకీయాలు ఎలా భిన్నం? ఏమిటి ప్రత్యేకత?

ప్రస్తుతం రాజకీయ నాయకులంతా ఎవరి ప్రయోజనాలు వారే చూసుకుంటున్నారు. సమష్టి ప్రయోజనాలు పట్టించుకోవడం లేదు. ఇదే భావనను తీర్మానంగా తయారు చేసుకొని దానిని ప్రచారం చేయడం మొదలుపెట్టాం.

ఈ ప్రచారంలో మాకు తరచూ ఒక ప్రశ్న ఎదురవుతూ వచ్చింది. మీరు పౌర వేదికగానే రాజకీయాలు మారాలని ప్రచారం చేస్తారా? లేక రాజకీయాల్లోకి కూడా వస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. మొదట్లో మేం రాజకీయాల్లోకి రాము, పౌరవేదికగానే ప్రచారం చేస్తామని అన్నాం.

అప్పుడైతే అట్లా అన్నాం.. కానీ మీరు ఆశించిన మార్పులు రాజకీయ రంగంలో ఎవరు తీసుకొస్తారు అనే ప్రశ్న అడుగుతున్నారు. అది మాకు కూడా వాస్తవమే అనిపించింది. ఆ తరువాత రాజకీయాల్లో నిలబడి మార్పు కోసం ప్రయత్నించాలనే ఆలోచనకు వచ్చాం. స్థూలంగా చెప్పాలంటే, టీఆర్ఎస్ రాజకీయాల పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. దీనికి ప్రత్యామ్నాయమైన రాజకీయాలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Image copyright facebook/tjaconline

అసలు పార్టీ ఏర్పాటు ఆలోచన ఎలా మొదలైంది?

ప్రత్యామ్నాయ రాజకీయాలనేవి కాంట్రాక్టర్లు కేంద్రంగా కాకుండా ప్రజలు కేంద్రంగా ఉండాలి అనే బలమైన అభిప్రాయం ముందుకు వచ్చింది.

అయితే ఈ విషయంలో ఏ రకంగా ముందుకు పోవాలనే విషయంపై మాకు ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.

మొదట అనుకున్నది ఏమంటే ఏదైనా పార్టీలో చేరడం. అయితే ఇది కుదరదు. ఆ పార్టీల వ్యవహార శైలి మనకు ఆమోదయోగ్యం కాదు కాబట్టి మనం ఇతర పార్టీలలో చేరలేమనే అభిప్రాయానికి వచ్చినాం.

మేము జేఏసీగా ఉంటూనే, భావసారూప్యత కలిగిన వాళ్లను ఒకతాటి మీదకు తెచ్చి ఒక వేదికగా రాజకీయాల్లో మార్పుకోసం ప్రయత్నం చేయడమనేది ఒక మార్గం.

రెండో మార్గం ఏమిటంటే, జేఏసీని నిలబెట్టుకుంటూనే, ఒక రాజకీయ పార్టీ పెట్టి, దాని ఆధ్వర్యంలో మార్పు కోసం అందరితో కలసి పనిచేయాలి. వీటిలో ఏ మార్గం ఎంచుకోవాలన్నదానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

బహుశా ఓ పదిహేను రోజులు లేదా నెల రోజుల లోపల ఈ విషయానికి సంబంధించి తుది నిర్ణయానికి వస్తాం.

Image copyright facebookt/jaconline

అభివృద్ధి నమూనాపై అభ్యంతరమేంటి?

తెలంగాణ అభివృద్ధి నమూనా ఎట్లుండాలే? తెలంగాణ పరిస్థితులు, ఉద్యమ నేపథ్యంలో ఈ నమూనాను నిర్మించుకోవాలి. అలా కాకుండా ఉమ్మడి రాష్ట్ర నమూనాను కొనసాగించడం సరైనది కాదనేది మా అభిప్రాయం.

నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన అభివృద్ధి పంథానే కొనసాగిస్తోంది.

కాంట్రాక్టర్లు, ప్రైవేటు, కార్పొరేటు శక్తులకు మేలు కలగించడం ప్రధాన లక్ష్యంగా ఈ నమూనా ఉంది. వాళ్ల కోసం ప్రాజెక్టులను డిజైన్ చేయడం, బడ్జెట్లో కేటాయింపులు చేయడం, వాళ్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్ కేంద్రంగా పథకాలను తయారు చేయడం - ఇదీ ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి నమూనా ముఖ్య లక్షణం.

తెలంగాణ వచ్చినాటి నుంచే ఈ పద్ధతిని మేం సంపూర్ణంగా తిరస్కరిస్తూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. ప్రజలు కేంద్రంగా ఉండే అభివృద్ధి నమూనాను రూపొందించుకోవాలి. ఇందులో బతుకుదెరువు కల్పన అనేది ప్రధానాంశంగా ఉండాలి.

వ్యవసాయంలో బతుకుదెరువును ఎట్లా పెంచగలుగుతాం? చేతి వృత్తుల వారి జీవితాలను ఎట్ల నిలబెట్టగలుగుతాం? చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి ఉపాధిని ఎలా కల్పించగలుగుతాం? ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించడానికి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి? ఇందుకు చట్టాలను ఎలా తయారు చేయాలే అని ఆలోచించడం ఎంతో అవసరం.

Image copyright facebookt/jaconline

'బంగారు తెలంగాణ'లో ఘర్షణ ఎక్కడ? ఎందుకు?

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా హేతుబద్ధంగా ఉండాలి. ఒక కేలండర్‌ను ప్రకటించి ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయాలి. ఇవి ప్రభుత్వం చేయాలని మేం కోరుతున్నాం.

నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందేలా చేయాలి. అత్యంత వెనుకబడిన ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు కూడా అవసరం. అయితే వీటి విషయంలో ప్రభుత్వం పట్టింపును చూపలేదు.

బడ్జెట్లు సరిపోక అప్పులు తెచ్చి మరీ కాంట్రాక్టర్లకు మేలు చేశారు తప్ప ప్రజలకు బతుకుదెరువును చూపలేక పోయారు. ఉన్న ఉపాధి అవకాశాలు కూడా రోజురోజుకు కుదించుకు పోతున్నాయ్. వీటిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

వీటిపై సూచనలు చేశాం. చర్చలు నిర్వహించాం. కోర్టు దాకా వెళ్లి న్యాయాన్ని సాధించుకునే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ ప్రభుత్వం కక్ష పూరితంగా ఆలోచించిందే తప్ప మా ప్రతిపాదనలపై చర్చించడానికి సిద్ధపడలేదు. అందువల్లనే ఘర్షణ తలెత్తుతోంది. ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచించుకోవ్సాలిన అవసరం ఏర్పడుతోంది.

Image copyright facebookt/jaconline

కాంగ్రెస్‌తో చేయి కలిపి పని చేస్తున్నది నిజం కాదా?

కాంగ్రెస్‌తో కొన్ని విషయాల్లో కలిసి పని చేసిన మాట వాస్తవమే. అయితే కేవలం కాంగ్రెస్‌తోనే కాదు, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ ఇలా అన్ని పార్టీలతో కలిసి పని చేశాం. అందరితోనూ కలిసి ఆందోళనలు చేశాం.

ఎప్పుడైతే ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏర్పడిందో, మొత్తం రాజకీయ రంగం కదలాల్సిన పరిస్థితి తలెత్తిందో అలాంటి సందర్భాల్లో అందరితో కలవాల్సి వచ్చింది.

అసెంబ్లీలో చర్చల సందర్భంగా మా అభిప్రాయాలను బలంగా వినిపించేందుకు అన్ని పార్టీలను సంప్రదించాం.

Image copyright facebookt/jaconline

ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారనే ఆరోపణలపై ఏమంటారు?

ప్రాజెక్టుల విషయంలో నిర్వాసితుల పట్ల ప్రజాస్వామ్య వైఖరిని అవలంబించాలి. ప్రజలను పిలిచి వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించి ఉంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు.

మొదటి రెండు సంవత్సరాలు మేం ఏం చెప్పామంటే.. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వండి. లేదంటే వారికి నష్టం కలుగుతుంది. కానీ ప్రభుత్వం వినలేదు. ఇష్టానుసారంగా చేస్తున్నారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులు ఒక్క రూ.లక్ష ఎక్కువ ఇవ్వాలని బతిమిలాడారు. రూ.లక్ష కాదు కదా ఒక్క పైస కూడా ఎక్కువ ఇవ్వం. తీసుకుంటే తీసుకోండి లేకుంటే భూములు గుంజుకుంటం అన్నారు.

కేవలం మల్లన్న సాగర్ విషయంలోనే కాదు మహబూబ్‌నగర్‌లోనూ చాలా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. జీవో 123 ప్రకారం భూసేకరణ సరైన పద్ధతి కాదని మేం ప్రభుత్వానికి చెప్పాం. 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేయాలని కోరాం.

చట్టాలను వదలిపెట్టి జీవోల ప్రకారం భూసేకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కూడా చెప్పాం. బాధితులకు న్యాయం చేయమని అడిగాం. కానీ ప్రాజెక్టులు వద్దని మేం ఎప్పుడూ అనలేదు. బాధితులు న్యాయం కోసం కోర్టులకు వెళ్తారు. ఇదంతా ఎవరో కావాలని చేశారు? వారి వెనుక ఎవరో ఉన్నారు? అని అనుకుంటే ఎట్ల?

ప్రాజెక్టులను సక్రమంగా పూర్తి చేయలేక ప్రభుత్వం ఇటువంటి దుష్ర్పచారాలకు తెరతీస్తోంది. ఈ ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. 'ఎగరలేక పందిరి గూల్చ' అన్నట్టుగా, తమ విధానాలలోని లోపాలను ఇతరులపై వేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది.

Image copyright facebookt/jaconline

కొలువులు ఇస్తామని సర్కారే అంటుంటే కొట్లాటెందుకు?

ఉద్యోగాల విషయంలో ఇష్టానుసారం చేస్తానంటే కుదరదు. తెలంగాణ రాక ముందు రెండు మూడేళ్లపాటు ఉద్యోగాలు లేవు. కొన్ని నోటిఫికేషన్లు వచ్చినా మన తెలంగాణలో మనకు ఉద్యోగాలు వస్తయి కదా అనే దానితో చాలా మంది నాడు ఉద్యోగాలు వద్దు అనుకున్నారు. పరీక్షలు బాయ్‌కాట్ చేశారు.

తెలంగాణ వచ్చి రెండు, మూడేళ్లు అవుతున్నా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోతే యువత భవిష్యత్తు ఏం కావాలే? అప్పుడు అడగడం తప్పు ఎట్ల అవుతది? అందుకే మేం అడిగినం. అడిగిన తరువాత రెండు నోటిఫికేషన్లు వచ్చాయి. ఒకటి రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లు, రెండు డీఎస్‌సీ.

2017 ఫిబ్రవరిలో మేం అడిగిన తరువాత ప్రభుత్వం మేల్కొని ఈ నోటిఫికేషన్లు వేయడం ప్రారంభించింది. ఆ తరువాత మళ్లీ కొలువుల కొట్లాట వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మేం ఉద్యోగాలను భర్తీ చేస్తం కదా మీకెందుకు అంటున్నది.

కానీ ఉద్యోగాల భర్తీ అనేది ఇష్టారాజ్యం కాదని మేం అంటున్నం. కేలెండర్ ఎందుకు వేయడం లేదని ప్రశ్నిస్తున్నం. వాస్తవానికి ఇవాళ్టి బడ్జెట్ పరిస్థితుల్లో ఉద్యోగాలను భర్తీ చేయలేని పరిస్థితి ఉంది. అందువల్ల ఉద్యోగాల భర్తీ ప్రస్తుతానికి కాకపోవచ్చనే అనుమానం, భయం కలుగుతోంది. ఉద్యోగాలు రావడం లేదనే రందితోనే యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు.

మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారనే వ్యాఖ్యలపై మీరేమంటారు?

మమ్మల్ని మేం ఎక్కువగా ఊహించుకోవడం లేదు. మా శక్తి మేరకు మేం చేయగలిగింది చేస్తున్నం.

ఒక పౌర వేదికకు కొన్ని పరిమితులున్నాయి. అంతకు మించి చేయాలంటే ఒక రాజకీయ రూపం అవసరమేమో అనే అభిప్రాయం చాలా బలంగా ముందుకు వచ్చింది. ఈ మేరకే కార్యాచరణ రూపొందించుకుంటున్నాం.

"రెడ్డి కుల ప్రయోజనాల కోసమే కోదండరామ్ ముందుకు వస్తున్నారు" అన్న విమర్శపై ఏమంటారు?

2004 నుంచి 2014 వరకు టీఆర్ఎస్‌తో కలిసి పని చేసినం. అప్పుడు మా కులం ఏందో ఇప్పుడూ మా కులం అదే. ఆనాడు పదేళ్లలో రాని కులం ప్రస్తావన ఇప్పుడు ఎందుకు ముందుకు వస్తోంది? ఇది చాలా విచిత్రకరం. నాడు రెడ్డిలకు మేం అను కూలంగా పని చేస్తున్నామనే అనుమానం వారికి రాలేదా?

ఇవన్నీ కావాలని వేస్తున్న నిందలు తప్ప వాటిలో వాస్తవం లేదు. మాదో కమిటీ, ఇది తీసుకునే నిర్ణయాల ఆధారంగా మేం ముందుకు పోతాం. రకరకాల సామాజిక వర్గాల నుంచి వచ్చిన వారు, రకరకాల నేపథ్యాలు గలవారు ఈ కమిటీలో ఉన్నారు.

ముఖ్యమంత్రిగారే అన్ని నిర్ణయాలు తీసుకునే సంప్రదాయం మీది. అందరం కలిసి నిర్ణయాలు తీసుకునే ఆలోచన మాది. ఇది బురద జల్లే ప్రయత్నమే తప్ప వేరే కాదు.

Image copyright facebookt/jaconline

'ముక్కు సూటిగా మాట్లాడే బడి పంతులు' రాజకీయాలు నడిపించగలరా?

మేం ఎంచుకునే మార్గాన్ని బట్టి మాకు సవాళ్లు ఉంటాయి. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పాత్ర భిన్నంగా ఉంటుంది. ప్రజలు చూసే విధానంలో తేడా ఉంటుంది. 'నువ్వు ముక్కుసూటిగా పోతవు. రాజకీయాల్లో ఎలా నెగ్గుకొస్తవు' అని అనే వాళ్లున్నారు. ఇలాంటి ఇబ్బందులు వస్తయ్.

మనం మన బలం, బలహీనతలు సరిగ్గా బేరీజు వేసుకోవాలని నేను చెబుతుంటా. మన ముక్కుసూటి తనాన్నే బలంగా చేసుకోవాలి అని నేను మా వాళ్లతో అంటాను.

ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం కష్టపడాల్సిందే తప్ప, వారిలా మనం మారిపోవాలని అనుకుంటే 'పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే' అవుతుంది.

నాయకుడు అంటే పెద్ద కారులో దిగుతాడు. జేబుల నిండా డబ్బులు ఉంటాయ్. ఎంత కావాలంటే అంత తీసుకొచ్చి ఎన్నికల్లో పంచుతాడు. గెలుస్తాడు. అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీనిని మార్చాలని మేం భావిస్తున్నాం.

వావిలాల గోపాలకృష్ణయ్య, శాంతా బాయి, కొమ్మిని నరసింహా రెడ్డి వంటి వారు నిస్వార్థంగా పని చేశారు. వారిని మనం మరచి పోకూడదు. నెల్లూరులో బంగారయ్య గారు ఉండే వారు. ఇక్కడ కొండా లక్ష్మణ బాపూజీ గారూ ఉన్నారు. వాళ్లంతా డబ్బులు పోగు చేసుకోలేదు కదా?

రాజకీయ నాయకులంటే ఇట్లాగే ఉండాలి అనే అభిప్రాయాన్ని మార్చాలి. రాజకీయ నాయకులు ఇట్లా కూడా ఉండాలి అని చూపగలగాలి.

హీరో అంటే ఒకేసారి ఇరవై మందిని కొడతాడు అనే ఇమేజి జనంలో ఉంటుంది. మరోవైపు హీరో అంటే ప్రజలతో పాటు కలిసి జీవిస్తుంటాడు అని చూపించిన సినిమాలూ ఉన్నాయి. అవి కూడా నడిచాయి.

(కేసీఆర్‌తో ఎక్కడ చెడింది? తెలంగాణకు దళిత ముఖ్యమంత్రి ఎప్పుడు? కోయ-లంబాడా ఘర్షణకు పరిష్కారం? వీటిపై కోదండరామ్ ఏమన్నారు.. తర్వాతి భాగంలో)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)